సావిత్రి కల్యాణం చూతము రారండి!
వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు నారా రోహిత్. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ దూసుకెళుతున్నారు. తాజాగా ‘సావిత్రి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం ఎనౌన్స్ చేసినప్పటి నుంచే క్రేజీ ప్రాజెక్టుగా అందరి దృష్టినీ ఆకట్టుకుంది. దీనికి కారణం ీహ రో నారా రోహిత్. విభిన్న కథాంశాలను ఎంచుకునే నారా రోహిత్ ‘సావిత్రి’ టైటిల్‌తో సినిమా చేయడం ప్రాజెక్ట్‌పై క్రేజ్ ఏర్పడేలా చేసింది. ‘ప్రేమ -ఇష్క్ -కాదల్’ చిత్రంతో దర్శకునిగా మెప్పించిన పవన్ సాదినేని ‘సావిత్రి’ని లవబుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ఇటీవలే ఈ చిత్రాన్ని నిర్మాతలు గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమా గురించి చిత్ర యూనిట్ చెప్పిన విశేషాలు...
‘సావిత్రి’కి పెళ్లంటే పిచ్చి. ఎందుకంటే తను పుట్టింది ఓ కల్యాణ మండపంలో. ఈ సావిత్రిని దక్కించుకున్న హీరో కథే ఈ సినిమా. కొత్తదనం నిండిన పాత్రల మధ్య సాగే ఈ ప్రేమకథ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ప్రథమార్ధం అంతా సరదాగా కనిపిస్తూ, క్లైమ్యాక్స్‌లో ఎమోషనల్ సీన్స్‌లో ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేస్తారు నారా రోహిత్. ఆయన కామెడీ టైమింగ్ కూడా బాగుంది. బాలకృష్ణ పాటల బ్యాక్‌డ్రాప్‌లో నారా రోహిత్ చేసిన ఫైట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సావిత్రి పాత్రను నందిత బాగా చేసింది.
మురళీ శర్మ, అజయ్, ధన్యా బాలకృష్ణన్, రవిబాబు, మధునందన్ -ఇలా నటీనటులంతా తమ పరిధి మేరకు నటించారు. ఇంట్రడక్షన్ సీన్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఓ కొత్త ఆలోచనకు కమర్షియల్ హంగులు జోడిస్తూ పవన్ సాదినేని తెరకెక్కించిన ఈ చిత్రం అందరినీ మెప్పిస్తుంది.
ట్రైన్ ఎపిసోడ్‌లో ప్రభాస్ శీను అండ్ గ్యాంగ్, ద్వితీయార్ధంలో రవిబాబు, జీవా, ఫిష్ వెంకట్‌లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. చివరి ఇరవై నిమిషాల్లో గ్రామీణ నేపథ్యంలో పెళ్లి సన్నివేశాలను చిత్రీకరించడంలో కెమేరామేన్ ఎ. వసంత్ ప్రతిభ కనిపిస్తుంది. శ్రవణ్ స్వరపరిచిన పాటలు వినసొంపుగా ఉన్నాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలకు ఆయువు పట్టు. డా. వీబీ రాజేంద్రప్రసాద్ ఈ కథకు కావాల్సిన బడ్జెట్‌ను సమకూర్చి అద్భుతంగా నిర్మించారు.
ప్రధాన కథలో పవన్ మంచి ఫన్ జనరేట్ చేయగలిగారు. కృష్ణచైతన్య అందించిన సంభాషణలు, పవన్ నెరేషన్‌కు ప్రధాన బలం. ముఖ్యంగా క్లయిమ్యాక్స్‌లో వచ్చే పాట బాగుంటుంది. గౌతంరాజు ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. హరివర్మ ఆర్ట్ వర్క్ సినిమాను ఎలివేట్ చేస్తుంది. దర్శకుడి పవన్ సాదినేని ప్రతిభను ఈ చిత్రంలో చూడవచ్చు. బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చి సావిత్రి పెళ్లిని చూసి అందరూ ఈ చిత్రాన్ని సక్సెస్ చేస్తున్నారు.
కొత్త తరహా కథల్ని ఇప్పటివరకూ ప్రోత్సహించిన నారా రోహిత్ ఈ చిత్రంతో తన స్థాయిని పెంచుకున్నారు. ‘ప్రేమ-ఇష్క్- కాదల్’ లాంటి యూత్‌ఫుల్ చిత్రాలనే కాకుండా కమర్షియల్ ఫార్ములా కూడా డీల్ చేయగలనని దర్శకుడు నిరూపించుకున్నారు. యూత్, ఫ్యామిలీస్ చూసేలా మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను అందించారు. ఉత్తమాభిరుచి గల చిత్రాలకు ఎప్పుడూ పట్టం కడతారని ప్రేక్షకులు ఈ సినిమాతో నిరూపించారు. కమర్షియల్ హంగులతో ఓ మంచి సందేశంతో తెరకెక్కిన ఈ చిత్రం భారీ కలెక్షన్స్ దిశగా దూసుకెళుతోంది.