‘మళ్లీ కమెడియన్‌గా మారలేను’ | Santhanam Said that he would Not Return to Play Comedy Roles | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 3 2019 10:33 AM | Last Updated on Sun, Feb 3 2019 10:33 AM

Santhanam Said that he would Not Return to Play Comedy Roles - Sakshi

మళ్లీ కమెడియన్‌గా మారడం జరగదు అంటున్నాడు కమెడియన్‌ నుంచి కథానాయకుడిగా మారిన నటుడు సంతానం. ఈయన హీరోగా నటించి నిర్మించిన తాజా చిత్రం దిల్లుక్కు దుడ్డు 2. ఇంతకుముందు సంతానం హీరోగా రాంబాలా దర్శకుడిగా పరిచయమై తెరకెక్కించిన చిత్రం దిల్లుక్కు దుడ్డు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో దానికి సీక్వెల్‌గా అదే కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం దిల్లుక్కు దుడ్డు 2.

మలయాళీ నటి శ్రితా శివదాస్‌ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న ఈ సినిమాలో మొట్టరాజేంద్రన్, విజయ్‌ టీవీ.రామర్‌. బిపిన్, శివశంకర్‌మాస్టర్, మారిముత్తు, జయప్రకాశ్, ప్రశాంత్, విజయ్‌ టీవీ ధనశేఖర్, సీఎం.కార్తీక్, నటి ఊర్వశి ముఖ్య పాత్రల్లో నటించారు. షబ్బీర్‌ సంగీతాన్ని, దీపక్‌కుమార్‌ పది ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలకు రెడీ అవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ శనివారం ఉదయం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరులు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దిల్లుక్కు దుడ్డు చిత్రంలో చివరి 20 నిమిషాలకు ప్రేక్షకులు విరగబడి నవ్వుకున్నారన్నారు. అలా ఈ సీక్వెల్‌లో చిత్రమంతా ఉండాలని భావించామన్నారు. అదేవిధంగా తన చిత్ర టీమ్‌ కథను తయారు చేసిందని చెప్పారు.

దిల్లుక్కు దుడ్డు చిత్రంలో కథకు ముస్లిం యువతి అవసరం కావడంతో బాలీవుడ్‌ నటిని హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నామని, ఈ చిత్రంలో మలయాళీ యువత కథకు అవసరం అవడంతో కేరళ నటి శ్రితాశివదాస్‌ను ఎంపిక చేసినట్లు చెప్పారు. హర్రర్, కామెడీ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం బాగా వచ్చిందని తెలిపారు. నటుడిగా కంటే నిర్మాతగా చిత్రం చేయడం కష్టం అని అన్నారు.

అదేవిధంగా ఏడాదికి ఒక చిత్రమే చేయాలని తాను అనుకోలేదని, ఇప్పటికే నటించిన మూడు చిత్రాలు విడుదల కావలసి ఉన్నాయని అన్నారు. హీరోగా అవకాశాలు లేకపోతే మళ్లీ కమెడియన్‌గా నటించే ఆలోచన లేదన్నారు. దర్శకత్వం చేస్తానని, అలా తన తొలి చిత్రాన్ని ఆర్య హీరోగా చేస్తానని అన్నారు. ఎలాంటి కథా చిత్రం చేసినా, అది మంచి చిత్రంగా ఉండాలన్నదే తన భావన అని చెప్పారు. ఇకపోతే ఆర్య పెళ్లి గురించి అడుగుతున్నారని, ఆ విషయాన్ని ఆయన్ని అడిగి చెబుతానని సంతానం అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement