
ముంబై: కేరళలో టపాసులతో నింపిన పైనాపిల్‌ను తిని ఓ గర్భిణి ఏనుగు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన వ్యక్తులపై బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏనుగు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఆమె డిమాండ్ చేశారు. గర్భిణి ఏనుగును క్రూరంగా చంపిన సదరు వ్యక్తులపై జీవ హింస చట్టం కింద కేసు పెట్టి శిక్షపడేలా చేయాలని సోషల్ మీడియా వేదికగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఘటపై భావోద్వేగానికి గురైన శ్రద్ధా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు షేర్ చేశారు. ‘గర్భిణి ఏనుగుకు కేరళలో కొంతమంది వ్యక్తులు టపాసులతో నింపిన పైనాపిల్ తినిపించారు. అది తినడంతో పైనాపిల్ నోటిలో పేలి దవడ భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. ఆ బాధతో గ్రామమంతా తిరిగి చివరకు ఓ సరస్సులో నిలబడే ప్రాణాలు విడిచింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
‘రాక్షసులు అంటే తల మీద కొమ్ములతో ఇరువైపుల రెండు పెద్ద పెద్ద దవడ పళ్లతో మాత్రమే ఉండరు. మన చూట్టూ మనుషుల రూపంలోనే ఉంటారు. వారు మీ పక్కనే నడుస్తారు. చాలా వరకు జంతువులు మనుషులను విశ్వసిస్తాయి. ఎందుకంటే గతంలో అవి మనుషులకు సాయం చేసేవి. వీరి క్రూరత్వం భరించలేని స్థాయిలో ఉంది. వారు మనుషులుగా బ్రతికే అర్హతను కోల్పోయారు. దయ, జాలి లేనప్పుడు మీరు మనుషులుగా పరిగణించరు. ఒకరిని బాధించేవారు మనుషులు కాదు. అందుచేత జీవ హింస చట్టం కింద వీరిపై పిటిషన్ దాఖలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. దోషులను దారుణంగా శిక్షించే వరకు ఈ దుష్ట రాక్షసులు భయపడరు. అయితే వీరిని పట్టుకోవడం కష్టతరమే. కానీ వారిని వీలైనంత త్వరగా పట్టుకుని శిక్షిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.