
రాజమౌళి వర్సెస్ సెంథిల్
షూటింగ్ స్పాట్‌లో దర్శకుడు చేయాల్సిన పనేంటి? ఎలా నటించాలో ఆర్టిస్టులకు.. ఎలా షూట్ చేయాలో సినిమాటోగ్రాఫర్‌కు.. ఇలా ట్వంటీఫోర్ క్రాఫ్ట్స్ మెంబర్స్‌కి ఎవరి పనులు వాళ్లకు.. వివరించడమే. రాజమౌళి కూడా తన చిత్రబృందానికి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. కానీ, అది షూటింగ్ కోసం కాదు. లొకేషన్లో షూటింగ్ జరగకుండా మరేం జరిగింది? అని ఊహాగానాలు చేస్తున్నారా? అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ చిత్రబృందం క్రికెట్ ఆడారు.
అయ్యో పాపం నిర్మాత.. షూటింగ్ కోసం లక్షలు లక్షలు ఖర్చుపెడితే.. బాధ్యత లేకుండా ఆట ఆడుకుంటున్నారా? అని నిందించక్కర్లేదు. ఎందుకంటే, కావాలని షూటింగ్ ఆపేసి ఆడలేదు. పరిస్థితి అలా వచ్చింది. విరామం లేకుండా షూటింగ్ చేస్తున్న వీళ్లను చూసి, వరుణ దేవుడికి జాలి అనిపించిందేమో. నాన్‌స్టాప్‌గా వర్షం కురిపించేశాడు.
మరీ తడిసి ముద్దయ్యే వర్షం కాకపోవడంతో చినుకుల్లోనే క్రికెట్ ఆడారు. వాస్తవానికి వరుణుడు అడ్డుపడకపోతే మంగళవారంతో ‘బాహుబలి-2’ క్లైమాక్స్ షూటింగ్ పూర్తయ్యేది. ఆ సంగతలా ఉంచితే.. టీమ్ అందరూ క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. రాజమౌళి బౌలింగ్.. సెంథిల్ కుమార్ బ్యాటింగ్ చేశారు. సెంథిల్‌ను అవుట్ చేయాలని రాజమౌళి చేసిన ప్రయత్నం ఫలించలేదు. రివర్స్‌లో సెంథిల్ రెండు సిక్సులు కొట్టారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్‌లో తెలిపారు.