'శతమానం భవతి' మూవీ రివ్యూ
టైటిల్ : శతమానం భవతి
జానర్ : ఫ్యామిలీ డ్రామా
తారాగణం : శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ
సంగీతం : మిక్కీ జే మేయర్
దర్శకత్వం : సతీష్ వేగేశ్న
నిర్మాత : దిల్ రాజు
గత ఏడాది సంక్రాంతి బరిలో నాగార్జున, బాలకృష్ణలతో ఢీ కొని సక్సెస్ సాధించిన యంగ్ హీరో శర్వానంద్ మరోసారి అదే సాహసం చేశాడు. రెండు ప్రతీష్టాత్మక చిత్రాలు రిలీజ్ అవుతున్న సంక్రాంతి సీజన్ లో బరిలో దిగిన శర్వానంద్ మరోసారి అదే ఫీట్ ను రిపీట్ చేశాడా.? ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో భారీ విజయాలు సాధించిన దిల్ రాజు మరోసారి సక్సెస్ సాధించాడా..?
కథ :
పిల్లలంతా పెరిగి పెద్దవారై విదేశాలకు వెళ్లిపోయినా పుట్టిన ఊరిమీద మమకారంతో సొంత ఊరు ఆత్రేయపురంలోనే భార్య జానకమ్మ(జయసుధ)తో కలిసి ఉండిపోతాడు రాజుగారు(ప్రకాష్ రాజ్). ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్న ఎవరూ లేని వాళ్లలా ఒక్కరే ఊళ్లో ఉంటున్నందుకు రాజుగారు ఎప్పుడూ బాధ పడుతుంటారు. అయితే ఆ బాధ నుంచి కొంత ఓదార్పుగా మనవడు రాజు (శర్వానంద్) వారితోనే ఉంటుంటాడు. ఆ సమయంలో తన పిల్లలను చూడాలనుకున్న రాజుగారు వారిని సంక్రాంతి పండుగకు రప్పించేందుకు ఓ పథకం వేస్తాడు. అనుకున్నట్టుగా పిల్లలను మనవళ్లను సంక్రాంతికి ఇంటికి పిలిస్తాడు.
ఇలా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన రాజుగారి మనవరాలు నిత్యా (అనుపమా పరమేశ్వరన్), రాజుతో ప్రేమలో పడుతుంది. సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతుండగానే పిల్లలను ఇండియాకు రప్పించడం కోసం రాజుగారు వేసిన పథకం బయటికి తెలుస్తుంది. దీంతో రాజుగారి కుటుంబంలో గొడవలు మొదలవుతాయి. ఆ గొడవలకు కారణం ఏంటి..? రాజుగారు వేసిన ఆ పథకం ఏంటి..? ఇన్ని సమస్యల మధ్య రాజు, నిత్యా ఎలా ఒక్కటయ్యారు..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
హీరో శర్వానంద్ అయినా సినిమాలో ఎక్కువ భాగం రాజుగారి పాత్రలో నటించిన ప్రకాష్ రాజు చుట్టూనే తిరుగుతోంది. నటుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్, తనదైన నటనతో రాజుగారి పాత్రకు ప్రాణం పోశాడు. జానకమ్మగా సహజనటి జయసుధ హుందాగా కనిపించారు. ఇప్పటికే పలు చిత్రాల్లో కనువిందు చేసిన ప్రకాష్ రాజ్, జయసుధల జంట మరోసారి ఆకట్టుకుంది. రాజు పాత్రలో శర్వానంద్ ఒదిగిపోయాడు. నిత్యా పాత్రలో అనుపమా పరమేశ్వరన్ శర్వాకు పోటీ ఇచ్చింది. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో నరేష్, ఇంద్రజ, రాజా రవీంద్ర లాంటి నటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణులు :
కావాలని ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ను ఇరికించకుండా అచ్చమైన కుటుంబ కథను వెండితెర మీద చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు సతీష్ వేగేశ్న. ముఖ్యంగా కుటుంబ బంధాల విలువలు తెలిపేలా దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. తొలి భాగాన్ని బాగానే నడిపించిన సతీష్, సెకండాఫ్ విషయంలో మాత్రం కాస్త తడబడినట్టుగా అనిపించింది.
ముఖ్యంగా అనవసరంగా ఇరికించిన కామెడీ సన్నివేశాలతో పాటు, రొటీన్ ఫ్యామిలీ డ్రామాల్లో వచ్చే సన్నివేశాలతో బోర్ కొట్టించాడు. ఈ తరహా చిత్రాలకు తన సంగీతం అయితే కరెక్ట్ అని మరోసారి నిరూపించుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్. పాటలతో పాటు నేపథ్య సంగీతంతోనూ ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
ఎమోషనల్ సీన్స్
శర్వానంద్, అనుపమల జంట
మైనస్ పాయింట్స్ :
రొటీన్ సీన్స్
కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం
ఓవరాల్గా శతమానం భవతి, కుటుంబ విలువలను తెలియజేసే సంక్రాంతి సినిమా