సంక్రాంతి సంబరం... బాక్సాఫీస్‌ సమరం | Sankranthi 2023 Box Office War | Sakshi
Sakshi News home page

సంక్రాంతి సంబరం... బాక్సాఫీస్‌ సమరం

Published Fri, Jan 6 2023 5:22 AM | Last Updated on Fri, Jan 6 2023 7:55 AM

Sankranthi 2023 Box Office War - Sakshi

ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా సంక్రాంతి సమరానికి బాక్సాఫీస్‌ ముస్తాబవుతోంది. థియేటర్‌ అనే గ్రౌండ్‌లో ప్రేక్షకులే సాక్షిగా బాక్సాఫీస్‌ బరిలో కలెక్షన్స్‌ పందేనికి కత్తులు కట్టిన కోడి పుంజుల్లా రెడీ అయ్యారు నలుగురు స్టార్‌ హీరోలు. వీరితో పాటు యంగ్‌ హీరో కూడా వస్తున్నాడు. పండగ సందర్భంగా సినిమాలు రావడం సినీ ప్రేమికులకు సంబరం...  బాక్సాఫీస్‌కి వసూళ్ల సమరం. ఇక.. ఈ సంక్రాంతి పండక్కి వస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.

సంక్రాంతి ఈ నెల 13న ఆరంభమవుతుంది. కానీ సినిమా సంక్రాంతి మాత్రం రెండు రోజులు ముందుగానే అంటే జనవరి 11న స్టార్ట్‌ అవుతుంది. తమిళ హీరోలు విజయ్‌ నటించిన ‘వారసుడు’ (తమిళంలో ‘వారిసు’), అజిత్‌ ‘తునివు’ (తెలుగులో ‘తెగింపు’) చిత్రాలు జనవరి 11నే విడుదల కానున్నాయి. విజయ్, రష్మికా మందన్నా జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వారసుడు’. ఈ సినిమాను ‘దిల్‌’ రాజు, శిరీష్‌లు నిర్మించారు. ఓ సంపన్న ఉమ్మడి కుటుంబంలో చోటు చేసుకునే వివిధ సంఘటనల సమాహారంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

ఇక ‘నేర్కొండ పార్వై’  (హిందీ ‘పింక్‌’ తమిళ రీమేక్‌), ‘వలిమై’ చిత్రాల తర్వాత హీరో అజిత్, దర్శకుడు హెచ్‌. వినోద్, నిర్మాత బోనీ కపూర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన మూడో చిత్రం ‘తెగింపు’ (తమిళంలో ‘తునివు’). ఈ యాక్షన్‌ ఫిల్మ్‌ కథాంశం బ్యాంకు రాబరీ నేపథ్యంలో ఉంటుంది. బ్యాంకును హైజాక్‌ చేసిన ఓ వ్యక్తి, ఆ బ్యాంకు కస్టమర్లను హోస్టేజ్‌గా చేసి తన లక్ష్యాలు నెరవేరేలా ప్రభుత్వం సహకరించాలని డిమాండ్‌ చేస్తాడు. ‘తెగింపు’ ప్రధానాంశం ఇదే అని తెలుస్తోంది. కాగా జనవరి 12న ‘వీరసింహా రెడ్డి’గా వస్తున్నారు బాలకృష్ణ. ‘అఖండ’ వంటి హిట్‌ తర్వాత బాలకృష్ణ, ‘క్రాక్‌’ వంటి హిట్‌ తర్వాత దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో రూపొందిన ఈ ‘వీరసింహారెడ్డి’లో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మాతలు.

రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. మరోవైపు ‘వాల్తేరు వీరయ్య’గా జనవరి 13న వస్తున్నారు చిరంజీవి. ఆయన టైటిల్‌ రోల్‌లో నటించి, హీరో రవితేజ ఓ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు కొల్లి బాబీ (కేఎస్‌ రవీంద్ర) దర్శకుడు. శ్రుతీహాసన్‌ నాయిక. శ్రీకాకుళంలో నివాసం ఉండే వాల్తేరు వీరయ్య (చిరంజీవి)కు, మరో ఏరియాలో ఉండే పోలీస్‌ ఆఫీసర్‌ విక్రమ్‌ సాగర్‌ (రవితేజ)లకు మధ్య ఉన్న అనుబంధం, పగ అంశాలతో ఈ సినిమా కథనం సాగుతుందని సమాచారం. ఈ చిత్రాన్ని కూడా నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌లే నిర్మించారు. ఇక ప్రతి సంక్రాంతికి పెద్ద స్టార్స్‌ మధ్య చిన్న హీరోల సినిమాలూ రిలీజ్‌ అవుతాయి. ఈ సంక్రాంతికి ఈ జాబితాలో నిలిచిన మూవీ ‘కళ్యాణం కమనీయం’. సంతోష్‌ శోభన్, ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ఆళ్ల అనిల్‌ కుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమాను యూవీ కాన్సెప్ట్స్‌ నిర్మించింది. శివ (సంతోష్‌), శ్రుతి (ప్రియా) ప్రేమ బంధం నుంచి వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. అయితే శివకు జాబ్‌ లేకపోవడం వారి మధ్య ఎలాంటి మనస్పర్థలకు దారి తీసింది అనేది చిత్రం ప్రధానాంశం.
మరి.. ఈ సంక్రాంతి బరిలో ఏ సినిమాకు ప్రేక్షకులు ‘సంక్రాంతి హిట్‌’ ట్యాగ్‌ ఇస్తారో చూడాలి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement