శృతి నాతో ఉండదు
శృతి నాతో కలసి ఉండదు. అలా కలిసుండాలని కోరుకోవడం కూడా సరికాదు అంటున్నారు ఆమె తల్లి, నటి సారిక. నటుడు కమలహాసన్‌తో మనస్పర్థల కారణంగా విడిపోయి సారిక ముంబయిలో నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఇద్దరు కూతుళ్లు ముంబయిలోనే ఉంటున్నారు. పెద్ద కూతురు శృతిహాసన్ వేరుగా జీవిస్తున్నారు. చిన్న కూతురు అక్షర మాత్రం సారికతోనే ఉంటున్నారు. ఇటీవల ముంబయిలో ఒక దుండగుడు శృతి ఇంటిలో చొరబడడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. పోలీసులు అతన్ని పట్టుకుని విచారిస్తున్నారు. ఈ సంఘటన తరువాత శృతి మీతో కలసి నివసిస్తారా? అన్న ప్రశ్నకు సారిక బదులిస్తూ శృతి ఇంటిలో జరిగిన సంఘటన తనను భయబ్రాంతులకు గురి చేసిందన్నారు.
సెలబ్రిటీలకే కాదు సాధారణ ప్రజలు ఇలాంటి సంఘటనలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి దస్సంఘటనలను ఎలా ఎదుర్కోవాలో శృతికి తెలుసన్నారు. ఇకపోతే శృతి తనతో కలిసుంటుందా? అని అడుగుతున్నారని, శృతి బిజీ హీరోయిన్ అని ఆమె షూటింగ్‌ల కోసం పలు ప్రాంతాలకు వెళ్లవలసి వుంటుందని అన్నారు.ఆమెకు వృత్తి ముఖ్యం అని పేర్కొన్నారు. అదే విధంగా పిల్లలు పెరిగిన తరువాత స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నారని అలాంటి వారిని మన గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నించరాదని సారిక అన్నారు.