
సాక్షి, తమిళ సినిమా: తమిళంలో జెస్సీ-కార్తీక్ కాంబినేషన్ మళ్లీ కుదరబోతుందా? అంటే కోలీవుడ్ నుంచి ఔననే సమాధానం వినిపిస్తోంది. గౌతం మీనన్ తెరకెక్కించిన ‘విన్నైతాండి వరువాయా’ (తెలుగులో ‘ఏ మాయ చేశావె) సినిమాలో జెస్సీగా త్రిష మెప్పించిన సంగతి తెలిసిందే. తెలుగులో జెస్సీ పాత్రతో సమంత అరంగేట్రం చేస్తే.. తమిళంలో జెస్సీగా తన కెరీర్‌లో ఒక మైలురాయిని త్రిష సొంతం చేసుకుంది. తమిళంలో త్రిషకు జంటగా శింబు నటించాడు. వీరు జోడీగా నటించిన ‘విన్నైతాండి వరువాయా’ చిత్రం ఒక ఫీల్ లవ్ స్టోరీగా మంచి విజయాన్ని సాధించింది.
ఇప్పుడు విన్నైతాండి వరువాయా జంటను మరోసారి తెరపై చూపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. మణిరత్నం తాజా ‘చిత్రం సెక్క సివంద వానం’ శింబుకు నూతనోత్సాహానివ్వగా, ఆ తర్వాత వచ్చిన ‘వందారాజా వాదాన్ వరువేన్’ (అత్తారింటికి దారిదే రీమేక్) నిరాశ పరిచిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ‘మానాడు’ అనే చిత్రంలో శింబు నటించబోతున్నారు. ఇందులో ఆయనకు జంటగా లక్కీ భామ రాశీఖన్నా నటించనున్నట్లు ప్రచారంలో ఉన్నా.. త్రిష అయితే బాగుంటుందని శింబు చెప్పడంతో దర్శకుడు వెంకట్‌ప్రభు ఆమెను నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నారని తెలిసింది. శింబు, త్రిష చిరకాల స్నేహితులన్న విషయం తెలిసిందే. ఈ జంట ఇప్పటికే అలై, విన్నైతాండి వరువాయా చిత్రాల్లో జోడీగా నటించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మానాడు సినిమాలో శింబు, త్రిష కలిసి నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment