రాధ.. చాలా సిన్సియర్
కృష్ణుడు వెన్న దొంగిలిస్తాడు. మహాభారతంలోని ముచ్చటది. ఈ ‘రాధా’కృష్ణుడు ఎవరేం స్వాహా చేసినా తాట తీస్తాడు. ఎందుకంటే... ఈయన కృష్ణుడిలా వెన్నదొంగ కాదు, పోలీసాఫీసర్ మరి. కానీ, కృష్ణుడిలో చిలిపితనం ఈయనలో కనిపిస్తుంది. ఇది నేటి భారతంలోని కథ. ఇందులో శర్వానంద్ హీరో. ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ తనయుడు భోగవల్లి బాపినీడు నిర్మాణంలో శర్వానంద్ సిన్సియర్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న సినిమాకి ‘రాధ’ అనే టైటిల్ ఖరారు చేశారు.
చంద్రమోహన్ దర్శకునిగా పరిచయమవు తున్న ఈ సినిమా చిత్రీకరణ ఓ పాట మినహా పూర్తయింది. ఉగాది కానుకగా మార్చి 29న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘అటు క్లాస్.. ఇటు మాస్ ప్రేక్షకుల్ని అలరించే చిత్రమిది. రొమాన్స్, కామెడీ, యాక్షన్‌లతో దర్శకుడు చంద్రమోహన్ పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించారు’’ అని నిర్మాత తెలిపారు. లావణ్యా త్రిపాఠి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: రధన్.