
యుద్ధం కోసం సిద్ధం!
భారతదేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రూపొందుతున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న నూరవ చిత్రం కావడంతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శాతకర్ణి భార్య పాత్రకు నయనతార, శ్రీయ పేర్లను పరిశీలిస్తున్నారట. బిబో శ్రీనివాస్ సమర్పణలో క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఇటీవల మొరాకోలో పూర్తయింది. మలి షెడ్యూల్‌ను ఈ నెల 30న హైదరాబాద్‌లో మొదలుపెట్టనున్నారు.
ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ- ‘‘ ఈ నెల 30న మొదలుపెట్టి, జూన్ 7 వరకూ చిలుకూరి బాలాజీ ఆలయం సమీపంలో చిత్రీకరణ జరుపుతాం. ఎంతో ప్రెస్టీజియస్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’’ అని చెప్పారు. హైదరాబాద్‌లో జరపనున్న షెడ్యూల్ కోసం భారీ యుద్ధనౌక సెట్ వేశారు. ఇంత పెద్ద నౌక సెట్‌ను వేయడం ఇదే తొలిసారి అని నిర్మాతలు తెలిపారు. ఈ సెట్‌లో షూటింగ్ చేయడం కోసం ఫైట్‌మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో రెండు వందల మంది ఆర్టిస్టులకు కత్తి సాము శిక్షణ ఇప్పిస్తున్నామనీ, అత్యంత భారీ ఎత్తున ఈ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించనున్నామనీ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, పాటలు: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్, మాటలు: బుర్రా సాయిమాధవ్, ఆర్ట్: భూపేష్ భూపతి, సహ-నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు.