ఇది శ్రీదేవి చేసిన పని కాదు..!
‘‘శ్రీదేవి అంటే నాకు ఆరాధన, మర్యాద ఉన్నాయి. తన నుంచి నోటీసు రావడం నన్ను బాధపెట్టింది. ఇది శ్రీదేవి చేసిన పని కాదు. స్వార్థ ప్రయోజనాలకోసం ఇతర వ్యక్తులు చేయించిన పని ఇది. ఆమె పరువు పోయే విధంగా ఈ చిత్రం ఉండదని నా మనసుకు తెలుసు. ఆ విషయాన్ని సినిమా నిరూపిస్తుంది’’ అని చెప్పారు రామ్‌గోపాల్‌వర్మ. ‘సావిత్రి’ పేరుతో సినిమా తీస్తున్నానని ప్రకటించి, ప్రచార చిత్రాల ద్వారా వివాదాలపాలై, ఆ తర్వాత టైటిల్‌ని ‘శ్రీదేవి’గా వర్మ మార్చిన విషయం తెలిసిందే. ఇది అభ్యంతరకర చిత్రం అనిపిస్తోందంటూ వర్మకు శ్రీదేవి లీగల్ నోటీస్ పంపించారు. ఈ నోటీసుకు వర్మ స్పందిస్తూ - ‘‘వివాదాలు రేగిన కారణంగా నేను ‘సావిత్రి’ టైటిల్ మార్చలేదు. వేరే నిర్మాత నమోదు చేసి ఉన్నందున ‘శ్రీదేవి’గా మార్చాను.
గత ఐదేళ్లల్లో నటి శ్రీదేవిపై నాకున్న ఇష్టాన్ని నేను బహిరంగంగా చెప్పడాన్ని కామెడీగాను, హెల్దీ స్పిరిట్‌తోను తీసుకున్నారు. అయితే, ఇప్పుడు ‘శ్రీదేవి’ టైటిల్ ప్రకటించడంతో ఆమె గురించి నేను మాట్లాడిన మాటలకు, ఈ చిత్రానికి సంబంధం ఉంటుందని భావిస్తున్నారు. ఓ 25ఏళ్ల యువతిపై ఆకర్షణ పెంచుకునే టీనేజ్ కుర్రాడి కథతో ఈ చిత్రం ఉంటుంది. టైటిల్ రోల్ చేస్తున్న పాత్రధారి ఈ చిత్రంలో సినిమా నటి కాదు.. ఆ అబ్బాయి దర్శకుడు కాదు. పైగా, ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం చాలా ఉంది. కాబట్టి శ్రీదేవి అనుకుంటున్నట్లు ఇది అభ్యంతర కథ కానే కాదు. ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర వాణిజ్య మండలి ఈ టైటిల్‌ని ఆమోదించింది. గత రెండు దశాబ్దాల్లో ఇదే టైటిల్‌తో కనీసం మూడు సినిమాలైనా వచ్చి ఉంటాయి. చలన చిత్ర వాణిజ్య మండలికి ఎలాంటి అభ్యంతరం లేదు. దీని గురించి బోనీకపూర్ ఫోన్ చేసి, వివరణ కోరితే, నేనిదే చెప్పాను. ఆ తర్వాత ప్రెస్‌కి ఇచ్చిన నోట్‌ని మెసేజ్ పంపించాను’’ అన్నారు.