నేనిప్పుడు పూర్తి శాకాహారిని!
మన శరీరానికి ఏ ఆహారం నప్పుతుందో తెలుసుకోవడం ఓ ఆర్ట్. కొన్నేళ్ల క్రితం వరకు శ్రుతీ హాసన్‌కి ఆ కళలో పెద్దగా నేర్పు లేదు. కానీ, ఒక న్యూట్రిషనిస్ట్ ఇచ్చిన సలహా వల్ల ఏం తినాలో? ఏం తినకూడదో శ్రుతి తెలుసుకున్నారు. ఇటీవల ఈ బ్యూటీ శాకాహారిగా మారిపోయారు. దాని గురించి చెబుతూ - ‘‘మా బాపూజీ (తండ్రి కమల్‌హాసన్ గురించి) ఇచ్చిన సలహాని అనుసరిస్తూ, శాకాహారిగా మారిపోయా. అందుకు, ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా’’ అన్నారు శ్రుతి.
ఇదిలా ఉంటే.. ఇటీవల తన ట్విట్టర్‌లో.. ‘జీవితంలో మార్పులు సహజం. ఏం జరిగినా దానికో కారణం ఉంటుంది. నో బిగ్గీ’ అని ెపెట్టారామె. నో బిగ్గీ.. అంటే పెద్ద సినిమా అవకాశాన్ని వదులుకున్నారని ఎవరికివాళ్లు ఊహిస్తారు. శ్రుతి వదులుకున్న ఆ సినిమా తమిళ హీరో విజయ్‌దని కూడా చెప్పుకుంటున్నారు. శింబుదేవన్ దర్శకత్వం వహించనున్న అత్యంత భారీ చిత్రం ఇది.
ఆ మధ్య ఈ చిత్రంలో నటించే అవకాశం వచ్చినందుకు ఆనందం కూడా వ్యక్తం చేశారు శ్రుతి. కానీ, ఇప్పుడందరూ ఈ సినిమాలో తను నటించడంలేదని ఊహించడంతో మళ్లీ ట్వీట్‌తో స్పష్టత ఇచ్చారు. ‘‘నా ట్వీట్‌ని తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఇప్పటివరకు ఏయే చిత్రాలనైతే ప్రకటించానో వాటిలో ఉన్నాను. ఏదీ మిస్ చేసుకోలేదు’’ అని శ్రుతిహాసన్ చెప్పారు.