సర్దార్ గబ్బర్‌సింగ్.. రికార్డ్ రిలీజ్
సినిమా మొదలైన దగ్గర నుంచే సంచలనాలకు తెరతీసిన సర్దార్ గబ్బర్సింగ్ రిలీజ్ విషయంలో కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. గతంలో మరే తెలుగు సినిమా రిలీజ్ కాని విధంగా భారీగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న సర్దార్ గబ్బర్ సింగ్ ను సౌత్, నార్త్తో పాటు ఓవర్సీస్లో కూడా భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
సాధారణంగా అమెరికాలో తెలుగు సినిమాలు 100 థియేటర్ల లోపు రిలీజ్ అవుతాయి. కానీ సర్దార్‌ను మాత్రం ఏకంగా 188 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఓవర్సీస్ మొత్తంలో 42 దేశాల్లో 400కు పైగా థియేటర్లలో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్లో కూడా ఈ సినిమాను 800 స్క్రీన్స్ మీద రిలీజ్ చేయడానికి ఈరోస్ సంస్థ ప్లాన్ చేస్తోంది.
తెలుగు మార్కెట్ మరింత సంచలనంగా మారనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాతో పాటు మరేమి సినిమా రిలీజ్కు సాహసించటం లేదు కాబట్టి 1400 థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. వీటికితోడు చాలా ప్రాంతాల్లో బెనిఫిట్ షోలను కూడా భారీ సంఖ్యలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ హడావిడి చూస్తుంటే తొలిరోజు వసూళ్లో సర్దార్ రికార్డుల మోత మోగించటం గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తోంది.