భరత్‌కు అండగా ఉంటా
నటుడు భరత్‌కు అండగా ఉంటానని నటుడు, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ అన్నారు. భరత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సింబ. సినీరమ స్టూడియోస్ శవనేశ్వరన్, యశోద పిక్చర్స్ గోల్డ్ మనోజ్ నిర్మిస్తున్న ఇందులో భాను మెహ్రా, స్వాతి దీక్షిత్ కథానాయికలుగా నటించారు. నటుడు ప్రేమ్‌జీ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ద్వారా అరవింద్ శ్రీధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం స్థానిక సత్యం థియేటర్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విశాల్, దర్శకుడు మిష్కన్, వెంకట్‌ప్రభు, జయంరవి, ఉదయ, స్నేహా, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. చిత్ర ఆడియోను విశాల్ ఆవిష్కరించగా వెంకట్‌ప్రభు, ప్రసన్న, స్నేహ తొలి సీడీ అందుకున్నారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ భరత్ తనకు మంచి మిత్రుడన్నారు. కోలీవుడ్‌లో విజయ్ తరువాత అంత మంచి డ్యాన్సర్ భరత్ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి చిన్న టైటిల్ సమస్య వచ్చినప్పుడు నడిగర్ సంఘం తరఫున తాము అండగా నిలిచామని తెలిపారు.
ఇకపై కూడా నటుడు భరత్‌కు అండగా ఉంటానని అన్నారు. సింబ చిత్రం ఒక కొత్త ప్రయోగం అని పేర్కొన్నారు. ఇది మంచి విజయం సాధించి భరత్‌తో పాటు చిత్ర యూనిట్ అందరికీ మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉందన్నారు. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మంచి బాణీలను అందించారని, ఆయనతో కలిసి చిత్రం చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ముందుగా భరత్ భార్య, సంగీత దర్శకుడి భార్య, దర్శకుడి తల్లి, నిర్మాతల కుటుంబ సభ్యులు మహిళా దినోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేయడం విశేషం.