‘హ్యాపీ న్యూ ఇయర్’ పూర్తయ్యాక విశ్రాంతి తీసుకోవాలనుంది!
న్యూఢిల్లీ: ఈ ఏడాది ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’తో దూసుకొచ్చి బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఆ వెంటనే ‘హ్యాపీ న్యూ ఇయర్’ షూటింగ్‌లో మునిగిపోయాడు. సినిమా సినిమాకు మధ్య కాస్త విశ్రాంతి తీసుకునే కింగ్‌ఖాన్ ఈసారి మాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అయితే ‘హ్యాపీ న్యూ ఇయర్’ షూటింగ్ పూర్తి కాగానే కొన్ని నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పాడు షారుఖ్. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ అనూహ్య విజయం సాధించడంతో నిర్మాతలు, దర్శకులు షారుఖ్ చుట్టూ తిరుగుతున్నారట. ‘శుద్ధ్ దేశీ రోమాన్స్’తో బాలీవుడ్‌కు హిట్టిచ్చిన మనీశ్ శర్మ.. షారుఖ్ కోసం ఓ మంచి కథను తయారు చేసుకున్నాడట.
అంతేగాకుండా రాహుల్ ధోలాకియా, అనురాగ్ కశ్యప్, ఆర్ బల్కి, అశుతోష్ గోవారికర్ తదితర దర్శకులు షారుఖ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ విషయమై షారుఖ్ మాట్లాడుతూ... ‘నేనిప్పుడు ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాను. కొత్త సినిమా ఏదైనా అంగీకరిస్తే వెంటనే మీకు తెలియజేస్తాను. ఇప్పటివరకైతే కొత్తగా ఏ సినిమాకు అంగీకరించలేదు. మరో రెండు నెలల వరకు ‘హ్యాపీ న్యూ ఇయర్’ షూటింగ్ కొనసాగుతుంది. మరో నలుగురు దర్శకులు నా కోసం కథలు సిద్ధం చేసుకున్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరి సినిమాలను ఇంకా అంగీకరించలేదని షారూఖ్ తెలిపాడు