‘‘తెలుగు సినిమాకు జాతీయస్థాయిలో గుర్తింపు రావడం గర్వంగా ఉంది. ‘దిల్’రాజు, సతీశ్ వేగేశ్నల కృషితో ‘శతమానం భవతి’కి జాతీయ అవార్డు లభించింది. తెలుగు చిత్రసీమకు అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చిన ఈ చిత్రబృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే, తోటి నిర్మాతను గౌరవించిన అల్లు అరవింద్‌గారిని అభినందిస్తున్నా’’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి.
శర్వానంద్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ‘శతమానం భవతి’కి అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ పురస్కారం వచ్చిన సందర్భంగా అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ తరపున చిత్రనిర్మాత, దర్శకుడు, హీరోలను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సన్మానించారు.
చిరంజీవి చేతుల మీదుగా ఈ సన్మానం కార్యక్రమం జరిగింది. ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘జీవితంలో గొప్ప ఘనత సాధించిన సమయంలోనే... పెద్ద అండ (భార్య)ను కోల్పోయాను. నా సన్నిహితులైన అరవింద్‌గారికి ఆ బాధ ఎలాంటిదో తెలుసు. జాతీయ పురస్కారం కంటే 15ఏళ్లుగా అరవింద్‌గారి వంటి మంచి వ్యకితో స్నేహాన్ని గొప్పదిగా భావిస్తున్నా’’ అన్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ – ‘‘మా ఆవిడ ‘శతమానం భవతి’ చూసి, ‘అప్పుడప్పుడూ ఇలాంటి సినిమాలు చెయ్యొచ్చు కదా’ అనడిగింది.
నేనూ ఇలాంటి మంచి కుటుంబ కథాచిత్రం చేయాలనుకుంటున్నా’’ అన్నారు. ‘‘ప్రేక్షకులకు మంచి చిత్రాలు అందించాలనే ‘దిల్’ రాజు తపనే అవార్డు రావడానికి కారణమైంది’’ అన్నారు అల్లు అరవింద్. ‘‘నేషనల్ అవార్డు రావడం నా కెరీర్‌లో ఫస్ట్‌టైమ్. నా జీవితంలో సంతోషకరమైన క్షణమిది’’ అన్నారు శర్వానంద్. ఈ వేదికపై ‘రుద్రవీణ’కు నర్గిస్‌దత్ నేషనల్ అవార్డు వచ్చిన సంగతిని గుర్తు చేస్తూ, అది తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చిన అవార్డుగా భావించానన్నారు చిరంజీవి. అల్లు అర్జున్, నాని, అల్లు శిరీష్ పాల్గొన్నారు.
శతమానం... తెలుగు సినిమాకు గర్వకారణం
Published Sun, Apr 16 2017 11:30 PM | Last Updated on Tue, Sep 5 2017 8:56 AM
Advertisement