Sankranti Box Office
-
Sankranthi 2025: కర్చీఫ్ మడతపెట్టి...!
సంక్రాంతికి ‘కుర్చీని మడతపెటి...’ అంటూ ‘గుంటూరు కారం’లో మహేశ్‌బాబు చేసిన సందడి ఇంకా వినబడుతోంది. పండగ వెళ్లి మూడు నెలలు కూడా కాకముందే వచ్చే సంక్రాంతి కోసం కర్చీఫ్ మడతపెట్టి, పండగ బరిలో సీట్ రిజర్వ్ చేసుకున్నారు కొందరు స్టార్స్. అయితే సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రకటనలు రావడం, చివరి నిమిషంలో కొన్ని సినిమాలు తప్పుకోవడం మామూలే. ఇక 2025 సంక్రాంతి రేసులో ఇప్పటివరకూ షురూ అయిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. విశ్వంభర వస్తున్నాడు సంక్రాంతికి పండక్కి చాలా హిట్స్ సాధించారు చిరంజీవి. 2023లో ‘వాల్తేరు వీరయ్య’తో సంక్రాంతికి వచ్చి మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. మళ్లీ 2025లో ‘విశ్వంభర’ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. జనవరి 10న రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్‌లో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి కనిపిస్తారనీ టాక్. అలాగే ఈ చిత్రంలో చిరంజీవిది హనుమంతుడి భక్తుడి పాత్ర అట. భార్య.. మాజీ ప్రేయసి.. మధ్యలో మాజీ పోలీసాఫీసర్ ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేశ్ ‘సైంధవ్’ రిలీజైంది. వచ్చే సంక్రాంతికి కూడా రానున్నారు. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వెంకటేశ్. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఓ మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, అతని మాజీ ప్రేయసి.. ఇలా ఈ మూడు పాత్రల చుట్టూ సాగే క్రైమ్ కామెడీ మూవీ ఇది. ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ చిత్రాల నిర్మాత ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. 2017లో శర్వానంద్ హీరోగా నటించిన ‘శతమానం భవతి’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘శతమానం భవతి పేజీ 2’ ఉందని, 2025 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ‘దిల్’ రాజు ప్రకటించారు. ఇప్పుడు వెంకటేశ్–అనిల్ రావిపూడిల కాంబినేషన్లోని సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. మళ్లీ బంగార్రాజు వస్తాడా? ‘నా సామిరంగ’ అంటూ ఈ ఏడాది సంక్రాంతికి హిట్ సాధించారు నాగార్జున. ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో ‘సంక్రాంతికి కలుద్దాం’ అన్నారు నాగార్జున. సో.. 2025 సంక్రాంతికి కూడా నాగార్జున ఓ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారని ఊహించవచ్చు. 2016 సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్ని నాయనా’, 2022 సంక్రాంతికి ‘బంగార్రాజు’ (‘సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్) సినిమాలతో హిట్స్ అందుకున్నారు నాగార్జున. సో.. 2025 సంక్రాంతికి ‘బంగార్రాజు 3’ని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా? అనే ఆలోచనలో ఉన్నారట. మరి.. నాగార్జున ఏ సినిమాను రిలీజ్ చేస్తారు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. లక్మణ్ భేరి రెడీ రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి, చివరి నిమిషంలో ఇండస్ట్రీ మేలు కోసం అంటూ వాయిదా పడింది. ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజైంది. ఈసారి పక్కాగా సంక్రాంతికి రావాలనుకుంటున్నారు రవితేజ. అందుకే తన కెరీర్‌లోని 75వ చిత్రాన్ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రచయిత భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ సినిమాలో లక్మణ్ భేరి పాత్రలో కనిపిస్తారు రవితేజ. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుందని టాక్. మరోవైపు 2021 సంక్రాంతికి ‘క్రాక్’ సినిమాతో వచ్చి రవితేజ హిట్ సాధించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇంకా... ప్రభాస్ హీరోగా నటిస్తున్న‘రాజా సాబ్’ 2025 సంక్రాంతికి వచ్చే చాన్స్ ఉందని ఇటీవల పేర్కొన్నారు ఈ చిత్రనిర్మాత టీజీ విశ్వప్రసాద్. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్‌పై మరోసారి స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఈ ఏడాది సంక్రాంతికి తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్’ మంచి వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఇకపై ప్రతి సంక్రాంతికి ఓ సినిమా వస్తుందని పేర్కొన్నారు ప్రశాంత్ వర్మ. మరి.. వచ్చే సంక్రాంతికి ప్రశాంత్ నుంచి వచ్చే సినిమాపై ఇంకా ప్రకటన రాలేదు. ఇలా సంక్రాంతి బరిలో నిలిచే చిత్రాలు మరికొన్ని ఉన్నాయని తెలిసింది. సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో డబ్బింగ్ చిత్రాలు ఉంటుంటాయి. ఇలా అజిత్ హీరోగా నటించనున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సంక్రాంతి విడుదలకు ఖరారైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. అలాగే సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందనున్న సినిమా కూడా 2025 సంక్రాంతికి విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది. ఇంకా కన్నడ ఫిల్మ్ ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా రూపొందుతున్న ‘కాంతార: ది లెజెండ్ చాప్టర్ 1’ చిత్రం కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుందనే వార్త వచ్చిన సంగతి తెలిసిందే. -
2025 సంక్రాంతికి సినిమాల పోటీ మొదలైంది..!
-
సంక్రాంతి అంటే సినిమా ఉండాల్సిందేనా? అసలు ఈ కల్చర్ ఎప్పుడు మొదలైంది?
అసలు సంక్రాంతి అంటే ఏంటి? బతుకు తెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిపోయిన కొడుకులు, అల్లుళ్లు, కూతుళ్లు, మనవళ్లు.. అందరూ సొంతూరికి చేరుకుని ఉన్న మూడు రోజులు సరదాగా గడపడమే అసలైన పండగ. అయితే ఈ పండగ హడావుడిలో కోళ్ల పందెలు, పిండి వంటలు చాలా కామన్. వీటితో పాటు సినిమాలు చూడటం అనేది మనకు బాగా అలవాటైపోయిన పని. అసలు సంక్రాంతి అంటే సినిమా కచ్చితంగా చూడాలా? ఇంతకీ ఈ కల్చర్ ఎప్పుడు మొదలైంది? సంక్రాంతి సీజన్ సాధారణంగా సినిమాల్ని ప్రతి శుక్రవారం రిలీజ్ చేస్తుంటారు. ఎందుకంటే శని, ఆదివారాలు కలిసొస్తాయి. సెలవు రోజులు కాబట్టి కుర్రాళ్ల దగ్గర నుంచి ఫ్యామిలీస్ వరకు థియేటర్లకు వస్తారు. ఇక సంక్రాంతి లాంటి సీజన్ వచ్చిందంటే దాదాపు వారం పదిరోజులు అందరికీ సెలవులే. కుటుంబ సభ్యులందరూ ఒక్కచోటే ఉంటారు. కాబట్టి వీళ్లందరికీ వినోదం కావాలి. అప్పుడు అందరికీ గుర్తొచ్చేది సినిమా. అలా తెలుగు చిత్రాలకు సంక్రాంతి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సీజన్ అయిపోయింది. (ఇదీ చదవండి: మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఈ విషయం గమనించారా? ) ఎప్పుడు మొదలైంది? 1932లో తొలి తెలుగు సినిమా 'భక్త ప్రహ్లాద' రాకముందు వీధి నాటకాలు, బుర్రకథలు లాంటి వాటితో ప్రజలు ఎంటర్టైన్ అయ్యేవారు. ఎప్పుడైతే సినిమా కల్చర్ మొదలైందో.. బుర్రకథలు, నాటకాలు లాంటివి జనాలకు మెల్లమెల్లగా బోర్ కొట్టేశాయి. తొలుత బ్లాక్ అండ్ వైట్‌లో వచ్చిన సినిమాలు.. కాలానుగుణంగా కలర్లోకి మారాయి. అలా 70-80 దశకంలో నిర్మాతల ఆలోచన కూడా మారింది. సంక్రాంతి సీజన్‌ని క్యాష్ చేసుకోవడంతో పాటు సినీ ప్రేమికుల్ని అలరించొచ్చని తెలుసుకుని.. పండక్కి సినిమాలు రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. గ్యారంటీగా వచ్చే స్టార్ హీరోలు అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ దగ్గర నుంచి మొదలుపెడితే ప్రస్తుతం మహేశ్, ప్రభాస్ లాంటి హీరోల వరకు సంక్రాంతి సీజన్ అనేది వీళ్లకు సెంటిమెంట్ అయిపోయింది. ఇప్పుడంటే హీరోలు రెండేళ్లకొక సినిమా చేస్తున్నారు గానీ కొన్నాళ్ల ముందు వరకు సంక్రాంతికి ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలైనా కచ్చితంగా ఒక్క మూవీ అయినా రిలీజ్ చేసేవాళ్లు. అలా ప్రతిసారి పండక్కి స్టార్ హీరోల మధ్య మంచి పోటీ ఉండేది. కాకపోతే అప్పట్లో ఆరోగ్యకర వాతావరణం ఉండేది. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది! (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు) ఇప్పుడంతా దందా ఒకప్పుడు సంక్రాంతి సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే. నిర్మాతలు కూడా మంచి సినిమాని రిలీజ్ చేయాలనే తాపత్రయం మాత్రమే ఉండేది. ప్రేక్షకులకు నచ్చిందా లేదా అని మాత్రమే చూసేవాళ్లు. కానీ ఇప్పుడు అంతా మారిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే సంక్రాంతికి సినిమా అనగానే.. పండగ పేరు చెప్పి టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. సగటు ప్రేక్షకుడిని దోచుకుందామని ఫిక్స్ అయిపోతున్నారు. అభిమానులకు అంటే మరో దారి ఉండదు కాబట్టి ఆయా స్టార్ హీరోల సినిమాలకు వెళ్తారు. మరి సామాన్యుడి సంగతేంటి? నిర్మాతలని వీళ్లని పట్టించుకోరు. ఎందుకంటే సంక్రాంతికి ఊరెళ్లినా వాళ్లు.. పండక్కి సరదా కోసం ఒక్క సినిమా అయినా చూడకపోతే ఏం బాగుంటుందిలే అని థియేటర్లకు వెళ్తారు. ఇష్టం లేకపోయినా సరే ఒక్కసారే కదా అని టికెట్ రేట్లు ఎక్కువున్నా సరే డబ్బులు ఖర్చు పెట్టి తప్పక సినిమా చూస్తున్నారు. కొన్నిసార్లు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తే.. కొన్నిసార్లు మాత్రం డిసప్పాయింట్మెంట్ తప్పట్లేదు! అలాంటి సరుకు కూడా అన్నిసార్లు అని చెప్పలేం గానీ కొన్నిసార్లు సంక్రాంతికి వచ్చే సినిమాలని గమనిస్తే.. నార్మల్ టైంలో వస్తే ఇవి ఆడుతాయా? కోట్లకు కోట్లు వసూలు చేస్తాయా అనే డౌట్ చాలామందికి వచ్చే ఉంటుంది. ఎందుకంటే గతంలో అంతంత మాత్రంగానే ఉన్న కొన్ని సినిమాలు.. సంక్రాంతి టైంలో వచ్చి హిట్టో లేదా యావరేజ్ అయిపోయిన సందర్భాలు బోలెడు. ఎందుకంటే పండగ హడావుడిలో సినిమా చూస్తున్నామనే ఆనందం తప్పితే అది ఎలాంటి మూవీ అనేది సగటు ప్రేక్షకుడు పెద్దగా పట్టించుకోరు. అలా పండగ బరిలో పాసైపోయిన సినిమాలెన్నో? (ఇదీ చదవండి: విజయ్-రష్మిక రిలేషన్‌పై మళ్లీ రూమర్స్.. అంతా ఆ ఫొటోల వల్లే?) -
సంక్రాంతి బరిలో పోటీ పడిన చిరంజీవి- బాలయ్య సినిమాలు (ఫొటోలు)
-
సంక్రాంతి సంబరం... బాక్సాఫీస్ సమరం
ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా సంక్రాంతి సమరానికి బాక్సాఫీస్ ముస్తాబవుతోంది. థియేటర్ అనే గ్రౌండ్లో ప్రేక్షకులే సాక్షిగా బాక్సాఫీస్ బరిలో కలెక్షన్స్ పందేనికి కత్తులు కట్టిన కోడి పుంజుల్లా రెడీ అయ్యారు నలుగురు స్టార్ హీరోలు. వీరితో పాటు యంగ్ హీరో కూడా వస్తున్నాడు. పండగ సందర్భంగా సినిమాలు రావడం సినీ ప్రేమికులకు సంబరం... బాక్సాఫీస్‌కి వసూళ్ల సమరం. ఇక.. ఈ సంక్రాంతి పండక్కి వస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. సంక్రాంతి ఈ నెల 13న ఆరంభమవుతుంది. కానీ సినిమా సంక్రాంతి మాత్రం రెండు రోజులు ముందుగానే అంటే జనవరి 11న స్టార్ట్ అవుతుంది. తమిళ హీరోలు విజయ్ నటించిన ‘వారసుడు’ (తమిళంలో ‘వారిసు’), అజిత్ ‘తునివు’ (తెలుగులో ‘తెగింపు’) చిత్రాలు జనవరి 11నే విడుదల కానున్నాయి. విజయ్, రష్మికా మందన్నా జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వారసుడు’. ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మించారు. ఓ సంపన్న ఉమ్మడి కుటుంబంలో చోటు చేసుకునే వివిధ సంఘటనల సమాహారంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇక ‘నేర్కొండ పార్వై’ (హిందీ ‘పింక్’ తమిళ రీమేక్), ‘వలిమై’ చిత్రాల తర్వాత హీరో అజిత్, దర్శకుడు హెచ్. వినోద్, నిర్మాత బోనీ కపూర్ల కాంబినేషన్లో తెరకెక్కిన మూడో చిత్రం ‘తెగింపు’ (తమిళంలో ‘తునివు’). ఈ యాక్షన్ ఫిల్మ్ కథాంశం బ్యాంకు రాబరీ నేపథ్యంలో ఉంటుంది. బ్యాంకును హైజాక్ చేసిన ఓ వ్యక్తి, ఆ బ్యాంకు కస్టమర్లను హోస్టేజ్‌గా చేసి తన లక్ష్యాలు నెరవేరేలా ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేస్తాడు. ‘తెగింపు’ ప్రధానాంశం ఇదే అని తెలుస్తోంది. కాగా జనవరి 12న ‘వీరసింహా రెడ్డి’గా వస్తున్నారు బాలకృష్ణ. ‘అఖండ’ వంటి హిట్ తర్వాత బాలకృష్ణ, ‘క్రాక్’ వంటి హిట్ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందిన ఈ ‘వీరసింహారెడ్డి’లో శ్రుతీహాసన్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. మరోవైపు ‘వాల్తేరు వీరయ్య’గా జనవరి 13న వస్తున్నారు చిరంజీవి. ఆయన టైటిల్ రోల్లో నటించి, హీరో రవితేజ ఓ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు కొల్లి బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకుడు. శ్రుతీహాసన్ నాయిక. శ్రీకాకుళంలో నివాసం ఉండే వాల్తేరు వీరయ్య (చిరంజీవి)కు, మరో ఏరియాలో ఉండే పోలీస్ ఆఫీసర్ విక్రమ్ సాగర్ (రవితేజ)లకు మధ్య ఉన్న అనుబంధం, పగ అంశాలతో ఈ సినిమా కథనం సాగుతుందని సమాచారం. ఈ చిత్రాన్ని కూడా నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్లే నిర్మించారు. ఇక ప్రతి సంక్రాంతికి పెద్ద స్టార్స్ మధ్య చిన్న హీరోల సినిమాలూ రిలీజ్ అవుతాయి. ఈ సంక్రాంతికి ఈ జాబితాలో నిలిచిన మూవీ ‘కళ్యాణం కమనీయం’. సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ఆళ్ల అనిల్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను యూవీ కాన్సెప్ట్స్ నిర్మించింది. శివ (సంతోష్), శ్రుతి (ప్రియా) ప్రేమ బంధం నుంచి వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. అయితే శివకు జాబ్ లేకపోవడం వారి మధ్య ఎలాంటి మనస్పర్థలకు దారి తీసింది అనేది చిత్రం ప్రధానాంశం. మరి.. ఈ సంక్రాంతి బరిలో ఏ సినిమాకు ప్రేక్షకులు ‘సంక్రాంతి హిట్’ ట్యాగ్ ఇస్తారో చూడాలి. -
సంక్రాంతి సంబరం... సమరం
సంక్రాంతి పండగ సెలవుల్లో వినోదం పంచడానికి సినిమాలు రెడీ అవుతున్నాయి. ప్రేక్షకులకు సినిమా సంబరం.. హీరోలకు బాక్సాఫీస్ సమరం. ఈసారి పండగ బరిలో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఉన్నాయి. ఇంతకుముందు ఈ ఇద్దరూ సంక్రాంతికి చాలాసార్లు పోటీపడ్డారు. ఇక పండగకి రానున్న చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. వీరయ్య విజృంభణ దాదాపు ఆరేళ్ల తర్వాత సంక్రాంతి పండక్కి రానున్నారు చిరంజీవి. 2017 సంక్రాంతికి ‘ఖైదీ నంబరు 150’ చిత్రంతో ఆయన ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ (ప్రచారంలో ఉన్న టైటిల్)గా వస్తున్నారు చిరంజీవి. రవితేజ ఓ లీడ్ రోల్లో, శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. విశాఖపట్నం నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్–పోలీస్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోందని తెలిసింది. వీరసింహారెడ్డి విశ్వరూపం సంక్రాంతి పండక్కి చివరిసారిగా రిలీజైన బాలకృష్ణ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఆరేళ్ల తర్వాత బాలకృష్ణ సంక్రాంతికి ‘వీర సింహారెడ్డి’గా నట విశ్వరూపం చూపించనున్నారు. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన యాక్షన్ డ్రామాగా రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఆదిపురుష్ ఆగమనం ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ వేసవిలో విడుదలైంది. దీంతో ‘ఆదిపురుష్’ సినిమాను ఎలాగైనా 2023 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్రభాస్ స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయినట్లు ఉన్నారు. అందుకే ‘ఆదిపురుష్’ను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించింది చిత్రయూనిట్. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మైథలాజికల్ ఫిల్మ్‌లో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతీ సనన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు. భూషణ్‌కుమార్, క్రషణ్‌కుమార్, రాజేష్ నాయర్, ప్రసాద్ సుతార్, ఓం రౌత్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. వారసుడు వస్తున్నాడు తమిళ హీరో విజయ్ తెలుగులో ‘వారసుడు’గా సంక్రాంతి పండగకి వస్తున్నాడు. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’). ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఓ సంపన్న ఉన్నత కుటుంబానికి వారసుడిగా వచ్చిన ఓ దత్తపుత్రుడు నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. వైష్ణవ్ తేజ్ కూడా... వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీలీల హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు ఏడెనిమిదిసార్లు సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డ చిరంజీవి, బాలకృష్ణ ఇప్పుడు మరోసారి బరిలో నిలుస్తున్నారు. ఈ సంక్రాంతికి చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఇక గతంలో సంక్రాంతి పండగకి కాస్త ముందూ వెనకా విడుదలైన చిరంజీవి, బాలకృష్ణల చిత్రాలేంటంటే... ఈ చిత్రాలు సంక్రాంతి సందర్భంగా వచ్చినా ఒకే తేదీన రాలేదు. ఒక్క 2001లో మాత్రమే చిరంజీవి నటించిన ‘మృగరాజు’, బాలకృష్ణ నటించిన ‘సమరసింహా రెడ్డి’ చిత్రాలు సంక్రాంతి సందర్భంగా ఒకే రోజున అంటే జనవరి 11న విడుదలయ్యాయి. మరి...ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ రిలీజ్ డేట్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. -
సంక్రాంతి బరిలో మరో హీరో.. కలిసొచ్చిన 'ఆర్ఆర్ఆర్' వాయిదా
Dulquer Salman Salute Movie Release In Sankranti Festival: దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న రౌద్రం రణం రుధిరం ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది. అయితే దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసుల నేపథ్యం, పలు రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ, థియేటర్లు మూసివేయడం వంటి తదితర కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయితే తమ చిత్రాలకు నష్టం కలుగుతుందని భావించి వాయిదా వేసుకున్న నిర్మాతలు ఉన్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా అనేక చిత్రాలకు కలసివచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు అందుబాటులో ఉండేసరికి తమ సినిమాలకు మార్గం సుగమం అయినట్లు భావించి విడుదలకు సిద్ధమవుతున్నారు మేకర్స్. ఈ క్రమంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన కొత్త సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. దుల్కర్ సల్మాన్ నటించి సెల్యూట్ చిత్రాన్ని మలయాళంలో జనవరి 14న రిలీజ్ చేయనున్నట్లు ఇదీ వరకే ప్రకటించింది చిత్రబృందం. అయితే ప్రస్తుతం తెలంగాణ, ఏపీలో థియేటర్లు అందుబాటులో ఉండటంతో తెలుగులోనూ అదే రోజున విడుదల చేస్టున్నట్లు సమాచారం. దుల్కర్ సల్మాన్ పోలీస్ అధికారిగా నటిస్తున్న ఈ చిత్రానికి రోషన్ ఆండ్రూస్ డైరెక్టర్. ఈ చిత్రంతో పాటు ఆది సాయి కుమార్ నటించిన 'అతిథి దేవోభవ' (జనవరి 7), సిద్దు జొన్నలగడ్డ 'డీజే టిల్లు' (జనవరి 14), సూపర్ మచ్చి (జనవరి 14), మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా 'హీరో' (జనవరి 15) తదితర సినిమాలు సంక్రాంతికి సందడి చేయనున్నాయి. ఇదీ చదవండి: సల్మాన్ ఖాన్ డ్యాన్స్ వీడియో వైరల్.. సిక్స్ ప్యాక్ ఫేక్ అని ట్రోలింగ్ -
ఎన్టీయార్ వర్సెస్ ఏయన్నార్!
ఎన్టీయార్... ఏయన్నార్... ఇద్దరు అగ్ర హీరోలు. సినీ పరిశ్రమకు ఇద్దరూ రెండు కళ్ళు. పలకరింపులున్నా, కలసి పనిచేస్తున్నా – బాక్సాఫీస్ వద్ద పోటాపోటీ మాత్రం వదలని ఇద్దరు ప్రత్యర్థి మిత్రులు! సంక్రాంతి లాంటి తెలుగు వారి పెద్ద పండుగకు ఆ టాప్ స్టార్ల ఇద్దరి సినిమాలూ ఒకదానిపై మరొకటి పోటీకొస్తే? పైగా, ఆ పోటీపడ్డ సినిమాలు కూడా ఆ హీరోలు స్వయంగా నిర్మించిన సొంత సినిమాలైతే? తెలుగు సినీచరిత్రలో 60 ఏళ్ళ క్రితం ఒకే ఒక్కసారి ఆ ‘క్లాష్ ఆఫ్ ది టైటాన్స్’ జరిగింది. ఆ కథేమిటంటే... నిజానికి, అగ్రహీరోలు ఎన్టీయార్, ఏయన్నార్ల ఇద్దరి సినిమాలూ ఒకే రిలీజ్ టైమ్‌లో పోటీపడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ, సరిగ్గా అరవై ఏళ్ళ క్రితం 1961 నాటి ఆ సంక్రాంతి ప్రత్యేకత – ఆ అగ్రహీరోలు స్వయంగా నిర్మించిన వారి సొంత సినిమాలు ఒక దానితో మరొకటి ఢీ కొట్టడం! ఒకటి – ఎన్టీయార్ స్వయంగా నిర్మిస్తూ, నటిస్తూ, దర్శకత్వం వహించిన పౌరాణిక చిత్రం ‘సీతారామ కల్యాణం’. రెండోది – ఏయన్నార్ తన సొంత సంస్థ అన్నపూర్ణా పిక్చర్స్‌లో నటించిన సాంఘిక చిత్రం ‘వెలుగు నీడలు’. అలా వారిద్దరి సొంత సినిమాలూ పోటీపడ్డ సందర్భం అదొక్కటే. విచిత్రంగా పోటీపడ్డ రెండు సినిమాలూ సూపర్ హిట్టే! రెండూ ఆణిముత్యాలే!! దేని ప్రత్యేకత దానిదే! మాతాపిత పాదపూజ... మెగాఫోన్‌తో ఫస్ట్ టైమ్... ‘సీతారామ కల్యాణం’తో ఎన్టీఆర్ తొలిసారిగా దర్శకుడి అవతారమెత్తారు. నిజానికి, ఎన్టీఆర్‌ను రాముడిగా, ఎస్వీఆర్ను రావణుడిగా పెట్టి ఈ సినిమా తీయాలనీ, ఎన్టీఆర్‌కు గురుతుల్యుడైన కె.వి. రెడ్డి దర్శకత్వం చేయాలనీ మొదటి ప్లాన్. ఈ చిత్రకథ కోసం ఎన్టీఆర్ బంధువు, స్నేహితుడైన ధనేకుల బుచ్చి వెంకట కృష్ణ చౌదరి ‘వాల్మీకి రామాయణం’లో లేని అనేక జనశ్రుతి కథలనూ, పురాణ గాథలనూ సేకరించారు. గమ్మత్తైన ఆ అంశాల ఆధారంగా రావణబ్రహ్మ గురించి మరింత తెలుసుకున్న ఎన్టీఆర్ ఆ పాత్ర తానే వేయాలని ముచ్చటపడ్డారు. అయితే, వెండితెర శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, శ్రీనివాసుడిగా ఎన్టీఆర్‌ను మెచ్చిన జనం, ప్రతినాయకుడైన రావణ బ్రహ్మ పాత్రలో ఆయనను చూడలేరని కె.వి. రెడ్డి వాదన. సినీ జీవిత దర్శక గురువు కె.వి. రెడ్డి పక్కకు తప్పుకున్నా, ఎన్టీఆర్ వెనక్కి తగ్గలేదు. దర్శకుడిగా ఎవరి పేరూ వేయకుండా, తానే తొలిసారిగా ఆ సినిమా డైరెక్ట్ చేసి, జనాన్ని మెప్పించారు. గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నా రు. తల్లితండ్రులకు పాదపూజ చేసి, వారి పాదపద్మాలకు ఎన్టీఆర్ తన ఆ తొలి దర్శకత్వ ప్రయోగాన్ని సమర్పించారు. ‘సీతారామ కల్యాణం’ టైటిల్స్ చివర సినిమాలో ఆ పాదపూజ దృశ్యం కనిపిస్తుంది. ఎన్టీఆర్ సొంత చిత్రాల్లో తల్లితండ్రులకు పాదపూజ కనిపించేది ఆ ఒక్క చిత్రంలోనే! సావిత్రి ఆధిక్యానికి శుభారంభం! ‘వెలుగు నీడలు’కు అక్కినేని ఆస్థాన దర్శకుడైన ఆదుర్తి సుబ్బారావే దర్శకుడు. అప్పట్లో ఆదుర్తి వద్ద అసోసియేట్ డైరెక్టరైన కె. విశ్వనాథ్ ఈ చిత్ర రూపకల్పన, చిత్రీకరణల్లో కీలకభాగస్వామి. ‘వెలుగు నీడలు’కు ముందు దశాబ్దమంతా అక్కినేని – సావిత్రి వెండితెరపై హిట్ పెయిర్‌గా వెలిగారు. కానీ, ‘వెలుగు నీడలు’ నుంచి సావిత్రికి ఆధిక్యమిచ్చే కథలు, కథనాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి సావిత్రి పోషించే పాత్ర చుట్టూ సినిమాలు తిరగడం, కథలో అక్కినేనికి జోడీగా సైడ్ హీరోయిన్ ఉండడం కామన్ అయ్యింది. తరువాత ఓ దశాబ్ద కాలం పాటు ‘మంచి మనసులు’, ‘మూగ మనసులు’, ‘చదువుకున్న అమ్మాయిలు’, ‘డాక్టర్ చక్రవర్తి’ – ఇలా అనేక సినిమాలు ఆ పద్ధతిలో వచ్చాయి. ఆ రకంగా తెలుగు తెరపై సావిత్రి ఆధిక్యాన్ని ప్రజానీకానికి ప్రదర్శించిన తొలి చిత్రం ‘వెలుగు నీడలు’. ఆ పాటలు... ఆల్ టైమ్ హిట్స్! ‘సీతారామ కల్యాణం’, ‘వెలుగు నీడలు’ – రెండూ మ్యూజికల్ హిట్లే. ‘సీతారామ కల్యాణం’లో సముద్రాల సీనియర్ రాయగా, గాలి పెంచల నరసింహారావు స్వరపరచిన ‘శ్రీసీతారాముల కల్యాణము చూతము రారండి..’ పాట ఆల్ టైమ్ హిట్. ఎన్టీఆర్ పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న ఈ కల్యాణ గీతం ఇవాళ్టికీ శ్రీరామనవమి పందిళ్ళలోనూ, గుళ్ళలోనూ, పెళ్ళిళ్ళలోనూ మారుమోగుతూ, తెలుగువారి జనజీవితాల్లో భాగంగా నిలిచింది. అలాగే, దేశ స్వాతంత్య్ర దినోత్సవం కానీ, గణతంత్ర దినోత్సవం కానీ వచ్చాయంటే – పెండ్యాల స్వరసారథ్యంలోని ‘వెలుగు నీడలు’లో శ్రీశ్రీ రాసిన దేశభక్తి గీతం ‘పాడవోయి భారతీయుడా...’ ఇప్పటికీ ఊరూవాడా వినపడుతుంది. అలాగే శ్రీశ్రీ రచించిన ఆలోచనాభరిత గీతం ‘కల కానిది..’ కూడా! ఆ మాటకొస్తే ఈ రెండు చిత్రాల్లో ‘వెలుగు నీడలు’ పెద్ద మ్యూజికల్ హిట్. అందులో శ్రీశ్రీయే రాసిన ‘ఓ రంగయో పూలరంగయో..’, ‘హాయి హాయిగా జాబిల్లి..’, కొసరాజు రాసిన ‘సరిగంచు చీరెగట్టి..’, కాలేజీ గీతం ‘భలే భలే మంచిరోజులులే..’ లాంటి పాటలన్నీ ఇప్పటికీ వినపడుతూనే ఉంటాయి. విప్లవాత్మక పాయింట్... సంప్రదాయ ట్రీట్మెంట్... వెలుగు నీడల వింత కలయిక జీవితం. ప్రతి ఒక్కరికీ సుఖదుఃఖాలు సహజమనీ, వాటిని ధైర్యంగా స్వీకరించాలనీ చెప్పే ‘వెలుగు నీడలు’ చిత్రానికి దుక్కిపాటి, ఆదుర్తి, కె. విశ్వనాథ్ కలసి కథ అల్లారు. దీనికి ఆత్రేయ రాసిన మాటలు హైలైట్. ‘‘కన్నీరు మానవుల్ని బతికించగలిగితే అది అమృతం కంటే కరువయ్యేది’’ లాంటి ఆత్రేయ మార్కు డైలాగులు ‘వెలుగు నీడలు’లో మనసును పట్టేస్తాయి. నిజానికి, ఆ చిత్రంలో దర్శక, రచయితలు తీసుకున్న విధవా పునర్వివాహం అనే పాయింట్ అరవై ఏళ్ళ క్రితం విప్లవాత్మకమైనది. కాలానికి నిలబడిపోయిన కల కానిది.. పాటలో వినిపించే ఆశావాదం ఆ పాయింట్‌నే కథానుగుణంగా, అంతర్లీనంగాప్రస్తావిస్తుంది. హీరో పాత్ర పెళ్ళికి ముందుకొచ్చినా, సావిత్రి నిరాకరిస్తుంది. భర్త (జగ్గయ్య)ను పోగొట్టుకున్న సావిత్రికి అక్కినేనితో పునర్వివాహం చేస్తే, అది ఆ కాలానికి ఓ రివల్యూషనరీ సినిమా అయ్యుండేది. కానీ, ఆనాటి సగటు ప్రేక్షకుల సెంటిమెంట్లను దృష్టిలో పెట్టుకొని, సంప్రదాయ ధోరణిలోనే సినిమా కథను దర్శక,రచయితలు ముగించడం గమనార్హం. నైజామ్‌లో ఆలస్యంగా... ఎన్టీఆర్, ఏయన్నార్ల హవా నడుస్తున్న రోజులవి. డిస్టిబ్య్రూటర్లు – ఎగ్జిబిటర్లు విస్తరించిన దశ అది. ఆ సమయంలో సైతం ఈ రెండు చిత్రాలూ గమ్మత్తు గా ఒక్కో ఏరియాలో ఒక్కోసారి రిలీజయ్యా యి. మొదట ఆంధ్ర ప్రాంతంలో జనం ముందుకొచ్చిన ఈ చిత్రాలు, ఆ తరువాత వారం రోజులు ఆలస్యంగా నైజామ్ (తెలంగాణ) ఏరియాలో రిలీజయ్యాయి. ‘సీతారామ కల్యాణం’ ఆంధ్రాలో జనవరి 6న వస్తే, తెలంగాణలో జనవరి 14న రిలీజైంది. ఇక, ‘వెలుగు నీడలు’ ఆంధ్రాలో జనవరి 7న విడుదలైతే, తెలంగాణలో జనవరి 12న థియేటర్లలో పలకరించింది. ఆ రోజుల్లో ఎన్టీయార్ ‘సీతారామ కల్యాణం’ 28 ప్రింట్లతో రిలీజైంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా 50 రోజులు ప్రదర్శితమైంది. ఆ పైన 9 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. విజయవాడ శ్రీలక్ష్మీ టాకీస్‌లో 156 రోజులు ఆడింది. జాతీయ అవార్డుల్లో రాష్ట్రపతి యోగ్యతా పత్రం (మెరిట్ సర్టిఫికెట్) అందుకున్న పౌరాణిక చిత్రంగా నిలిచింది. మద్రాస్ ఫిల్మ్ ఫ్యాన్స్ బ్యాలెట్లో ఉత్తమ దర్శకుడిగా ఎంపికై, ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు. ఇక, అక్కినేని ‘వెలుగు నీడలు’ కేవలం 20 ప్రింట్లతో రిలీజైంది. దిగ్విజయంగా 12 కేంద్రాలలో 50 రోజులు, 6 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. 1961 ఏప్రిల్ 16న విజయవాడ అలంకార్ థియేటర్లో, ఆ మరునాడు రాజమండ్రిలో ‘వెలుగు నీడలు’ యూని ట్ సభ్యుల మధ్య శతదినోత్సవాలు జరిపారు. అప్పట్లో ఈ సినిమాలు రెండింటికీ ప్రత్యేకించి వెండితెర నవలలు రావడం విశేషం. ‘సీతారామ కల్యాణం’ చిత్రరచయిత సముద్రాల సీనియర్ కుమారుడైన సముద్రాల జూనియర్ ఆ సినిమాకు వెండితెర నవల రాశారు. ఇక, ‘వెలుగు నీడలు’ వెండితెర నవలకు ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకట రమణ అక్షరరూపం ఇచ్చారు. సంక్రాంతికి అగ్రహీరోలిద్దరి పోటాపోటీలో వచ్చిన ఈ రెండు ఆణిముత్యాలు ఇవాళ్టికీ తెలుగు సినీ ప్రియులకు మరపురానివి! చరిత్ర మరువలేనివి!! – రెంటాల జయదేవ తెరపైకి ఫస్ట్ టైమ్... నాగార్జున నేటి ప్రముఖ హీరో నాగార్జున పది నెలల పసివా డుగా ఉన్నప్పుడే వెండితెరపై తొలిసారిగా ప్రత్యక్షమైన చిత్రం – ‘వెలుగు నీడలు’. ఆ సినిమాలోని ‘చల్లని వెన్నెల సోనలు..’ పాటలో అక్కినేని, సావిత్రి చేతుల్లో నెలల పిల్లాడైన నాగార్జున కనిపిస్తారు. నిజానికి, ఆ సినిమాలో ఆ పాట చిత్రీకర ణలో వేరే పిల్లాడు పాల్గొనాల్సింది. తీరా ఆ రోజు షూటింగ్ టైమ్‌కు ఆ పిల్లాడిని ప్రొడక్షన్ వాళ్ళు తీసుకురాలేదు. ఆలస్యమైపోతోంది. అదే సమయంలో అక్కినేని భార్య అన్నపూర్ణ, పసివాడైన నాగా ర్జునను తీసుకొని, షూటింగ్ స్పాట్‌కు ఊరకనే వచ్చారు. ఆమె చంకలోని పిల్లాణ్ణి చూసి, నిర్మాత దుక్కిపాటి వగైరా ఆ పాట సీనును నాగార్జునను పెట్టి, చిత్రీకరించేశారు. అలా యాదృచ్ఛికంగా నెలల వయసులోనే నాగార్జున ఫస్ట్ టైమ్ కెమెరాముందుకు వచ్చేశారు. కెమేరా మాంత్రికుడి తొలి ట్రిక్ ‘సీతారామ కల్యాణం’ ద్వారా కూడా ఓ ప్రముఖ సాంకేతిక నిపుణుడు పరిచయమయ్యాడు. ఆ సాంకేతిక మాంత్రికుడు– తాంత్రిక ఛాయాగ్రహణంలో దేశంలోనే దిట్టగా తరువాతి కాలంలో పేరు తెచ్చుకున్న రవికాంత్ నగాయిచ్. ఎన్టీఆర్ ఆస్థాన సినిమాటోగ్రాఫర్ ఎం.ఎ. రెహమాన్ రేసుల పిచ్చిలో పడి, ‘సీతారామ కల్యాణం’ ముహూర్తం టైముకు రాలేదు. అప్పటికే చాలాకాలంగా ఒక్క అవకాశం ఇవ్వాల్సిందంటూ ఎన్టీఆర్ చుట్టూ నగాయిచ్ తిరుగుతున్నారు. ఆ రోజు గేటు దగ్గర కనిపించిన రవికాంత్ నగాయిచ్ను కారులోఎక్కించుకొని తీసుకెళ్ళి, ముహూర్తం షాట్ చేసేశారు ఎన్టీఆర్. అలా మొదలైన వారిద్దరి బంధం ‘గులేబకావళి కథ’, ‘శ్రీకృష్ణ పాండవీయం’, ‘ఉమ్మడి కుటుంబం’, ‘వరకట్నం’ లాంటి అనేక సినిమాల వరకు అప్రతిహతంగా కొనసాగింది. ‘లవకుశ’, ‘వీరాభిమన్యు’, ‘సంపూర్ణ రామాయణం’, ‘సీతాకల్యాణం’ లాంటి ప్రసిద్ధ పౌరాణిక చిత్రాలకూ నగాయిచే ట్రిక్ వర్క్ చేశారు. ఆ తరువాత నగాయిచ్ పలు హిందీ చిత్రాలకు దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. నాటకీయ స్వగతానికి నాంది! ‘సీతారామ కల్యాణా’నికి మాటలు, పాటలు రాసిన సముద్రాల సీనియర్ తన రచనతో తెరపై ఓ కొత్త ధోరణికి నాంది పలికారు. కథలోని కీలకమైన పాత్ర రంగస్థలం మీది ఏకపాత్రాభినయం ధోరణిలో ధీరగంభీర స్వరంతో తన స్వగతాన్ని తానే పైకి ఆవిష్కరించుకుంటూ, డైలాగులు పలికే ప్రక్రియను సినిమాల్లోకి జొప్పించారు. ‘సీతారామ కల్యాణం’లోని రావణ పాత్రలో ఎన్టీఆర్ ఆ స్వగతాభినయం చేశారు. అలా మొదలైన ఆ ధోరణి ‘నర్తనశాల’, ‘పాండవ వనవాసం’, ‘సంపూర్ణ రామాయణం’ (ఎస్వీఆర్), ‘శ్రీకృష్ణపాండవీయం’, ‘దానవీరశూర కర్ణ’ (ఎన్టీఆర్) మీదుగా సాంఘిక చిత్రాల వరకు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ సినిమాల్లో ఆ నాటకీయ ఉపన్యాస ఫక్కీని అనుసరిస్తుండడం విశేషం. -
సంక్రాంతి వార్: మారిన రిలీజ్ డేట్స్
హైదరాబాద్ : స్టార్ హీరోల సినిమాలను సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేసి వీలైనంత సొమ్ము చేసుకోవాలని అగ్ర నిర్మాతలు పోటీ పడుతుంటారు. సంక్రాంతికి రెండు, మూడు సినిమాలు పోటాపోటీగా రిలీజైనా అన్ని సినిమాలు మెరుగైన వసూళ్లు సాధించే స్పేస్ ఉంటుందని చెబుతారు. అయితే ఒకే రోజు ఇద్దరు అగ్రహీరోలు నటించిన సినిమాలు విడుదలైతే మాత్రం అది ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపుతుందని, లాంగ్‌రన్‌లోనూ వసూళ్లు ఎఫెక్ట్ అవుతాయనే ఆందోళనా వ్యక్తమవుతుంది. రానున్న సంక్రాంతికి ప్రిన్స్ మహేష్ సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో జనవరి 12న రిలీజ్ డేట్‌ను లాక్ చేశాయి. బన్నీ, ప్రిన్స్‌ల బాక్సాఫీస్ క్లాష్‌పై బయ్యర్లతో పాటు ఫ్యాన్స్‌లోనూ ఆందోళన రేకెత్తడంతో విడుదల తేదీలపై నిర్మాతలు పునరాలోచనలో పడ్డారు. ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైతే ఓపెనింగ్స్‌తో పాటు నెగెటివ్, మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమా వసూళ్లు దెబ్బతింటాయనే భయం వెంటాడుతోంది. భారీ మొత్తాలు వెచ్చించి సినిమాలను కొనుగోలు చేసే బయ్యర్లకు అంత భారీ మొత్తం రికవర్ కావాలంటే రెండు సినిమాల మధ్య గ్యాప్ ఉండాలని భావిస్తున్నారు. విడుదల తేదీ వివాదంపై ఇటీవల సమావేశమైన ఇరువురు నిర్మాతలు చర్చించి రిలీజ్ డేట్స్‌ను మార్చినట్టు చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం అల వైకుంఠపురములో, సరిలేరునీకెవ్వరూ చిత్రాలు వరుసగా జనవరి 11, 13 తేదీల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. విడుదల తేదీలపై ఆయా చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రెండు భారీ చిత్రాలు ఒకేరోజు తలపడకుండా రెండు రోజుల గ్యాప్‌తో రానుండటంతో ఇరు సినిమాలు భారీ వసూళ్లను కొల్లగొడతాయని మేకర్లు భావిస్తున్నారు. -
కౌంట్‌డౌన్ స్టార్ట్!
సంక్రాంతి బాక్సాఫీస్ పందెంలో దూసుకు రానున్న ‘డిక్టేటర్’ కోసం అభిమానులు కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో చిత్రబృందం గుమ్మడికాయ ఫంక్షన్‌ను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించింది. షూటింగ్ అనుకున్న విధంగా జరగడంతో కేక్ కట్ చేసి, సందడి చేశారు. బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ‘‘అభిమానులు బాలకృష్ణను ఎంత స్టయిలిష్‌గా చూడాలని కోరుకుంటారో, ఈ చిత్రంలో అలానే కనిపిస్తారు’’ అని దర్శక-నిర్మాత శ్రీవాస్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కథ-స్క్రీన్‌ప్లే: కోనవెంకట్, గోపీమోహన్, సహ-నిర్మాత: శ్రీవాస్.