Sankranthi 2025: కర్చీఫ్‌ మడతపెట్టి...! | Sakshi
Sakshi News home page

Sankranthi 2025: కర్చీఫ్‌ మడతపెట్టి...!

Published Thu, Apr 11 2024 12:31 AM

Sankranthi 2025: Sankranthi 2025 is packed with Chiranjeevi and other films - Sakshi

సంక్రాంతికి ‘కుర్చీని మడతపెటి...’ అంటూ ‘గుంటూరు కారం’లో మహేశ్‌బాబు చేసిన సందడి ఇంకా వినబడుతోంది. పండగ వెళ్లి మూడు నెలలు కూడా కాకముందే వచ్చే సంక్రాంతి కోసం కర్చీఫ్‌ మడతపెట్టి, పండగ బరిలో సీట్‌ రిజర్వ్‌ చేసుకున్నారు కొందరు స్టార్స్‌. అయితే సంక్రాంతి రిలీజ్‌ అంటూ ప్రకటనలు రావడం, చివరి నిమిషంలో కొన్ని సినిమాలు తప్పుకోవడం మామూలే. ఇక 2025 సంక్రాంతి రేసులో ఇప్పటివరకూ షురూ అయిన స్టార్స్‌ గురించి తెలుసుకుందాం.

విశ్వంభర వస్తున్నాడు
సంక్రాంతికి పండక్కి చాలా హిట్స్‌ సాధించారు చిరంజీవి. 2023లో ‘వాల్తేరు వీరయ్య’తో సంక్రాంతికి వచ్చి మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. మళ్లీ 2025లో ‘విశ్వంభర’ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. జనవరి 10న రిలీజ్‌  డేట్‌ కూడా ఫిక్స్‌ చేశారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న  ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్‌ ఫిల్మ్‌లో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి కనిపిస్తారనీ టాక్‌. అలాగే ఈ చిత్రంలో చిరంజీవిది హనుమంతుడి భక్తుడి పాత్ర అట.

భార్య.. మాజీ ప్రేయసి.. మధ్యలో మాజీ పోలీసాఫీసర్‌
ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేశ్‌ ‘సైంధవ్‌’ రిలీజైంది. వచ్చే సంక్రాంతికి కూడా రానున్నారు. ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి కథకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు వెంకటేశ్‌. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. ఓ మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, అతని మాజీ ప్రేయసి.. ఇలా ఈ మూడు పాత్రల చుట్టూ సాగే క్రైమ్‌ కామెడీ మూవీ ఇది. ‘ఎఫ్‌ 2, ఎఫ్‌ 3’ చిత్రాల నిర్మాత ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. 2017లో శర్వానంద్‌ హీరోగా నటించిన ‘శతమానం భవతి’ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘శతమానం భవతి పేజీ 2’ ఉందని, 2025 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్‌ చేస్తామని ఆల్రెడీ ‘దిల్‌’ రాజు ప్రకటించారు. ఇప్పుడు వెంకటేశ్‌–అనిల్‌ రావిపూడిల కాంబినేషన్‌లోని సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.

మళ్లీ బంగార్రాజు వస్తాడా?
‘నా సామిరంగ’ అంటూ ఈ ఏడాది సంక్రాంతికి హిట్‌ సాధించారు నాగార్జున. ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో ‘సంక్రాంతికి కలుద్దాం’ అన్నారు నాగార్జున. సో.. 2025 సంక్రాంతికి కూడా నాగార్జున ఓ సినిమాను రిలీజ్‌ చేయడానికి రెడీ అవుతున్నారని ఊహించవచ్చు. 2016 సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్ని నాయనా’, 2022 సంక్రాంతికి ‘బంగార్రాజు’ (‘సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్‌) సినిమాలతో హిట్స్‌ అందుకున్నారు నాగార్జున. సో.. 2025 సంక్రాంతికి ‘బంగార్రాజు 3’ని రిలీజ్‌ చేస్తే ఎలా ఉంటుందా? అనే ఆలోచనలో ఉన్నారట. మరి.. నాగార్జున ఏ సినిమాను రిలీజ్‌ చేస్తారు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయక తప్పదు.

లక్మణ్‌ భేరి రెడీ
రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్‌’ ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి, చివరి నిమిషంలో ఇండస్ట్రీ మేలు కోసం అంటూ వాయిదా పడింది. ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజైంది. ఈసారి పక్కాగా సంక్రాంతికి రావాలనుకుంటున్నారు రవితేజ. అందుకే తన కెరీర్‌లోని 75వ చిత్రాన్ని 2025 సంక్రాంతికి రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. రచయిత భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ సినిమాలో లక్మణ్‌ భేరి పాత్రలో కనిపిస్తారు రవితేజ. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుందని టాక్‌. మరోవైపు 2021 సంక్రాంతికి ‘క్రాక్‌’ సినిమాతో వచ్చి రవితేజ హిట్‌ సాధించిన సంగతి గుర్తుండే ఉంటుంది.

ఇంకా...
ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న‘రాజా సాబ్‌’ 2025 సంక్రాంతికి వచ్చే చాన్స్‌ ఉందని ఇటీవల పేర్కొన్నారు ఈ చిత్రనిర్మాత టీజీ విశ్వప్రసాద్‌. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్‌పై మరోసారి స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఈ ఏడాది సంక్రాంతికి తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్‌’ మంచి వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. తన సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి ఇకపై ప్రతి సంక్రాంతికి ఓ సినిమా వస్తుందని పేర్కొన్నారు ప్రశాంత్‌ వర్మ. మరి.. వచ్చే సంక్రాంతికి ప్రశాంత్‌ నుంచి వచ్చే సినిమాపై ఇంకా ప్రకటన రాలేదు. ఇలా సంక్రాంతి బరిలో నిలిచే చిత్రాలు మరికొన్ని ఉన్నాయని తెలిసింది.

సంక్రాంతి బాక్సాఫీస్‌ బరిలో డబ్బింగ్‌ చిత్రాలు ఉంటుంటాయి. ఇలా అజిత్‌ హీరోగా నటించనున్న ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ సంక్రాంతి విడుదలకు ఖరారైంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనున్న ఈ సినిమాకు అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకుడు. అలాగే సూర్య హీరోగా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందనున్న సినిమా కూడా 2025 సంక్రాంతికి విడుదల కానుందనే టాక్‌ వినిపిస్తోంది. ఇంకా కన్నడ ఫిల్మ్‌ ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా రూపొందుతున్న ‘కాంతార: ది లెజెండ్‌ చాప్టర్‌ 1’ చిత్రం కూడా సంక్రాంతికి రిలీజ్‌ అవుతుందనే వార్త వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement