ఆ గొంతు నిండా అమృతమే!
'నిను చూడనీ.. కనులెందుకు' అంటూ మెలోడియస్గా పాడినా, 'సై అంది నానో సయ్యందిరా' అంటూ మత్తు ఒలికించినా, 'హే నాయక్.. తూహై సుఖ్దాయక్' అంటూ హుషారెత్తించేలా పాడినా అవన్నీ అచ్చతెలుగు అమ్మాయి పాడినట్లే ఉంటాయి. కానీ, వీటితో పాటు ఎప్పుడో 2002 నుంచే తెలుగు పాటలు కూడా పాడిన ఉత్తరాది గాయని.. శ్రేయా ఘోషల్. మార్చి 12 బుధవారం ఆమె 30వ పుట్టిన రోజు. అచ్చంగా అమృతాన్ని గొంతులో పోసుకుందా అన్నట్లుగా పాడే ఆమె పాటలను ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు. తాజాగా ఆషికీ 2 చిత్రంలో ఆమె పాడిన 'అప్నే కరమ్ కీ కర్ అదాయే' పాట అద్భుతమైన హిట్ అయింది.
శ్రేయా ఘోషల్ తన పుట్టిన రోజు సందర్భంగా సినిమాలతో సంబంధం లేని 'హమ్నషీ' అనే గజల్ ఆల్బం విడుదల చేసింది. సినిమాలకు సంబంధం లేకుండా కూడా చేయగలిగినందుకు సంతోషంగా ఉందని చెప్పింది. తాను ఎప్పటినుంచో గజల్స్ అభిమానినని, అయితే అలా చేయగలనని మాత్రం ఎప్పుడూ అనుకోలేదని శ్రేయా తెలిపింది. ఇకమీదట మరికొన్ని ఆధ్యాత్మిక ఆల్బంలు కూడా చేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది. ఉర్దూ కవిత్వం సుమధురంగా ఉంటుందని, సినిమాల్లో ఆ అనుభవం పొరపాటున కూడా రాదని చెప్పింది. వాస్తవానికి శ్రేయాఘోషల్ బెంగాలీ అయినా.. ఆమె ఎక్కువగా హిందీ, ఉర్దూ పాటలే పాడింది. తాను బెంగాలీ అయినా, రాజస్థాన్లో పెరగడం వల్ల హిందీ బాగా వచ్చిందని చెప్పింది.