పధ్నాలుగేళ్ల తర్వాత బాలకృష్ణతో...
నందమూరి బాలకృష్ణ నూరవ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో కథానాయికగా అవకాశం దక్కించుకునేదెవరు? అనే చర్చకు బుధవారం ఫుల్‌స్టాప్ పడింది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో బాలకృష్ణ చేస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి పాత్ర సరసన శ్రీయ కథానాయికగా ఎంపికయ్యారు.
ఈ జంట ఎప్పుడో పధ్నాలుగేళ్ల క్రితమే ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రంలో అలరించారు. ఆ చిత్రంలో ‘దాయి దాయి దాయీ దాయి.. నువ్వు నాకు నచ్చావోయి..’ పాటకు బాలకృష్ణ, శ్రీయ చాలా క్యూట్‌గా డ్యాన్స్ చేశారు. రొమాంటిక్ సన్నివేశాల్లోనూ ఈ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. సో.. తాజా చిత్రంలో జంట బాగుంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
బిబో శ్రీనివాస్ సమర్పణలో వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూల్ మొరాకోలో జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో వేసిన భారీ యుద్ధ నౌక సెట్‌లో మలి షెడ్యూల్ చేయనున్నారు. ఈ నెలలోనే ఈ షెడ్యూల్ ఆరంభమవుతుంది.