ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాల విడుదలను ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల సమయంలో ఈ రెండు సినిమాలు విడుదల చేయవద్దు అంటూ సత్యనారాయణ అనే వ్యక్తి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో సినిమాలు విడుదల చేస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు. విచారణ జరిపిన హైకోర్ట్.. ప్రతీ వ్యక్తికి భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని, కావున ఈ రెండు సినిమాల విడుదలను ఆపటం కుదరదని తేల్చి చెప్పింది. రిలీజ్‌ను ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.
రెండు సినిమాల్లో సన్నివేశాలు ఏవైనా అభ్యంతరకరంగా వాటిపై చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. తెలంగాణలో సినిమా విడుదల చేసిన ఎలాంటి ఇబ్బంది లేదని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తమ పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటారని హైకోర్టుకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ తెలిపారు. దీంతో సినిమా విడుదలకు ఉన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటన ఆధారంగా తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించగా, లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాకు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి దర్శకుడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ను ముందుగా ఈ నెల 22న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినా.. నిర్మాణానంతర కార్యక్రమాలు ఆలస్యం కావటంతో 29న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. లక్ష్మీస్ వీరగ్రంథం కూడా మార్చి 22నే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment