![Simbu is Next Tamil Bigg Boss Fourth Season Host - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/21/bigg-boss.jpg.webp?itok=9Z-AWd2w)
తమిళనాడు ,పెరంబూరు: ఇప్పుడు తమిళం, తెలుగునాట వాడివేడిగా సాగుతున్న చర్చ బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో గురించేనంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఆ రియాలిటీషోలకు ఇంటిల్లి పాది ముఖ్యంగా యువత విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. ఈ రియాలిటీ గేమ్ షో అన్నది బాలీవుడ్ నుంచి మనకు పాకింది. ముఖ్యంగా తమిళంలో బిగ్‌బాస్ సీజన్ 1, 2, ఇంటి సభ్యుల మధ్య మనస్పర్థలు, వివాదాలు, కారాలు, మిరియాలు, ఆవేదనలు, అలకలు, సరదాల సందడి వంటి సంఘటనలతో ఆసక్తిగా సాగింది. ఇప్పుడు సీజన్–3 కూడా అదే ఆరోపణలు, వివాదాలతో ఆసక్తిగా సాగుతూ ముగింపునకు చేరుకుంది. అవును మరికొద్ది రోజుల్లో బిగ్‌బాస్ 3 ముగియనుంది. ప్రస్తుతం నటి షెరిన్, లాష్మియా, దర్శకుడు చేరన్, కవిన్, శాండి, దర్శిన్, ముకిన్ ఇంటిసభ్యులుగా గెలుపు కోసం పోటీ పడుతున్నారు. విశేషం ఏమిటంటే ఈ మూడు సీరీస్‌కు నటుడు కమలహాసన్‌నే వ్యాఖ్యాతగా వ్యవహరించారు. బిగ్‌బాస్ ఇంత సక్సెస్ కావడానికి ఆయన ప్రధాన కారణం అని చెప్పవచ్చు.
కాగా ఇప్పుడు ఆయన సినిమాలతో, రాజకీయాలతో బిజీగా ఉండడంతో బిగ్‌బాస్ సీజన్ 4కు ఎవరు వ్యాఖ్యాత అన్నది చర్చనీయాంశంగా మారింది. అంతే కాదు నటుడు సూర్య, శరత్‌కుమార్, శింబుల పేర్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సారి నటుడు శింబునే బిగ్‌బాస్ 4కు వ్యాఖ్యాతగా వ్యవహరించతోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్‌బాస్ 4కు నటుడు కమలహాసన్‌నే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారని ఆ కార్యక్రమం నిర్వాహకుడు స్పష్టం చేసి వదంతులకు బ్రేక్ వేశారు. హిందీలో ప్రసారం అయిన బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోను తమిళంలో ప్రసారం చేయడానికి విజయ్ టీవీ 6 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకుందని తెలిసింది. ఇప్పటికి మూడవ సీజన్ ముగియనుండడంతో 4వ సీజన్‌కు సంబంధించిన ప్రణాళికలకు చర్చలు జరుగుతున్నట్లు, ఆ సీజన్‌కు నటుడు కమలహాసన్‌నే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు నిర్వాహకుడు తెలిపారు. ఈ విషయంలో మరో నటుడితో ఒప్పందం వంటి ఆలోచనలే చేయలేదని ఆయన స్ఫష్టం చేశారు. సో బిగ్‌బాస్‌కు నటుడు కమలహాసన్ పేటెంట్ అన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment