ముంబై : బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ వరుసకు సోదరి అయిన నూర్ జెహాన్ (52) మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది. పాకిస్తాన్‌లోని పెషావర్‌లో మంగళవారం ఆమె తుదిశ్వాస విడిచారు. జెహాన్ తండ్రి షారుక్‌కు పినతండ్రి అవుతారు. నూర్ జెహాన్ పెషావర్‌లోని కిస్సా ఖ్వానీ బజార్ సమీపంలోని మొహల్లా షా వాలి కతాల్ ప్రాంతంలో నివసిస్తున్నారు. కొంతకాలంగా జెహాన్ నోటి క్యాన్సర్‌తో బాధపడుతోందని ఆమె భర్త ఆసిఫ్ బుర్హాన్ పేర్కొన్నారు. నూర్ మరణించిన విషయాన్ని ఆమె సోదరుడు మన్సూర్ అహ్మద్ సైతం ధృవీకరించారు.
అదే విధంగా షారుక్ కుటుంబంతో నూర్ జెహాన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి భారత్‌లో కూడా చాలామంది బంధువులు ఉన్నారు. కింగ్‌ఖాన్ తన తల్లిదండ్రులతో కలిసి పెషావర్‌లోని నూర్ కుటుంబాన్ని రెండుసార్లు(1997,2011) సందర్శించారు. నూర్ మరణంతో షారుఖ్, నూర్ జెహాన్‌తో కలిసి దిగిన ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాగా పాకిస్తాన్‌లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జెహాన్ జిల్లా, పట్టణ కౌన్సిలర్‌గా పనిచేశారు. అనంతరం జూలై 2018 సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక అసెంబ్లీకి నామినేషన్ దాఖలు చేసి తరువాత ఉపసంహరించుకున్నారు.
కాగా నటుడితో పాటు జీరో సినిమాతో షారుఖ్ ఖాన్ నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బార్డ్ ఆఫ్ బ్లడ్ అనే నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌ను నిర్మిస్తుంది. ఇక షారుక్ తన నెక్ట్స్ ప్రాజెక్టును తమిళ దర్శకుడు అట్లీతో చేయనున్నారని వార్తలు వెలువడగా, షారుక్ మాత్రం దీనిపై ఎలాంటి క్లారీటీ ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment