
‘తను- నేను’లో హీరోగా చేసింది శోభన్ కొడుకే
‘వర్షం’ సినిమా డెరైక్టర్ శోభన్ గుర్తున్నారు కదూ! ఆయనకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనుకున్న సమయంలో అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు శోభన్ ప్రస్తావన ఎందుకంటే - ఇటీవల విడుదలైన ‘తను- నేను’లో హీరోగా చేసింది శోభన్ కొడుకే. ఆ అబ్బాయి పేరు సంతోష్ శోభన్. అతను హీరోగా మారడం వెనుక తల్లి సౌజన్య ప్రోత్సాహం ఉంది. తన కొడుకు భవిష్యత్తు గురించి, భర్త జ్ఞాపకాల గురించి సౌజన్య ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.
కొడుకుని హీరోగా తెరపై చూడకుండానే శోభన్‌గారు వెళ్లిపోయారు... కచ్చితంగా మీకు బాధ ఉండే ఉంటుంది...
ఆ బాధను మాటల్లో చెప్పలేనండి. మొదటిసారి సంతోష్‌ని తెరపై చూసినప్పుడు ఆనందం, ఆయన చూడలేక పోయారే అనే బాధ కలిగింది. అదో ఎమోషనల్ మూమెంట్.
దర్శకుడిగా శోభన్‌గారు రెండే సినిమాలు చేశారు. అనుకున్నంత స్థాయికి ఎదగలేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఉండి ఉండేవేమో..?
ఉండేవి. అయినా వాటిని మేం ఖాతరు చేయలేదు. ఎందుకంటే సినిమానే ప్రాణంగా బతికారాయన. అందుకే ఇబ్బందులను ఫేస్ చేశాం.
మరి.. అలాంటి ఇబ్బందులు ఉంటాయని తెలిసి కూడా సంతోష్‌ని సినిమా రంగంలోకి పంపించడం రిస్క్ అనిపించడంలేదా?
లేదు. ఎందుకంటే సినిమా అంటే నాకు గౌరవం. ఇబ్బందులనేవి ఎక్కడైనా ఉంటాయ్. ఫేస్ చేయాలి. మా సంతోష్‌కి చాలా మెచ్యుర్టీ ఉంది. ఒడుదొడుకులను తట్టుకునేంత మానసిక పరిపక్వత ఉంది.
శోభన్‌గారు ఉన్నప్పటి జీవితం.. లేనప్పటి జీవితం గురించి?
ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది. ‘అనగనగా ఓ శోభన్ ఉండేవాడు. ఫలానా సినిమాలకు రచయితగా చేసేవాడు. ‘బాబీ’, ‘వర్షం’ సినిమాలకు డెరైక్షన్ చేశాడు’ అని ఇతరులు ఆయన గురించి ఏదో జస్ట్ అలా చెప్పుకోవడం నాకిష్టం లేదు. ఆయన ఎప్పటికీ గుర్తుండిపోవాలన్నది నా కోరిక. నా ఇద్దరు కొడుకుల ద్వారా అది సాధ్యపడుతుంది. ‘శోభన్ కొడుకు హీరో అయ్యాడట’ అని అందరూ చెప్పుకుంటుంటే నా కళ్లు చెమర్చాయి (ఉద్వేగానికి గురవుతూ).
హీరోగా మొదటి రోజు కెమెరా ఫేస్ చేసినప్పుడు సంతోష్ తన తండ్రిని గుర్తు చేసుకున్నాడా?
గుర్తు చేసుకున్నాడు. షూటింగ్‌కి వెళ్లొచ్చిన తర్వాత ‘అమ్మా.. మేకప్‌మ్యాన్‌కీ, డెరైక్షన్ డిపార్ట్‌మెంట్‌వాళ్లకూనాన్న తెలుసట. అందరూ నాన్న గురించి బాగా చెప్పారు’ అన్నాడు.
పిల్లలను మీ భర్త ఎలా చూసుకునేవారు?
ప్రాణంగా చూసుకునేవారు. దోమలు కుట్టినా భరించేవారు కాదు. ఇంట్లో దోమలున్నాయ్.. ఏం చేస్తున్నావని నన్ను అరిచేవారు. ‘నాక్కనిపించని దోమలు మీకెలా కనిపిస్తున్నాయ్’ అనేదాన్ని.
శోభన్‌గారు చనిపోకముందు మీరు జాబ్ చేసేవారా?
హౌస్‌వైఫ్‌ని. పధ్నాలుగేళ్లు ఇంటిపట్టునే ఉన్నాను. ఆయన చనిపోయాకే జాబ్ మొదలుపెట్టాను. శోభన్‌గారు చనిపోయిన తర్వాత భరత్ ఠాకూర్‌గారి యోగా స్కూల్‌లో ఇన్‌స్ట్రక్టర్‌గా చేశాను. నాలుగేళ్లు అక్కడ చేశాక మెరీడియన్ స్కూల్‌లో ఓ రెండేళ్లు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్‌లో చేశాను. మెరీడియన్ స్కూల్స్ కర్నూలు ఎంపీ బుట్టా రేణుకగారివి. రెండేళ్లుగా ఆవిడకు పీఏగా చేస్తున్నాను. కర్నూలులోనే ఉంటాను. హైదరాబాద్‌లో మా అమ్మగారు, అన్నయ్య కుటుంబం ఉంటారు. పిల్లల్నిద్దర్నీ వాళ్లే చూసుకుంటారు. నేను వచ్చి వెళుతుంటాను.
ఓకే... ఒక తల్లిగా మీ అబ్బాయి నటన చూసి ఏమనిపించింది?
షాకయ్యాను. అంత బాగా నటిస్తాడనుకోలేదు. సినిమా చూసినవాళ్లందరూ హీరోగా పనికొస్తాడని అభినందించారు. అనుకోకుండా హీరో అయ్యాడు కాబట్టి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి కుదర్లేదు. అందుకని డ్యాన్స్ విషయంలో ఫెయిల్ అవుతానేమోనని భయపడేవాడు. మేనేజ్ చేసేశాడు. ఇప్పుడు డ్యాన్స్ కూడా నేర్చుకుంటున్నాడు. సంపూర్ణమైన హీరో అనిపించుకోవడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాడు. సంతోష్ హీరో కావడం ద్వారా మా కల నెరవేరింది. కుర్రాడు బాగున్నాడు.. టాలెంటెడ్ అని మొదటి సినిమాతోనే అనిపించుకున్నాడు. రామ్మోహన్‌గారు తన నుంచి మంచి నటన రాబట్టుకున్నారు. ఓ తల్లిగా మా అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను.