
సాక్షి, హైదరాబాద్: ఆండ్రియా రూటే సెపరేట్ అనవచ్చు. చర్చనీయాంశ పాత్రల్లో నటించే ధైర్యం ఉన్న అతికొద్దిమంది నటీమణుల్లో ఈ భామ ఒకరు. దర్శక నిర్మాతలు కూడా ఈ అమ్మడిని సాదాసీదా హీరోయిన్ పాత్రలకు ఎంపిక చేయరు. తాజాగా ధనుష్ హీరోగా నటిస్తున్న వడచెన్నై చిత్రంలో వేశ్యగా విభిన్న పాత్రలో కనిపించనుందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన తుప్పరివాలన్ చిత్రంలో నెగిటివ్ పాత్రలో నటించిన ఆండ్రియా తాజాగా సిద్ధార్థ్‌తో కలిసి బాలీవుడ్‌లో మెరవడానికి రెడీ అవుతోంది.
ఇక సిద్దూ కూడా దక్షిణాదిలో కనిపించి చాలా కాలమైంది. ఇప్పుడు మళ్లీ స్పీడ్ పెంచాడు. యువ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్‌కుమార్‌తో కలిసి ఒక ఫ్యామిలీ ఎంటర్‌టెయినర్ మల్టీస్టారర్ చిత్రంలో నటించనున్నాడు. ఈ నెలలోనే సెట్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. దీంతోపాటు సిద్ధార్థ్ మరో చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. హిందీ దర్శకుడు మిలింద్‌రావ్ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి 'ది హౌస్ నెక్ట్స్ డోర్' అనే టైటిల్‌ను నిర్ణయించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందనున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌కు జంటగా నటి ఆండ్రియా నటించనుంది.
ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇది హర్రర్ కథా చిత్రంగా ఉంటుందని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు సిద్ధార్థ్ పేర్కొన్నారు. మొత్తం మీద నటి ఆండ్రియా ఈ చిత్రంతో కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అంటూ సినీ థియేటర్లలో చక్కర్లు కొట్టడానికి రెడీ అవుతోందన్న మాట.