తాతా మనవళ్ల కథలో...
శర్వానంద్... హీరోగా ఎప్పటికప్పుడు వైవిధ్యం కోసం పరితపించే నటుడీయన. మళ్లీ మళ్లీ ఇటువంటి మంచి కథ, పాత్ర వస్తుందో? రాదో? అని 30ఏళ్ల వయసులోనే ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’లో తండ్రి పాత్రలో పరిణితితో కూడిన నటన ప్రదర్శించేశారు. వెంటనే ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ అంటూ తనలో వేగం చూపించారు. ఎలాంటి పాత్రలోనైనా సూట్ వేసుకున్నంత ఈజీగా సూటయ్యే ఈ నటుడు ప్రస్తుతం బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాణంలో పోలీస్‌గా ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు.
ఆ తర్వాత సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ఓ కుటుంబ కథా చిత్రం చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ కథానాయిక. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ - ‘‘తాతా మనవళ్ల మధ్య అనుబంధాలు, ఆప్యాయతలను ఆవిష్కరించే చిత్రమిది.
తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని అందంగా ఆవిష్కరించిన ‘బొమ్మరిల్లు’ మా సంస్థకు ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో.. ఈ ‘శతమానం భవతి’ అంతటి పేరు తీసుకొస్తుందని నమ్మకముంది’’ అన్నారు. ‘బొమ్మరిల్లు’ (ఆగస్టు 9, 2006) విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం ‘శతమానం భవతి’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రకాశ్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: మధు, కెమేరా: సమీర్ రెడ్డి, మ్యూజిక్: మిక్కీ జె.మేయర్.