Shatamanam Bhavathi
-
Sankranthi 2025: కర్చీఫ్ మడతపెట్టి...!
సంక్రాంతికి ‘కుర్చీని మడతపెటి...’ అంటూ ‘గుంటూరు కారం’లో మహేశ్‌బాబు చేసిన సందడి ఇంకా వినబడుతోంది. పండగ వెళ్లి మూడు నెలలు కూడా కాకముందే వచ్చే సంక్రాంతి కోసం కర్చీఫ్ మడతపెట్టి, పండగ బరిలో సీట్ రిజర్వ్ చేసుకున్నారు కొందరు స్టార్స్. అయితే సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రకటనలు రావడం, చివరి నిమిషంలో కొన్ని సినిమాలు తప్పుకోవడం మామూలే. ఇక 2025 సంక్రాంతి రేసులో ఇప్పటివరకూ షురూ అయిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. విశ్వంభర వస్తున్నాడు సంక్రాంతికి పండక్కి చాలా హిట్స్ సాధించారు చిరంజీవి. 2023లో ‘వాల్తేరు వీరయ్య’తో సంక్రాంతికి వచ్చి మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. మళ్లీ 2025లో ‘విశ్వంభర’ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. జనవరి 10న రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్‌లో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి కనిపిస్తారనీ టాక్. అలాగే ఈ చిత్రంలో చిరంజీవిది హనుమంతుడి భక్తుడి పాత్ర అట. భార్య.. మాజీ ప్రేయసి.. మధ్యలో మాజీ పోలీసాఫీసర్ ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేశ్ ‘సైంధవ్’ రిలీజైంది. వచ్చే సంక్రాంతికి కూడా రానున్నారు. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వెంకటేశ్. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఓ మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, అతని మాజీ ప్రేయసి.. ఇలా ఈ మూడు పాత్రల చుట్టూ సాగే క్రైమ్ కామెడీ మూవీ ఇది. ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ చిత్రాల నిర్మాత ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. 2017లో శర్వానంద్ హీరోగా నటించిన ‘శతమానం భవతి’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘శతమానం భవతి పేజీ 2’ ఉందని, 2025 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ‘దిల్’ రాజు ప్రకటించారు. ఇప్పుడు వెంకటేశ్–అనిల్ రావిపూడిల కాంబినేషన్లోని సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. మళ్లీ బంగార్రాజు వస్తాడా? ‘నా సామిరంగ’ అంటూ ఈ ఏడాది సంక్రాంతికి హిట్ సాధించారు నాగార్జున. ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో ‘సంక్రాంతికి కలుద్దాం’ అన్నారు నాగార్జున. సో.. 2025 సంక్రాంతికి కూడా నాగార్జున ఓ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారని ఊహించవచ్చు. 2016 సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్ని నాయనా’, 2022 సంక్రాంతికి ‘బంగార్రాజు’ (‘సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్) సినిమాలతో హిట్స్ అందుకున్నారు నాగార్జున. సో.. 2025 సంక్రాంతికి ‘బంగార్రాజు 3’ని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా? అనే ఆలోచనలో ఉన్నారట. మరి.. నాగార్జున ఏ సినిమాను రిలీజ్ చేస్తారు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. లక్మణ్ భేరి రెడీ రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి, చివరి నిమిషంలో ఇండస్ట్రీ మేలు కోసం అంటూ వాయిదా పడింది. ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజైంది. ఈసారి పక్కాగా సంక్రాంతికి రావాలనుకుంటున్నారు రవితేజ. అందుకే తన కెరీర్‌లోని 75వ చిత్రాన్ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రచయిత భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ సినిమాలో లక్మణ్ భేరి పాత్రలో కనిపిస్తారు రవితేజ. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుందని టాక్. మరోవైపు 2021 సంక్రాంతికి ‘క్రాక్’ సినిమాతో వచ్చి రవితేజ హిట్ సాధించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇంకా... ప్రభాస్ హీరోగా నటిస్తున్న‘రాజా సాబ్’ 2025 సంక్రాంతికి వచ్చే చాన్స్ ఉందని ఇటీవల పేర్కొన్నారు ఈ చిత్రనిర్మాత టీజీ విశ్వప్రసాద్. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్‌పై మరోసారి స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఈ ఏడాది సంక్రాంతికి తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్’ మంచి వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఇకపై ప్రతి సంక్రాంతికి ఓ సినిమా వస్తుందని పేర్కొన్నారు ప్రశాంత్ వర్మ. మరి.. వచ్చే సంక్రాంతికి ప్రశాంత్ నుంచి వచ్చే సినిమాపై ఇంకా ప్రకటన రాలేదు. ఇలా సంక్రాంతి బరిలో నిలిచే చిత్రాలు మరికొన్ని ఉన్నాయని తెలిసింది. సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో డబ్బింగ్ చిత్రాలు ఉంటుంటాయి. ఇలా అజిత్ హీరోగా నటించనున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సంక్రాంతి విడుదలకు ఖరారైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. అలాగే సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందనున్న సినిమా కూడా 2025 సంక్రాంతికి విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది. ఇంకా కన్నడ ఫిల్మ్ ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా రూపొందుతున్న ‘కాంతార: ది లెజెండ్ చాప్టర్ 1’ చిత్రం కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుందనే వార్త వచ్చిన సంగతి తెలిసిందే. -
ఆనంద సంతోషాలే మనసులను నింపే సిరిసంపదలు...
చిత్రం: శతమానం భవతి రచన: శ్రీమణి సంగీతం: మిక్కీ జె మేయర్ గానం: మోహన, దివ్య దివాకర్, ఆదిత్య అయ్యంగార్, రోహిత్ పరిటాల మూడు రోజుల పాటు జరుపుకునే ముచ్చటైన పండుగ. కొత్త అల్లుళ్ల అలకలతో, మరదళ్ల చిలిపి సరసాలతో సంబరంగా జరుపుకునే పండుగ. కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ. శతమానం భవతి చిత్రం కోసం ధనుర్మాసం, పండుగ సంబరాలు ప్రతిబింబించేలా పాట రాయమన్నారు దర్శకులు. ఈ పాటను అమలాపురంలో ఒక సినిమా షూటింగ్ సమయంలో రాశాను. హరిదాసులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, భోగిపండ్లు, బొమ్మల కొలువు, ముగ్గులు, పిండివంటలు... ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వీటన్నిటినీ మర్చిపోతున్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగను పూర్తిగా మరచిపోయే స్థితికి చేరుకున్నారు ప్రజలు. వీటిని ఒకసారి అందరికీ గుర్తుచేసేలా పాట రాయమన్నారు దర్శకులు. కొత్త అల్లుళ్లు బెట్టు చేయడం, అల్లుళ్ల గొంతెమ్మ కోర్కెలు, సరదాలు తీర్చడం, ఇంటింటా పండుగ హడావుడి ఎలా ఉంటుందో చూపేలా ఈ పాట రాశాను. సంక్రాంతికి బంధువులంతా కలిసి పంచుకునే ఆనందాలు, అలకలు, పట్టింపులు... ఎంతో బావుంటాయి. ఇవి చాలా అవసరం కూడా. సంతోషం, ఆనందం... ఇవే మనసుల్ని నింపే మాన్యాలు, సిరిసంపదలూనూ. ఇది మూడు రోజుల సెలవుల పండుగ కాదు. సంవత్సరం మొత్తం బంధువులందరూ కలిసే తియ్యని పండుగ జరుపుకోవాలని ఈ పాటలో రాశాను. గొబ్బియల్లో గొబ్బియల్లో కొండానయ్యకు గొబ్బిళ్లు... ఆదిలక్ష్మీ అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్లు అంటూ పల్లవి ప్రారంభించాను. సంక్రాంతి అంటే గొబ్బిళ్లు. ధనుర్మాసం మొదలైన రోజు నుంచి సంక్రాంతి వరకు నెల రోజుల పాటు ముగ్గులు, గొబ్బిళ్లతో వీధివీధంతా ఆకాశంలోని తారలు చేయిచేయి కలిపి కిందకు వచ్చినట్లుగా కనిపిస్తుంది. హరిదాసులు వచ్చారే దోసిట రాశులు తేరే కొప్పున నింపేయ్రే డూడూ బసవడు చూడే వాకిట నిలుచున్నాడే అల్లరి చేస్తున్నాడే డూడూ బసవడుగా ఇంటి వాకిళ్ల ముందు నిలబడి, అయ్యవారికి దండం పెడుతూ, పిల్లలను ఆనందింపచేస్తాడు గంగిరెద్దులను ఆడించే ఆటగాడు. ‘శ్రీమద్రమా రమణ గోవిందో హరి’ అంటూ తల మీద రాగి పాత్రతో ఇంటింటినీ హరినామస్మరణతో మార్మోగేలా చేస్తూ, తన జీవనానికి కావలసిన ధాన్యాలను సేకరిస్తాడు హరిదాసు. కొత్తల్లుళ్ల అజమాయిషీలే బావమరదళ్ల చిలిపి వేషాలే... కోడి పందాల పరవళ్లే తోడు పేకాటరాయుళ్లే పండుగకు అందం కొత్తగా పెళ్లికూతుళ్లయిన ఆడపిల్లలు కొత్త అల్లుళ్లతో ఇంట్లో అడుగు పెట్టడం, అల్లుళ్ల సరదా అలకలు, మరదళ్ల సరదా చిలిపివేషాలు, సరదాల కోడి పందాలు, సరదాగా పేకాట ఆడటం... ఇవన్నీ పండుగకు కొత్త అలంకారాలు. మెరిసే మురిసే సంక్రాంతే మూణ్ణాళ్ల సంబరమే ఉత్సవమే ఏడాది పాటంత జ్ఞాపకమే క్షణం తీరిక క్షణం అలసట మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి పండుగ సంవత్సరం పాటు ఆనందజ్ఞాపకాలను మిగిల్చేలా ఉత్సాహంగా జరుపుకోవాలి. దానధర్మాలు చేస్తూ సంపదలను అందరితో పంచుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎన్నో శుభాలకు నాంది పలుకుతుంది ఈ పండుగ. – డా. వైజయంతి -
శతమానం భవతి.. తొలిరోజు వసూళ్లెంత?
సంక్రాంతి పండుగ బరిలో చిరంజీవి 'ఖైదీ నంబర్ 150', బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి'లాంటి చిత్రాలు ఉన్నా.. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'శతమానం భవతి'. చక్కని కుటుంబకథా నేపథ్యంతో పచ్చని పల్లెటూరు వాతావరణంలో సకుటుంబసమేతంగా చూడదగ్గ సినిమాగా తెరకెక్కిన 'శతమానం భవతి' పెద్ద సినిమాల నడుమ కూడా మంచి వసూళ్లు రాబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తొలిరోజు రూ. మూడు కోట్లు వసూలు చేసినట్టు చెప్తున్నారు. చిన్న సినిమాగా సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమాకు ఇది మంచి ఆరంభమేనని చెప్పవచ్చు. శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధలు ప్రధాన తారాగణంగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఫ్యామిలీ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వడం 'శతమానం భవతి'కి ప్లస్ పాయింట్ గా మారిందని అంటున్నారు. -
'శతమానం భవతి' మూవీ రివ్యూ
టైటిల్ : శతమానం భవతి జానర్ : ఫ్యామిలీ డ్రామా తారాగణం : శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ సంగీతం : మిక్కీ జే మేయర్ దర్శకత్వం : సతీష్ వేగేశ్న నిర్మాత : దిల్ రాజు గత ఏడాది సంక్రాంతి బరిలో నాగార్జున, బాలకృష్ణలతో ఢీ కొని సక్సెస్ సాధించిన యంగ్ హీరో శర్వానంద్ మరోసారి అదే సాహసం చేశాడు. రెండు ప్రతీష్టాత్మక చిత్రాలు రిలీజ్ అవుతున్న సంక్రాంతి సీజన్ లో బరిలో దిగిన శర్వానంద్ మరోసారి అదే ఫీట్ ను రిపీట్ చేశాడా.? ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో భారీ విజయాలు సాధించిన దిల్ రాజు మరోసారి సక్సెస్ సాధించాడా..? కథ : పిల్లలంతా పెరిగి పెద్దవారై విదేశాలకు వెళ్లిపోయినా పుట్టిన ఊరిమీద మమకారంతో సొంత ఊరు ఆత్రేయపురంలోనే భార్య జానకమ్మ(జయసుధ)తో కలిసి ఉండిపోతాడు రాజుగారు(ప్రకాష్ రాజ్). ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్న ఎవరూ లేని వాళ్లలా ఒక్కరే ఊళ్లో ఉంటున్నందుకు రాజుగారు ఎప్పుడూ బాధ పడుతుంటారు. అయితే ఆ బాధ నుంచి కొంత ఓదార్పుగా మనవడు రాజు (శర్వానంద్) వారితోనే ఉంటుంటాడు. ఆ సమయంలో తన పిల్లలను చూడాలనుకున్న రాజుగారు వారిని సంక్రాంతి పండుగకు రప్పించేందుకు ఓ పథకం వేస్తాడు. అనుకున్నట్టుగా పిల్లలను మనవళ్లను సంక్రాంతికి ఇంటికి పిలిస్తాడు. ఇలా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన రాజుగారి మనవరాలు నిత్యా (అనుపమా పరమేశ్వరన్), రాజుతో ప్రేమలో పడుతుంది. సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతుండగానే పిల్లలను ఇండియాకు రప్పించడం కోసం రాజుగారు వేసిన పథకం బయటికి తెలుస్తుంది. దీంతో రాజుగారి కుటుంబంలో గొడవలు మొదలవుతాయి. ఆ గొడవలకు కారణం ఏంటి..? రాజుగారు వేసిన ఆ పథకం ఏంటి..? ఇన్ని సమస్యల మధ్య రాజు, నిత్యా ఎలా ఒక్కటయ్యారు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : హీరో శర్వానంద్ అయినా సినిమాలో ఎక్కువ భాగం రాజుగారి పాత్రలో నటించిన ప్రకాష్ రాజు చుట్టూనే తిరుగుతోంది. నటుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్, తనదైన నటనతో రాజుగారి పాత్రకు ప్రాణం పోశాడు. జానకమ్మగా సహజనటి జయసుధ హుందాగా కనిపించారు. ఇప్పటికే పలు చిత్రాల్లో కనువిందు చేసిన ప్రకాష్ రాజ్, జయసుధల జంట మరోసారి ఆకట్టుకుంది. రాజు పాత్రలో శర్వానంద్ ఒదిగిపోయాడు. నిత్యా పాత్రలో అనుపమా పరమేశ్వరన్ శర్వాకు పోటీ ఇచ్చింది. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో నరేష్, ఇంద్రజ, రాజా రవీంద్ర లాంటి నటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : కావాలని ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ను ఇరికించకుండా అచ్చమైన కుటుంబ కథను వెండితెర మీద చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు సతీష్ వేగేశ్న. ముఖ్యంగా కుటుంబ బంధాల విలువలు తెలిపేలా దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. తొలి భాగాన్ని బాగానే నడిపించిన సతీష్, సెకండాఫ్ విషయంలో మాత్రం కాస్త తడబడినట్టుగా అనిపించింది. ముఖ్యంగా అనవసరంగా ఇరికించిన కామెడీ సన్నివేశాలతో పాటు, రొటీన్ ఫ్యామిలీ డ్రామాల్లో వచ్చే సన్నివేశాలతో బోర్ కొట్టించాడు. ఈ తరహా చిత్రాలకు తన సంగీతం అయితే కరెక్ట్ అని మరోసారి నిరూపించుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్. పాటలతో పాటు నేపథ్య సంగీతంతోనూ ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : ఎమోషనల్ సీన్స్ శర్వానంద్, అనుపమల జంట మైనస్ పాయింట్స్ : రొటీన్ సీన్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం ఓవరాల్‌గా శతమానం భవతి, కుటుంబ విలువలను తెలియజేసే సంక్రాంతి సినిమా -
పన్నెండేళ్లకు కుదిరింది - ‘దిల్ ’ రాజు
శర్వానంద్ కథానాయకుడిగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘శతమానం భవతి’. అనుపమా పరమేశ్వరన్ కథానాయిక. శనివారం ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ ఫైనాన్షియర్ సత్య రంగయ్య క్లాప్ ఇవ్వగా, ఆయన మనవడు రంగా యశ్వంత్ కెమేరా స్విచాన్ చేశారు. సత్య రంగయ్య మనవడు ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ - ‘‘పన్నెండేళ్ల క్రితం శర్వానంద్ హీరో కావాలనుకున్నప్పుడు దర్శకుడు తేజకు పరిచయం చేశా. ఇప్పటికి మా సంస్థలో చేయాలని రాసి పెట్టుందేమో. మూడు తరాలకు సంబంధించిన కథ ఇది. ‘శతమానం భవతి’ టైటిల్లోనే పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చేలా స్క్రిప్ట్ సిద్ధం చేశాం. సెప్టెంబర్ 14న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. సతీష్ వేగేశ్న మాట్లాడుతూ - ‘‘టైటిల్ కార్డ్స్‌లో మా సినిమాలో పాత్రలన్నీ కల్పితం అని వేస్తారు. ఈ సినిమా కల్పితం కాదు, ఓ జీవితం. ‘దిల్’రాజుగారు చెప్పిన కరెక్షన్స్ వలన స్క్రిప్ట్ బాగా వచ్చింది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: సమీర్‌రెడ్డి, సంగీతం: మిక్కీ జె.మేయర్.