తమిళ సినిమా : రజనీకాంత్ ప్రమాదకరమైన ఆలోచనపరుడని నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ధ్వజమెత్తారు. కావేరి మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు కోసం జరుగుతున్న తమిళుల పోరాటం సినీ రంగంలోనూ సమస్యలకు దారి తీస్తోంది. ముఖ్యంగా రజనీకాంత్‌పై పలువురు సినీ ప్రముఖులు మాటల దాడి చేస్తున్నారు. కావేరి మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు కోసం సినీ దర్శకుడు కే.భారతీరాజా నేతృత్వంలో తమిళగ కళై ఇళక్కియ పన్బాటు పేరవై అనే సంఘాన్ని నెలకొల్సి పోరాటం చేస్తున్నారు.
ఇటీవల ఆందోళన కార్యక్రమంలో ఒక పోలీస్ దాడికి గురయ్యారు. ఈ సంఘటనపై నటుడు రజనీకాంత్ ఇది హింసకు పరాకాష్ట అని పేర్కొన్నారు. రజనీ వ్యాఖ్యలపై దర్శకుడు భారతీరాజా వర్గం మండిపడుతోంది. ఇదే విషయంపై నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ స్పందిస్తూ కావేరి మేనేజ్‌మెంట్ ఏర్పాటు కోసం తాము శాంతియుత పోరాటం చేస్తున్నామన్నా రు. ఈ పోరాటంలో ఒక పోలీస్‌ను బాధించటం బాధాకరమేనన్నారు. అయితే ఈ అంశంపై నటుడు రజనీకాంత్ ఇది హింసకు పరాకాష్ట అని పేర్కొనే ముందు పోరాటంలో ఏం జరిగిందన్నది తెలుసుకొని మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు.
పోరాటంలో పాల్గొన్న దర్శకుడు భారతీరాజా, గీతరచయిత వైరముత్తు వంటి వారు ఆయన స్నేహితులేనని, వారిని అడిగి తెలుచుకోవచ్చుగా అని ప్రశ్నించారు. జల్లికట్టు పోరాటంలో జరిగిన దాడి గురించి రజనీ స్పందించలేదని, ఒక పోలీసు ఎత్తిపడేయడంతో మహిళ ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన గురించి ఆయన స్పందించలేదన్నారు. అలాంటిది కావేరి మేనేజ్‌మెంట్ బోర్డు కోసం జరుగుతున్న పోరాటంతో గాయాలపాలైన పోలీస్ విషయంలో హింసకు పరాకాష్ట అని పేర్కొన్న రజనీకాంత్ ఆలోచనలు ప్రమాదకరమైనవిగా పేర్కొన్నారు. ఇటీవల అత్యాచారం కారణంగా బలైన చిన్నారి ఆసిఫా ఉదంతంపై కూడా రజనీ స్పందించలేదన్నారు. అలాంటి రజనీ రాజకీయాల్లోకి రావడాన్ని తాము వ్యతిరేకిస్తామన్నారు. తమిళనాడును తమిళుడే పాలించాలన్నది తమ లక్ష్యమని సీమాన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment