Mickey J Meyer
-
'కొణిదెల లావణ్య త్రిపాఠి'గా మొదటి సినిమా ప్రకటన
మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాను ప్రకటించారు. గతేడాదిలో వరుణ్ తేజ్‌తో కలిసి వివాహ బంధంలో అడుగుపెట్టిన ఆమె సుమారు ఏడాదిపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. లావణ్య సినిమాలకు గుడ్‌బై చెప్పేసిందంటూ కూడా నెట్టింట ప్రచారం జరిగింది. కానీ, నేడు తన పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే, ఈ సినిమాతో కొణిదెల లావణ్య త్రిపాఠి అని తొలిసారి టైటిల్ కార్డ్ ఉపయోగించడం విశేషం.'సతీ లీలావతి' అనే టైటిల్‌తో ఒక చిత్రాన్ని చేస్తున్నట్లు లావణ్య త్రిపాఠి ప్రకటించారు. నేడు ఆమె బర్త్‌డే సందర్భంగా ఒక వీడియోను సోషల్‌మీడియాలో పంచుకుంది. భీమిలీ కబడ్డీ జట్టు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తాతినేని సత్యనే ఈ కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాలపై నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇప్పుడు తన వివాహం అయిన తర్వాత గ్లామర్ రోల్స్‌కు ఫుల్స్టాప్ పెట్టేసి నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రల వైపే మొగ్గుచూపుతుంది. ఈ క్రమంలోనే సతీ లీలావతి చిత్రంలో డిఫరెంట్ రోల్లో కనిపించనుంది. త్వరలో ఈ చిత్రం షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్న ఇతర నటీనటులు ఎవరనేది ఇంకా రివీల్ చేయలేదు. -
మాస్... క్లాస్ అని ఆలోచించను: సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్
‘‘ఏ సినిమాలో అయినా కథని బట్టే పాటలు ఉంటాయి. ప్రత్యేకించి మాస్, క్లాస్ అని నేను ఆలోచించను. ‘మిస్టర్ బచ్చన్’లో మాస్ సాంగ్స్ చేసే చాన్స్ దక్కింది. ఈ పాటలివ్వడం నాకేం షాకింగ్‌గా లేదు. ఎందుకంటే నేను మాస్ సాంగ్స్ చేయగలనని నాకు తెలుసు. ‘మిస్టర్ బచ్చన్’ సంగీతానికి మంచి స్పందన రావడం చాలా హ్యాపీగా ఉంది’’ అని సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్ అన్నారు. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ‘మిస్టర్ బచ్చన్’ ఈ నెల 15న విడుదలైంది.ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్ మాట్లాడుతూ– ‘‘నా భార్య, పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటాను. డైరెక్టర్స్ కథని ఫోన్లో లేదా జూమ్ కాల్స్‌లో వినిపిస్తారు. కథ విని ట్యూన్స్ ఇస్తాను. అయితే నేపథ్య సంగీతం మాత్రం ఇండియాకి వచ్చి చేస్తాను. నేనెప్పుడూ డైరెక్టర్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్‌లో కూర్చోలేదు. కానీ, ‘మిస్టర్ బచ్చన్’ కోసం హరీష్‌గారు సియాటిల్ వచ్చారు. కేవలం నాలుగు రోజుల్లో ఈ సినిమా ట్యూన్స్ పూర్తి చేశాం. నేను అమెరికాలో కాకుండా ఇండియాలో ఉంటే మరిన్ని సినిమాలు చేసే చాన్స్ ఉండేది. కానీ, ఫ్యామిలీకి కూడాప్రాధాన్యత ఇస్తాను.. అందుకే అమెరికాలో ఉంటున్నాను. ప్రస్తుతం మూడుప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి’’ అన్నారు. -
'ఆడియన్స్‌ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది': మిక్కీ జే మేయర్
‘‘నా మ్యూజిక్ కంపోజర్స్ టీమ్ అందరూ అమెరికా, లండన్‌లో ఉంటారు. సో.. నేను అమెరికాలో ఉన్నప్పటికీ నిర్మాతలు ఇబ్బందిపడటంలేదు. ఓ సినిమా హిట్ అయితే హీరో, డైరెక్టర్స్‌తో పాటు సంగీత దర్శకుడికి మంచి పేరు వస్తుంది. అందుకే స్క్రిప్ట్ ముఖ్యమని నమ్ముతాను. ఇక ఇటు శేఖర్ కమ్ములగారి నుంచి హరీష్ శంకర్, అటు నాగ్ అశ్విన్ నుంచి నందినీ రెడ్డిగార్ల సినిమాలు.. ఇలా డిఫరెంట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన అతి కొద్దిమంది మ్యూజిక్ డైరెక్టర్స్‌లో నేనూ ఒకణ్ణి’’ అన్నారు సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్రవిందా మూవీస్, స్వప్నా సినిమాస్ పతాకాలపై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర సంగీతదర్శకుడు మిక్కీ జే మేయర్ మాట్లాడుతూ– ‘‘మహానటి’ తర్వాత వైజయంతీ మూవీస్‌లో నేను చేసిన సినిమా ‘అన్నీ మంచి శకునములే’. ఇందులో ఆరు పాటలు ఉన్నాయి. నందినీ రెడ్డిగారు కథ చెప్పినప్పుడు ఎగ్జైట్ అయ్యాను. అలాగే కథలో ఆమె క్రియేట్ చేసిన విక్టోరియాపురం ఆడియన్స్‌ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న రెండు సినిమాలకు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలగారితో ఓ ప్రాజెక్ట్, ‘చాంపియన్’ అనే మరో ప్రాజెక్ట్, ‘సెల్ఫిష్’, అమెరికాలో ఉన్న మరో దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
'శ్యామ్ సింగ రాయ్' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్
Shyam Singha Roy Movie Tara Song Lyrical Video Released: నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నటించిన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. సాయిలపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించారు. మడోన్నా సెబాస్టియన్ మరో హీరోయిన్గా నటించింది. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టిన మూవీ టీం.. తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్‌ని రిలీజ చేసింది. "తెరపైన కదిలేలా కథలేవో మొదలే .. తార నింగిదిగి నేల .. కింద నడిచేలా .. వచ్చేనిలా " అంటూ ఈ పాట సాగుతుంది. నాని, కృతిశెట్టిలపై ఈ పాటను చిత్రీకరించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
సిరివెన్నెలతో పనిచేయడం నా అదృష్టం
నేచులర్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. డిసెంబర్ 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ ఇంటర్వ్యూ... ► శ్యామ్ సింగరాయ్ కథ రెండు టైమ్ పీరియడ్స్‌కు సంబంధించింది. గతం, వర్తమానం అంటూ రెండు భాగాల్లో ఈ కథ జరుగుతుంది. గతంలో 70వ దశకంలోని వాతావరణాన్ని ఇందులో చూపించనున్నారు. దానికి తగ్గట్టే సంగీతం, నేపథ్య సంగీతం అందించాను. నాకు ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ మీద మంచి నాలెడ్జ్ ఉంది. కాబట్టి ఆ కాలంలో ఉపయోగించిన వాయిద్యాలనే ఇందులో ఎక్కువగా ఉపయోగించాం. తబల, సితార్, సంతూర్ వంటి వాటిని వాడి సంగీతాన్ని అందించాను. ► శ్యామ్ సింగరాయ్ సినిమాలో నార్త్, సౌత్ ఫ్లేవర్ కలిసి ఒక కొత్త ఫ్లేవర్ ఉంటుంది. కలకత్తా బ్యాక్‌డ్రాప్ కాబట్టి బెంగాల్ సంగీతాన్ని కూడా ఇందులో జోడించాం. కథకు తగ్గట్టుగానే మ్యూజిక్ చేశాను. టాలీవుడ్లో ఇలాంటి నేపథ్యంలో రాబోతోన్న మొదటి సినిమా ఇదే అవుతుంది. ► దర్శకుడు రాహుల్ ఈ కథ చెప్పగానే చాలా ఎగ్జయిట్ ఫీలయ్యా...ఎందుకంటే ఈ సినిమాకు మంచి సంగీతం అందించే స్కోప్ ఉంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా చెయ్యొచ్చు అనిపించింది. ఇప్పటి వరకూ విడుదలైన అన్ని పాటలకి మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా రిలీజయ్యాక పాటలకు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు మరింత మంచి స్పందన వస్తుందని నమ్ముతున్నాను. ► సిరివెన్నెలగారి లాంటి లెజెండ్‌తో పనిచేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో గడిపిన ప్రతి మూమెంట్ ఒక మెమోరబుల్. శ్యామ్ సింగ రాయ్ సినిమా కోసం ఆయన రెండు పాటలు రాశారు. అందులో సిరివెన్నెల పాట ఆల్రెడీ విడుదలై మంచి స్పందన రాబట్టుకుంది. ఆయన రాసిన ఇంకో పాట త్వరలో విడుదల కాబోతుంది. ఆ పాటలో సిరివెన్నెలగారి సాహిత్యం అద్బుతంగా ఉంటుంది. ఆ పాటను కంపోజ్ చేయడం ఛాలెంజింగ్ గా అనిపించింది. ► పాట ఏ సింగర్ తో పాడించాలి అనే విషయంలో హీరో, దర్శకుల నుంచి నేను సలహాలు తీసుకుంటాను. కానీ తుది నిర్ణయం మాత్రం నాదే. ఎందుకంటే ఆ పాట ట్యూన్ చేసేటప్పుడే అది ఎవరు పాడితే బాగుంటుంది అనేది నిర్ణయించుకుంటాను. ఈ సినిమా మ్యూజిక్, ఆర్ఆర్ ప్రేక్షకుల్ని ఎక్కడా డీవియేట్ కానివ్వదు. ► ప్రస్తుతం నేను నందినీ రెడ్డి స్వప్నా దత్ కాంబినేషన్లో ఓ సినిమాకు సంగీతం అందిస్తున్నాను, అలాగే శ్రీవాస్ గోపీచంద్ కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్ ఉంది, దిల్ రాజుగారి బ్యానర్లో మరో సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాను. వీటితో పాటు ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తున్నాను అని మిక్కీ జే మేయర్ చెప్పుకొచ్చాడు. -
Rise Of Shyam: రైజ్ ఆఫ్ శ్యామ్ ఫుల్ లిరికల్ సాంగ్ వచ్చేసింది
నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట బోయనపల్లి నిర్మించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఇందులో సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు. 1970ల కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. డిసెంబర్ 24న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. రిలీజ్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే విడుదలైన ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ సాంగ్ ప్రోమో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా శనివారం ఉదయం ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ఫుల్ లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు.‘శ్యామ్ సింగ రాయ్.. ఎగసిపడే అలజడివాడే.. తిరగబడే సంగ్రామం వాడే.. వెనకబడని చైతన్యం వాడే’’ అంటూ ఈ సినిమాలో నాని పాత్ర స్వభావాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. మిక్కీ జే మేయర్ స్వారాలు అందించిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా.. విశాల్ దద్లాని, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. -
‘ఒళ్లంత వెటకారం.. పుట్టింది సూర్యకాంతం’
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేడీ ఓరియంటెండ్ సినిమా ఓ బేబీ. కొరియన్ సినిమా మిస్ గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. మిక్కీ జే మేయర్ సంగీతమందించిన ఈ పాటకు లక్ష్మీ భూపాల్ సాహిత్యం అందించారు. పార్టీ సాంగ్లా రూపొందించిన ఈ పాటలో. సినిమాలో సమంత క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో కూడా క్లారిటీ ఇచ్చేశారు. సీనియర్ లక్ష్మీ మరో ప్రదాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్య, రావూ రమేష్, రాజేంద్ర ప్రసాద్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్, క్సాస్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. -
మహానటి పెద్ద సవాల్
‘‘నేనెప్పుడూ ప్రయోగాలు చేయడానికే ఇష్టపడతాను. నా ప్రతి సినిమాలో చేశాను కూడా. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల వెనక పరిగెత్తకుండా నాకు నచ్చిన సినిమాలే చేస్తుంటాను’’ అన్నారు సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్. అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మహానటి’. కీర్తీ సురేశ్, సమంత, నాగచైతన్య, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ముఖ్య తారలుగా నటించారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటించారు. మిక్కీ జె. మేయర్ స్వరాలు అందించారు. వైజయంతి మూవీస్, స్వప్నా సినిమాస్ పతాకంపై ప్రియాంకాదత్ నిర్మించిన ఈ సినిమా మే 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మిక్కీ జె.మేయర్ మాట్లాడుతూ– ‘‘నటిగా సావిత్రిగారు ఏంటి? అనేది అందరికీ తెలుసు. కానీ ఆమె జీవిత విశేషాలు పూర్తిగా ఎవరికీ తెలియవు. ఆ విషయాలు ‘మహానటి’ చిత్రంతో తెలుస్తాయి. ఈ సినిమాకు సంగీత దర్శకునిగా పని చేయడం పెద్ద చాలెంజ్లా అనిపించింది. పాటల కోసం ఏడాదిన్నర కష్టపడ్డాను. సావిత్రిగారి పాత సినిమాలు చూశాను. ఆ సినిమాల్లో సంగీత శైలి, ఆమె నటన ఎలా ఉన్నాయో పరిశీలించాను. సీతారామశాస్త్రిగారు లిరిక్స్ రాశారు. ఆయన నాకు హెల్ప్ చేశారు. ‘మహానటి’ నా కెరీర్లో మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ సినిమాకు పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నాగ్ అశ్విన్ విజన్ సూపర్. ‘హ్యాపీడేస్’ లాంటి సినిమాలు కెరీర్లో ఒక్కసారే వస్తాయి. ప్రతి సినిమా ‘హ్యాపీడేస్’ అవ్వదు’’ అన్నారు. -
ఆనంద సంతోషాలే మనసులను నింపే సిరిసంపదలు...
చిత్రం: శతమానం భవతి రచన: శ్రీమణి సంగీతం: మిక్కీ జె మేయర్ గానం: మోహన, దివ్య దివాకర్, ఆదిత్య అయ్యంగార్, రోహిత్ పరిటాల మూడు రోజుల పాటు జరుపుకునే ముచ్చటైన పండుగ. కొత్త అల్లుళ్ల అలకలతో, మరదళ్ల చిలిపి సరసాలతో సంబరంగా జరుపుకునే పండుగ. కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ. శతమానం భవతి చిత్రం కోసం ధనుర్మాసం, పండుగ సంబరాలు ప్రతిబింబించేలా పాట రాయమన్నారు దర్శకులు. ఈ పాటను అమలాపురంలో ఒక సినిమా షూటింగ్ సమయంలో రాశాను. హరిదాసులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, భోగిపండ్లు, బొమ్మల కొలువు, ముగ్గులు, పిండివంటలు... ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వీటన్నిటినీ మర్చిపోతున్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగను పూర్తిగా మరచిపోయే స్థితికి చేరుకున్నారు ప్రజలు. వీటిని ఒకసారి అందరికీ గుర్తుచేసేలా పాట రాయమన్నారు దర్శకులు. కొత్త అల్లుళ్లు బెట్టు చేయడం, అల్లుళ్ల గొంతెమ్మ కోర్కెలు, సరదాలు తీర్చడం, ఇంటింటా పండుగ హడావుడి ఎలా ఉంటుందో చూపేలా ఈ పాట రాశాను. సంక్రాంతికి బంధువులంతా కలిసి పంచుకునే ఆనందాలు, అలకలు, పట్టింపులు... ఎంతో బావుంటాయి. ఇవి చాలా అవసరం కూడా. సంతోషం, ఆనందం... ఇవే మనసుల్ని నింపే మాన్యాలు, సిరిసంపదలూనూ. ఇది మూడు రోజుల సెలవుల పండుగ కాదు. సంవత్సరం మొత్తం బంధువులందరూ కలిసే తియ్యని పండుగ జరుపుకోవాలని ఈ పాటలో రాశాను. గొబ్బియల్లో గొబ్బియల్లో కొండానయ్యకు గొబ్బిళ్లు... ఆదిలక్ష్మీ అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్లు అంటూ పల్లవి ప్రారంభించాను. సంక్రాంతి అంటే గొబ్బిళ్లు. ధనుర్మాసం మొదలైన రోజు నుంచి సంక్రాంతి వరకు నెల రోజుల పాటు ముగ్గులు, గొబ్బిళ్లతో వీధివీధంతా ఆకాశంలోని తారలు చేయిచేయి కలిపి కిందకు వచ్చినట్లుగా కనిపిస్తుంది. హరిదాసులు వచ్చారే దోసిట రాశులు తేరే కొప్పున నింపేయ్రే డూడూ బసవడు చూడే వాకిట నిలుచున్నాడే అల్లరి చేస్తున్నాడే డూడూ బసవడుగా ఇంటి వాకిళ్ల ముందు నిలబడి, అయ్యవారికి దండం పెడుతూ, పిల్లలను ఆనందింపచేస్తాడు గంగిరెద్దులను ఆడించే ఆటగాడు. ‘శ్రీమద్రమా రమణ గోవిందో హరి’ అంటూ తల మీద రాగి పాత్రతో ఇంటింటినీ హరినామస్మరణతో మార్మోగేలా చేస్తూ, తన జీవనానికి కావలసిన ధాన్యాలను సేకరిస్తాడు హరిదాసు. కొత్తల్లుళ్ల అజమాయిషీలే బావమరదళ్ల చిలిపి వేషాలే... కోడి పందాల పరవళ్లే తోడు పేకాటరాయుళ్లే పండుగకు అందం కొత్తగా పెళ్లికూతుళ్లయిన ఆడపిల్లలు కొత్త అల్లుళ్లతో ఇంట్లో అడుగు పెట్టడం, అల్లుళ్ల సరదా అలకలు, మరదళ్ల సరదా చిలిపివేషాలు, సరదాల కోడి పందాలు, సరదాగా పేకాట ఆడటం... ఇవన్నీ పండుగకు కొత్త అలంకారాలు. మెరిసే మురిసే సంక్రాంతే మూణ్ణాళ్ల సంబరమే ఉత్సవమే ఏడాది పాటంత జ్ఞాపకమే క్షణం తీరిక క్షణం అలసట మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి పండుగ సంవత్సరం పాటు ఆనందజ్ఞాపకాలను మిగిల్చేలా ఉత్సాహంగా జరుపుకోవాలి. దానధర్మాలు చేస్తూ సంపదలను అందరితో పంచుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎన్నో శుభాలకు నాంది పలుకుతుంది ఈ పండుగ. – డా. వైజయంతి -
గొప్ప సినిమా తీయడానికి ప్రయత్నించాం
- సందీప్ కిషన్ ‘‘ ‘ప్రస్థానం’తో సందీప్ కిషన్ కెరీర్‌ను డిఫరెంట్‌గా స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కూడా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. తాజా చిత్రంపై ఎన్నో అంచనాలున్నాయి. క్లిష్టమైన పాయింట్‌తో సరికొత్త రీతిలో తెరకెక్కించిన సినిమా ఇది. తప్పకుండా ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని దర్శకుడు గుణశేఖర్ అన్నారు. సందీప్ కిషన్, నిత్యామీనన్ జంటగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్ పతాకంపై రాజసింహ తాడినాడ దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి నిర్మించిన చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. మిక్కీ జె మేయర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో సీడీని హీరో సాయిధరమ్‌తేజ్ ఆవిష్కరించి, దర్శకుడు బోయపాటి శ్రీనుకు అందజేశారు. ఈ సందర్భంగా సందీప్‌కిషన్ మాట్లాడుతూ- ‘‘ఒక మంచి సినిమా లేదా ఓ హిట్ సినిమా తీయడానికి చేసిన ప్రయత్నం కాదు. ఓ గొప్ప సినిమా చేయడానికి చేసిన ప్రయత్నమిది’’ అన్నారు. వినాయక్ మాట్లాడుతూ- ‘‘రాజసింహ ఏడేళ్ల క్రితమే ఈ కథ చెప్పాడు. ఈ కథ ఎవరికైనా ఇవ్వాలని ప్రయత్నించాడు. తనే ఈ కథతో దర్శకునిగా మారడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘ఎక్కడా బోర్ కొట్టకుండా ఈ చిత్రాన్ని తీయడంలో రాజసింహ సక్సెస్ అయ్యారు. గ్రిప్పింగ్‌గా కథ రాసుకున్నారు’’ అని నిత్యామీనన్ చెప్పారు. దర్శకుడు మేర్లపాక గాంధీ, రాశీఖన్నా, రెజీనా పాల్గొన్నారు. -
మిక్కీ కోసం తమన్...
సందీప్‌కిషన్, నిత్యామీనన్ జంటగా రాజసింహ తాడినాడ దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. దీని కోసం సంగీత దర్శకుడు తమన్ ఓ పాట పాడారు. ఇందులో విశేషం ఏముంది అనుకోవచ్చు? ఈ చిత్రానికి స్వరకర్త మిక్కీ జె. మేయర్. ఒకరి స్వర సార థ్యంలో మరో సంగీత దర్శకుడు పాడడం అరుదు. కొన్నేళ్ల క్రితం ‘బృందావనం’ చిత్రం కోసం తమన్ ‘వచ్చాడురా...’ పాటను కోటి, కీరవాణిలతో పాడించారు. అయితే ఈ సారి తమన్ తన ఫ్రెండ్ మిక్కీ జె. మేయర్ కోసం పాట పాడారు. ‘‘హీరో పరిచయగీతం తమన్ పాడితే బాగుంటుందని అనుకుని అడిగాను. వెంటనే ఓకే అని పాడిన తమన్‌కు థ్యాంక్స్’’ అని మిక్కీ చెప్పారు. -
వినసొంపుగానే కాదు... కనువిందుగా కూడా...!
‘‘ఈ చిత్రం పాటలు నాకు ప్రత్యేకం. ఎందుకంటే దాదాపు ఎనభై శాతం సినిమా పాటలతోనే సాగుతుంది. పాటలన్నీ బాగున్నాయి. ఆ ఘనత సంగీతదర్శకుడు మిక్కీ జె.మేయర్‌కి దక్కుతుంది. వినసొంపుగా ఉన్న ఈ పాటలు కనువిందు చేస్తాయి’’ అని హీరో సుమంత్ అశ్విన్ అన్నారు. ఇలవల ఫిలింస్ సమర్పణలో రచయిత వేమారెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ, సీహెచ్. నరసింహాచారి, నరసింహారెడ్డి ఇలవల నిర్మించిన చిత్రం ‘చక్కిలిగింత’. సుమంత్ అశ్విన్, రెహానా జంటగా నటించిన ఈ చిత్రం పాటలు ఇటీవల విడుదలయ్యాయి. ఈ పాటలకు మంచి స్పందన రావడం ఆనందంగా ఉందని పాత్రికేయుల సమావేశంలో వేమారెడ్డి చెబుతూ - ‘‘ఈ చిత్రానికి పాటలు స్వరపరచాలని మిక్కీని కోరిప్పుడు కథ నచ్చితేనే అన్నారు. కథ విన్న తర్వాత ఒప్పుకున్నారు. మంచి పాటలిచ్చారు’’ అని చెప్పారు. వేమారెడ్డితో సినిమా చేయడం ఆనందంగా ఉందనీ, సుమంత్, రెహానా కెమిస్ట్రీ అందరికీ నచ్చుతుందని మిక్కీ తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రానికి కాగితం, కలమే నిజమైన నిర్మాతలు. ఆ రెండూ ఎవరో కాదు.. మా వేమారెడ్డి. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’’ అన్నారు. -
సుమంత్ అశ్విన్‌కి మంచి భవిష్యత్తు ఉంది : ప్రభాస్
‘‘నాకు ‘వర్షం’ వంటి విజయవంతమైన చిత్రం ఇచ్చారు ఎమ్మెస్ రాజుగారు. ఆ సినిమా అప్పుడు సుమంత్ అశ్విన్ చిన్నవాడు. ఇప్పుడు హీరో అయ్యాడు. తనకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలి’’ అని ప్రభాస్ చెప్పారు. ఇలవల ఫిలింస్ సమర్పణలో రచయిత వేమారెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ, సీహెచ్. నరసింహాచారి, నరసింహారెడ్డి ఇలవల నిర్మిస్తున్న చిత్రం ‘చక్కిలిగింత’. సుమంత్ అశ్విన్, రెహానా నాయకా నాయికలు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ పాటలు స్వరపరిచారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకలో అతిథిగా పాల్గొన్న ప్రభాస్ సీడీని ఆవిష్కరించి దర్శకుడు సుకుమార్‌కి ఇచ్చారు. ప్రచార చిత్రాన్ని ‘దిల్’ రాజు, సంస్థ లోగోను సుకుమార్, సురేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ - ‘‘ప్రభాస్ నా ఫేవరెట్ హీరో. ‘వర్షం’ సినిమాలో ప్రభాస్ జీప్ ఎత్తే సన్నివేశం, ఇంట్రడక్షన్ సీన్ తీసినప్పుడు లొకేషన్లోనే ఉన్నాను. హీరో అంటే ఇలా ఉండాలనుకున్నాను. ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నాది చాలా మంచి పాత్ర’’ అన్నారు. మంచి కథ కావడంతో చక్కని స్వరాలివ్వగలిగానని మిక్కీ చెప్పారు. దర్శకునిగా తనకిది తొలి చిత్రమనీ, అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలని వేమారెడ్డి అన్నారు. ఈ చిత్రంలో నటించడంపట్ల రెహానా ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకలో ఎమ్మెస్ రాజు, బీవీయస్‌యన్ ప్రసాద్, మారుతి తదితరులు పాల్గొన్నారు.