చెన్నై : ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటూ.. ఏంటీ సడన్‌గా పాటందుకున్నారు అని అనుకుంటున్నారా? వాస్తవాన్ని చెప్పడంలో తప్పులేదుగా. ఎవరిలో ఎలాంటి టాలెంట్ ఉందన్నది బయట పడితేనే గానీ తెలియదు. నటుడు ఆర్య మంచి నటుడన్న విషయం తెలిసిందే. అయితే ఆయనలో నలభీముడున్న విషయం హీరోయిన్లకు బిరియానీ విందునివ్వడంతోనే వెలుగు చూసింది. ఇది ఆర్యలోని ఇంకో టాలెంట్ అని చెప్పవచ్చు. ఇక ఆయన హీరోయిన్లను మచ్చిక చేసుకోవడంలో సిద్ధహస్తుడంటారు. అదీ టాలెంటే. కాగా తాజాగా ఆయన అర్ధాంగి సాయేషాసైగల్‌లోనూ మరో టాలెంట్ ఉన్న విషయం బహిర్గతమైంది. వనమగన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన ఈ అమ్మడు బాలీవుడ్ బ్యూటీ అన్న విషయం తెలిసిందే. నటిగా పరిచయం అయిన కొద్ది కాలంలోనే ఆర్యతో ప్రేమలో పడి, వెనువెంటనే ఆయన్ని పెళ్లి చేసుకున్న సంగతి విధితమే. ఆర్య ఆమెకు నటించరాదని ఆక్షలు విధించకపోయినా, సెలెక్టెడ్ చిత్రాలనే చేయాలని ఈ బ్యూటీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం సూర్యకు జంటగా కాప్పాన్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో నటుడు ఆర్య ఒక ముఖ్య పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా తన భర్త ఆర్యకు జంటగా టెడీ అనే చిత్రంలో నటిస్తోంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడికి కొంచెం తీరిక దొరుకుతుండడంతో తనలోని మరో టాలెంట్‌ను బాహ్య ప్రపంచానికి తెలిపే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఒండ్రా ఇరండా అనే పాటను పాడి దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. అది ఇప్పుడు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది.
నటుడు సూర్య, జ్యోతిక జంటగా నటించిన కాక్క కాక్క చిత్రంలోని ఆ పాటను బాంబే జయశ్రీ పాడారు. ఈ పాటను నటి సాయేషా గొంతు నుంచి వచ్చి మరింత మధురంగా ఉండడంతో సంగీత ప్రియుల లైక్‌లు పెరిగిపోతున్నాయి. దీని గురించి స్పందించిన నటి సాయేషా తనకు పాడడం అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. అలా తనకు నచ్చిన పాటను షూటింగ్ విరామ సమయంలో పాడినట్లు తెలిపింది. అయితే ఇందుకోసం ఎలాంటి శిక్షణ తీసుకోలేదని, తప్పులుంటే మన్నించండి అని అంది. నటనే తెలుసనుకుంటే పాడడం కూడా తెలుసా ఈ అమ్మడికి అని ఆశ్చర్యపడుతున్న అభిమానులు మొత్తం మీద చేతిలో మరో వృత్తిలో కూడా టాలెంట్ ఉందన్నమాట అని ప్రశంసిస్తున్నారు. మరి నటి సాయేషాను త్వరలో గాయనిగా కూడా చూసే అవకాశం లేకపోలేదని అంటున్నారు నెటిజన్లు. అయినా సినీ కుటుంబం నుంచి వచ్చిన ఈ బ్యూటీకి ఆ మాత్రం టాలెంట్ ఉండదా ఏమిటి? కాకపోతే ఈ ఉత్తరాది భామ తమిళ పాటను అంత చక్కగా పాడడం అభినందనీయమే.
Comments
Please login to add a commentAdd a comment