సంక్రాంతి సంబరం... సమరం | Chiranjeevi vs Balakrishna: Who Will Win Sankranthi BoxOffice Race 2023 | Sakshi
Sakshi News home page

సంక్రాంతి సంబరం... సమరం

Published Sun, Oct 23 2022 6:33 AM | Last Updated on Sun, Oct 23 2022 7:14 AM

Chiranjeevi vs Balakrishna: Who Will Win Sankranthi BoxOffice Race 2023 - Sakshi

సంక్రాంతి పండగ సెలవుల్లో వినోదం పంచడానికి సినిమాలు రెడీ అవుతున్నాయి. ప్రేక్షకులకు సినిమా సంబరం.. హీరోలకు బాక్సాఫీస్‌ సమరం. ఈసారి పండగ బరిలో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఉన్నాయి. ఇంతకుముందు ఈ ఇద్దరూ సంక్రాంతికి చాలాసార్లు పోటీపడ్డారు. ఇక పండగకి రానున్న చిత్రాల విశేషాలు తెలుసుకుందాం.

వీరయ్య విజృంభణ
దాదాపు ఆరేళ్ల తర్వాత సంక్రాంతి పండక్కి రానున్నారు చిరంజీవి. 2017 సంక్రాంతికి ‘ఖైదీ నంబరు 150’ చిత్రంతో ఆయన ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌)గా వస్తున్నారు చిరంజీవి. రవితేజ ఓ లీడ్‌ రోల్‌లో, శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు కేఎస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. విశాఖపట్నం నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్‌–పోలీస్‌ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోందని తెలిసింది.  

వీరసింహారెడ్డి విశ్వరూపం
సంక్రాంతి పండక్కి చివరిసారిగా రిలీజైన బాలకృష్ణ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఆరేళ్ల తర్వాత బాలకృష్ణ సంక్రాంతికి ‘వీర సింహారెడ్డి’గా నట విశ్వరూపం చూపించనున్నారు.
బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమాలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన యాక్షన్‌ డ్రామాగా రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.

ఆదిపురుష్‌ ఆగమనం
ప్రభాస్‌ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్‌’ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ వేసవిలో విడుదలైంది. దీంతో ‘ఆదిపురుష్‌’ సినిమాను ఎలాగైనా 2023 సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని ప్రభాస్‌ స్ట్రాంగ్‌గా ఫిక్స్‌ అయినట్లు ఉన్నారు. అందుకే ‘ఆదిపురుష్‌’ను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించింది చిత్రయూనిట్‌. ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మైథలాజికల్‌ ఫిల్మ్‌లో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతీ సనన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, రావణుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. భూషణ్‌కుమార్, క్రషణ్‌కుమార్, రాజేష్‌ నాయర్, ప్రసాద్‌ సుతార్, ఓం రౌత్, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న రిలీజ్‌ కానుంది.  

వారసుడు వస్తున్నాడు
తమిళ హీరో విజయ్‌ తెలుగులో ‘వారసుడు’గా సంక్రాంతి పండగకి వస్తున్నాడు. విజయ్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’). ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్‌. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఓ సంపన్న ఉన్నత కుటుంబానికి వారసుడిగా వచ్చిన ఓ దత్తపుత్రుడు నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందనే టాక్‌ వినిపిస్తోంది.

వైష్ణవ్‌ తేజ్‌ కూడా...
వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా శ్రీకాంత్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీలీల హీరోయిన్‌. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు.  

ఇప్పటివరకు ఏడెనిమిదిసార్లు సంక్రాంతికి బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడ్డ చిరంజీవి, బాలకృష్ణ ఇప్పుడు మరోసారి బరిలో నిలుస్తున్నారు. ఈ సంక్రాంతికి చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఇక గతంలో సంక్రాంతి పండగకి కాస్త ముందూ వెనకా విడుదలైన చిరంజీవి, బాలకృష్ణల చిత్రాలేంటంటే...

ఈ చిత్రాలు సంక్రాంతి సందర్భంగా వచ్చినా ఒకే తేదీన రాలేదు. ఒక్క 2001లో మాత్రమే చిరంజీవి నటించిన ‘మృగరాజు’, బాలకృష్ణ నటించిన ‘సమరసింహా రెడ్డి’ చిత్రాలు సంక్రాంతి సందర్భంగా ఒకే రోజున అంటే జనవరి 11న విడుదలయ్యాయి. మరి...ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ రిలీజ్‌ డేట్స్‌ ఎలా ఉంటాయో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement