కమల్ సరసన సిమ్రాన్..!
ఏజ్‌బార్ హీరోయిన్లకు ఇప్పుడు కాలం అనుకూలంగా ఉంది. ట్రెండ్ వాళ్లకు ఆహ్వానం పలుకుతోంది. 50 ప్లస్ హీరోలందరూ వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో కాస్త ఏజ్డ్ పాత్రలకు కూడా వాళ్లు ‘సై’ అనేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఆ పాత్రల్లో వారికి ఒక జోడీ ఉండాలి కదా. ఆ జోడీ కూడా హీరోకు తగ్గట్టు కాస్త ఏజ్డ్‌గా ఉండాలి కదా. ఇదిగో... సరిగ్గా ఏజ్‌బార్ హీరోయిన్లకు కలిసొచ్చిన అంశం ఇదే. మలయాళ ‘దృశ్యం’ తమిళంలో, తెలుగులో రీమేక్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ‘దృశ్యం’లో హీరోహీరోయిన్లు వయసొచ్చిన బిడ్డలకు తల్లితండ్రులు. మోహన్‌లాల్, మీనా ఆ పాత్రలు చేశారు.
తెలుగులో మోహన్‌లాల్ పాత్రను వెంకటేశ్ చేయబోతున్నారు. మాతృకలో చేసిన మీనానే ఇక్కడ కూడా హీరోయిన్‌గా బుక్ అయ్యారు. ఇక తమిళ ‘దృశ్యం’లో హీరో కమల్‌హాసన్. ఆయనతో జతకట్టే ఏజ్‌బార్ హీరోయిన్ ఎవరు? అనేది కొన్నాళ్లుగా నలుగుతున్న ప్రశ్న. మొన్నటిదాకా నదియా పేరు ఎక్కువగా వినిపించింది. అయితే... ఎట్టకేలకు ఆ పాత్రకు నిన్నటి మేటి కథానాయిక సిమ్రాన్ ఎంపికయ్యారు. కథానాయికగా కెరీర్ ముగిసిన తర్వాత కూడా మళ్లీ కమల్ లాంటి స్టార్‌తో నటించే అవకాశం రావడం మామూలు విషయమా? అయితే కమల్-సిమ్రాన్‌ది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి ‘బ్రహ్మచారి’, ‘పంచతంత్రం’ చిత్రాల్లో నటించారు. ఇటీవలే ‘ఆహా కల్యాణం’తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సిమ్రాన్‌కి ఇది నిజంగా సువర్ణావకాశమే!