అందాల ఆరబోత చాలు
అందాల ఆరబోత చాలు
Published Fri, Mar 7 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM
నేను మాత్రం ఎంతకాలమని అందాలారబోతనే నమ్ముకుంటాను? ఇప్పటి వరకు గ్లామర్ డాల్‌గా అందాలు ఒలకబోసింది చాలు. ఇకపై చాలెంజింగ్ పాత్రలే నటిస్తాను అంటున్నదెవరో తెలుసా? నాజూకు భామ శ్రీయ. ఈ బ్యూటీలో మంచి నటి ఉన్న విషయాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఎందుకనో శ్రీయను ఎక్కువగా గ్లామరస్ హీరోయిన్‌గానే చూపించడానికి దక్షిణాది దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపించారు. కచ్చితమైన కొలతలతో కూడిన ఆమె శారీరక సౌష్టం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు. తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి యువ స్టార్స్ విజయ్, ధనుష్ వరకు టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి నుంచి క్రేజీ స్టార్స్ బాలకృష్ణ, నాగార్జున వరకు జత కట్టిన ఈ ముద్దుగుమ్మ కొందరు తారలను అనుకరించే ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. ముఖ్యంగా నటి అనుష్క వేదం చిత్రంలో వేశ్యపాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు.
శ్రీయా కూడా అదే బాటలో పయనించి పవిత్ర అనే చిత్రంలో వెలయాలి పాత్ర పోషించారు. కానీ ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. అదే విధంగా కన్నడంలో చంద్ర అనే చిత్రంలో పవర్‌ఫుల్ పాత్రను పోషించారు. ఆ చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. దీంతో పునరాలోచనలో పడిన శ్రీయ ఇకపై రెగ్యులర్ పాత్రలు, ముఖ్యంగా గ్లామర్ పాత్రలు పోషించరాదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. శ్రీయ వల్ల సాధ్యం కాదని అనుకునే సవాల్‌తో కూడిన పాత్రలను పోషించి నటిగా తానేమిటో నిరూపించుకుంటానంటున్నారు.
ఇందుకోసం చిత్రానికి 50 నుంచి 60 కాల్‌షీట్స్ కేటాయించి అయినా ఆ పాత్రగా మారడానికి ప్రయత్నిస్తానన్నారు. ఇకపై అలాంటి పాత్రలతో కూడిన చిత్రాలనే అంగీకరిస్తానని చెప్పారు. షూటింగ్ పూర్తి చేసుకుని సాయంత్రం ఇంటికి వెళుతున్నప్పుడు ఈ రోజు బాగా నటించానన్న మంచి అనుభూతి తనకు కలగాలన్నారు. రాత్రులు సుఖ నిద్రకలగాలని చెప్పారు. ప్రస్తుతం తెలుగులో నాగార్జున హీరోగా నటించిన మనం చిత్రంలో ముఖ్య పాత్రను పోషించానన్నారు. హిందీలో జాకీష్రాఫ్ సరసన ఒక చిత్రంలో నటిస్తున్నట్లు శ్రీయ వెల్లడించారు.
Advertisement
Advertisement