చిత్రం: శతమానం భవతి రచన: శ్రీమణి
సంగీతం: మిక్కీ జె మేయర్ గానం: మోహన, దివ్య దివాకర్, ఆదిత్య అయ్యంగార్, రోహిత్ పరిటాల
మూడు రోజుల పాటు జరుపుకునే ముచ్చటైన పండుగ. కొత్త అల్లుళ్ల అలకలతో, మరదళ్ల చిలిపి సరసాలతో సంబరంగా జరుపుకునే పండుగ. కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ. శతమానం భవతి చిత్రం కోసం ధనుర్మాసం, పండుగ సంబరాలు ప్రతిబింబించేలా పాట రాయమన్నారు దర్శకులు.
ఈ పాటను అమలాపురంలో ఒక సినిమా షూటింగ్ సమయంలో రాశాను. హరిదాసులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, భోగిపండ్లు, బొమ్మల కొలువు, ముగ్గులు, పిండివంటలు... ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వీటన్నిటినీ మర్చిపోతున్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగను పూర్తిగా మరచిపోయే స్థితికి చేరుకున్నారు ప్రజలు. వీటిని ఒకసారి అందరికీ గుర్తుచేసేలా పాట రాయమన్నారు దర్శకులు.
కొత్త అల్లుళ్లు బెట్టు చేయడం, అల్లుళ్ల గొంతెమ్మ కోర్కెలు, సరదాలు తీర్చడం, ఇంటింటా పండుగ హడావుడి ఎలా ఉంటుందో చూపేలా ఈ పాట రాశాను. సంక్రాంతికి బంధువులంతా కలిసి పంచుకునే ఆనందాలు, అలకలు, పట్టింపులు... ఎంతో బావుంటాయి. ఇవి చాలా అవసరం కూడా. సంతోషం, ఆనందం... ఇవే మనసుల్ని నింపే మాన్యాలు, సిరిసంపదలూనూ. ఇది మూడు రోజుల సెలవుల పండుగ కాదు. సంవత్సరం మొత్తం బంధువులందరూ కలిసే తియ్యని పండుగ జరుపుకోవాలని ఈ పాటలో రాశాను.
గొబ్బియల్లో గొబ్బియల్లో కొండానయ్యకు గొబ్బిళ్లు... ఆదిలక్ష్మీ అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్లు అంటూ పల్లవి ప్రారంభించాను. సంక్రాంతి అంటే గొబ్బిళ్లు. ధనుర్మాసం మొదలైన రోజు నుంచి సంక్రాంతి వరకు నెల రోజుల పాటు ముగ్గులు, గొబ్బిళ్లతో వీధివీధంతా ఆకాశంలోని తారలు చేయిచేయి కలిపి కిందకు వచ్చినట్లుగా కనిపిస్తుంది.
హరిదాసులు వచ్చారే దోసిట రాశులు తేరే కొప్పున నింపేయ్‌రే డూడూ బసవడు చూడే వాకిట నిలుచున్నాడే అల్లరి చేస్తున్నాడే డూడూ బసవడుగా ఇంటి వాకిళ్ల ముందు నిలబడి, అయ్యవారికి దండం పెడుతూ, పిల్లలను ఆనందింపచేస్తాడు గంగిరెద్దులను ఆడించే ఆటగాడు. ‘శ్రీమద్రమా రమణ గోవిందో హరి’ అంటూ తల మీద రాగి పాత్రతో ఇంటింటినీ హరినామస్మరణతో మార్మోగేలా చేస్తూ, తన జీవనానికి కావలసిన ధాన్యాలను సేకరిస్తాడు హరిదాసు.
కొత్తల్లుళ్ల అజమాయిషీలే బావమరదళ్ల చిలిపి వేషాలే... కోడి పందాల పరవళ్లే తోడు పేకాటరాయుళ్లే పండుగకు అందం కొత్తగా పెళ్లికూతుళ్లయిన ఆడపిల్లలు కొత్త అల్లుళ్లతో ఇంట్లో అడుగు పెట్టడం, అల్లుళ్ల సరదా అలకలు, మరదళ్ల సరదా చిలిపివేషాలు, సరదాల కోడి పందాలు, సరదాగా పేకాట ఆడటం... ఇవన్నీ పండుగకు కొత్త అలంకారాలు.
మెరిసే మురిసే సంక్రాంతే
మూణ్ణాళ్ల సంబరమే ఉత్సవమే
ఏడాది పాటంత జ్ఞాపకమే
క్షణం తీరిక క్షణం అలసట
మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి పండుగ సంవత్సరం పాటు ఆనందజ్ఞాపకాలను మిగిల్చేలా ఉత్సాహంగా జరుపుకోవాలి. దానధర్మాలు చేస్తూ సంపదలను అందరితో పంచుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎన్నో శుభాలకు నాంది పలుకుతుంది ఈ పండుగ.
– డా. వైజయంతి
Comments
Please login to add a commentAdd a comment