ఫ్యాన్స్‌కు షాకిచ్చిన ఆస్కార్ నటుడు!
లాస్ ఏంజెలిస్: హాలీవుడ్ దిగ్గజ నటుడు డానియల్ డే లెవిస్ తన అభిమానులకు షాకిచ్చారు. మూవీలు చేయడం ఆపేయనున్నట్లు మూడుసార్లు ప్రసిద్ద ఆస్కార్ అవార్డు పొందిన నటుడు డానియల్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని నటుడి వ్యక్తిగత కార్యదర్శి లెస్లీ డార్ట్ మంగళవారం ప్రకటించారు. ప్రఖ్యాత దర్శకుడు స్టీవ్ స్పిల్ బర్గ్ తీసిన 'లింకన్', 'దేర్ విల్ బి బ్లడ్', 'మై లెఫ్ట్ ఫూట్', 'గ్యాంగ్స్ ఆఫ్ ది న్యూయార్క్' మూవీలతో ఆయన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
అరవై ఏళ్ల సీనియర్ నటుడి చివరి మూవీ ఈ డిసెంబర్ 25న విడుదల కానుంది. అయితే ఆ మూవీకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. షూటింగ్ మాత్రం కొనసాగుతోంది. 14 ఏళ్ల వయసులో 1971లో విడుదలైన 'సండే, బ్లడీ సండే'తో ఇండస్ట్రీకి పరిచయమైన డానియల్ అంచెలంచెలుగా ఎదిగారు. మూడుసార్లు అస్కార్ అవార్డులను కొల్లగొట్టిన ఘనత ఆయన సొంతం. దర్శకరచయిత రెబెక్కా మిల్లర్ ను వివాహం చేసుకున్న డానియల్ కు ముగ్గురు సంతానమన్న విషయం తెలిసిందే.
'ఇన్నేళ్లుగా నన్ను అభిమానించి, నాపై ప్రేమ చూపించిన ప్రేక్షకులు మూవీ బృందాలకు ధన్యవాదాలు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఇక రంగుల ప్రపంచానికి సెలవు పలకాలని నిర్ణయించుకున్నానని' ఆస్కార్ గ్రహీత డానియల్ డే లెవిస్ అన్నారు.