శంకరాభరణంలో క్రైమ్!
ఆ యువకుడు అత్యంత సంపన్నుడి కొడుకు. యూఎస్‌లో ఉంటాడు. ప్రపంచంలో సుఖపడే జాతి, కష్టపడే జాతి.. ఈ రెండు జాతులే ఉంటాయన్నది ఆ యువకుడి అభిప్రాయం. తనేమో సుఖపడే టైప్ అనుకుంటాడు. కానీ, ఓ పని మీద ఇండియా వచ్చిన అతను కష్టాలపాలవుతాడు. ఈ సుఖపురుషుడు ఆ కష్టాలను ఎలా అధిగమించాడు... అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘శంకరాభరణం’. ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ వారంతో పూర్తవుతుంది.
‘‘హారర్‌కి కామెడీ మిక్స్ చేసి మేం తీసిన ‘గీతాంజలి’ మంచి విజయం సాధించింది. క్రైమ్, కామెడీని మిక్స్ చేసి ఈ ‘శంకరాభరణం’ తీస్తున్నాం’’ అని కోన వెంకట్ చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘భారీ నిర్మాణ వ్యయంతో నలభై మంది తారాగణంతో నిర్మిస్తున్నాం. బీహార్‌లోని ప్రమాదకరమైన లొకేషన్స్‌లో, పుణేకి సమీపంలో ఎవరూ చేయని లొకేషన్స్‌లో, యూఎస్‌లో కొంత శాతం చిత్రీకరించాం. వచ్చే నెల పాటలను, దీపావళికి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.
నందిత కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అంజలి స్పెషల్ రోల్ చేశారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: వెంకటేశ్ కిలారు, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కెమెరా: సాయి శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి, సహనిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరరావు.