అల్లుడు శీను చూడగానే... అతనే కరెక్ట్ అనుకున్నా! | Seenu son-in-at the sight, ... He wanted to correct! | Sakshi
Sakshi News home page

అల్లుడు శీను చూడగానే... అతనే కరెక్ట్ అనుకున్నా!

Published Wed, Feb 3 2016 12:21 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 PM

అల్లుడు శీను చూడగానే... అతనే కరెక్ట్ అనుకున్నా!

అల్లుడు శీను చూడగానే... అతనే కరెక్ట్ అనుకున్నా!

దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

 ‘శుభమస్తు’, ‘సుస్వాగతం’, ‘శుభాకాంక్షలు’, ‘సూర్యవంశం’, ‘అన్నవరం’, ‘సుడిగాడు’ చిత్రాలతో రీమేక్‌లకూ, సకుటుంబ కథా చిత్రాలకూ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు - దర్శకుడు భీమనేని శ్రీనివాస రావు. సూపర్‌హిట్ ‘సుడిగాడు’ తరువాత మూడున్నరేళ్ళ విరామం తీసుకొని, ఆయన డెరైక్ట్ చేసిన సినిమా ‘స్పీడున్నోడు’. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సోనారిక జంటగా భీమనేని రోషితా సాయి సమర్పణలో గుడ్ విల్ సినిమా పతాకంపై భీమనేని సునీత నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా భీమనేని చెప్పిన ఆ చిత్ర విశేషాలు ఆయన మాటల్లోనే...

     తమిళంలో విజయవంతమైన ‘సుందరపాండ్యన్’కు రీమేక్‌గా ‘స్పీడున్నోడు’ తెరకెక్కిం చాం. మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ కావడంతో మూడేళ్లు స్క్రిప్ట్‌వర్క్ చేశా. తమిళంలో లాగా సహజంగా చూపిస్తే ఇక్కడ కొంతమందికి కనెక్ట్ అవదని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా వినోదం, భావోద్వేగాలు జోడించాం.
     తమిళ వెర్షన్‌లో ఈ చిత్రం చూసినప్పుడు బాగా నచ్చి, వెంటనే రీమేక్ హక్కులు తీసుకున్నా. తెలుగులో ఆ ఆత్మ పోకుండా, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తీశాను. తప్పకుండా అందరికీ నచ్చే చిత్రమవుతుంది.
     మొదట ఈ చిత్రంలో హీరోగా చాలామందిని అనుకున్నాం. రవితేజ, సునీల్‌తో పాటు మరికొందరిని కలిశాం. వారికెందుకో ఈ కథ కనెక్ట్ కాలేదు. నేను చూసే పాయింట్‌లో సినిమాని వారు చూడలేదనుకుంటా. సాయిశ్రీనివాస్ నటించిన ‘అల్లుడు శీను’ చూశా. తన డ్యాన్స్, ఫైట్స్, ఎనర్జీ చూసి తనే సరిగ్గా సరిపోతాడనుకున్నా. ఒకే సినిమా అనుభ వంతో సాయి అద్భుతంగా నటించాడు. హీరోకుండాల్సిన లక్షణాలన్నీ తనకున్నాయి.

     నా ప్రతి చిత్రం మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ‘సుడిగాడు’ చిత్రానికి పాటలు అందించిన డిజె వసంత్ నాతో పాటు మూడేళ్లు ప్రయాణం చేసి, ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు ఇచ్చాడు. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. పాటలను ఆదరించినట్లుగా సినిమాను కూడా ప్రేక్షకులు విజయవంతం చేస్తారని భావిస్తున్నా.
     ఇప్పట్లో ఫ్రెండ్స్ లేనివారు ఎవరూ అంటూ ఉండరు. స్నేహం గురించి ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్ ఇందులో చూపించాం. ఒక అమ్మాయి వల్ల ఐదుగురు స్నేహితుల మధ్య ఎటువంటి మనస్పర్థలు ఎదురయ్యాయి, హీరో రంగప్రవేశం చేసి ఆ సమస్యల్ని ఎలా పరిష్కరించాడన్నదే ఈ చిత్ర కథాంశం. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో షూటింగ్ జరిపాం. క్లైమాక్స్ షెడ్యూల్ కర్నూలులో చేశాం. రాయలసీమ నేపథ్యంలో జరిగే కథ ఇది నిర్మాత అవ్వాలనే కోరిక నిజానికి నాకు లేదు. కానీ, ‘ఈ రీమేక్ సినిమా తెలుగు నేటివిటీకి సెట్ అవుతుందా?’ అని కొందరికి అనుమానాలు ఉండటంతో నేనే నిర్మాతగా మారా. సినిమా అవుట్‌పుట్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి, ఆ రిస్క్ నేనే తీసుకుందామనుకుని నిర్మించా.


     ఈ చిత్రంలో ప్రతి పాటనూ హై బడ్జెట్‌లో చిత్రీకరించాం. తమన్నా చేసిన స్పెషల్ సాంగ్‌కే రెండు కోట్ల రూపాయలు అయింది. ఐటమ్ సాంగ్స్‌లో ఒక విలక్షణమైన పాటగా ఇది మిగిలిపోతుంది. తమన్నా ఈ పాట చూసి చాలా హ్యాపీగా ఫీలయింది. మహిళలు కూడా ఈ సాంగ్ ఇష్టపడేలా ఉంటుంది. మేము అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైంది. మూడు నెలల ముందే బిజినెస్ జరిగిపోయింది. డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ నాకు మంచి స్నేహితులు. ప్రాఫిట్స్ వస్తే షేర్ చేసుకుందామనుకుంటున్నాం.
     నేను చేసిన చిత్రాల్లో నాకు బాగా నచ్చినవి - ‘సుస్వాగతం’, ‘శుభాకాంక్షలు’. ఆ చిత్రాల్లోని క్లయిమాక్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇప్పటికీ నన్ను ‘సుస్వాగతం’ డెరైక్టర్‌గానే గుర్తు పడుతున్నారు ఎవరైనా ఓ నటుడు ఒక పాత్రలో సక్సెస్ అయితే అతనికి అటువంటి క్యారెక్టర్సే వస్తాయి. నేను కూడా ఇండస్ట్రీకి రీమేక్ సినిమాతో ఎంట్రీ కావడం, ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో రీమేక్‌లు బాగా తీస్తాడని నాపై ముద్ర పడిపోయింది. రీమేక్‌లకు అలవాటుపడిపోయానేమోననే భావన నాకు కూడా ఉంది. అందుకే, స్ట్రెయిట్ చిత్రం తీయాలనుంది, మంచి కథ దొరికితే కచ్చితంగా చేస్తా.  
     ‘సుడిగాడు’ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచన ఇప్పటికైతే లేదు. ‘స్పీడున్నోడు’ తరువాత ప్రాజెక్ట్స్ ఏమిటని అనుకోలేదు. ఒక చిత్రం చేస్తున్నప్పుడు మరో దాని గురించి ఆలోచించను. చేస్తున్న సినిమా పూర్తయి రిలీజ్ అయిన తరువాతే మరో దాని గురించి ఆలోచిస్తా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement