ఎవర్నీ నొప్పించే ఉద్దేశం లేదు : మంచు విష్ణు
‘‘ ‘హృదయ కాలేయం’ చూశాక సంపూర్ణేశ్ బాబుతో సినిమా చేయాలని అనుకున్నా. ‘సింగం 123’ కేవలం ఓ స్పూఫ్ మాత్రమే. ఈ చిత్రాన్ని కామెడీ యాంగిల్‌లోనే చూడ మని నా తోటి నటీనటులను కోరుతున్నా. ఈ చిత్రంతో ఎవరినీ నొప్పించే ఉద్దేశం లేదు’’ అని మంచు విష్ణు అన్నారు. ఆయన నిర్మాతగా, సంపూర్ణేశ్ బాబు హీరోగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సింగం 123’. శేషు కేఎంఆర్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది.
ఈ సందర్భంగా సంపూర్ణేశ్ బాబు మాట్లాడుతూ -‘‘కరెంట్ తీగ సినిమాలో చిన్న రోల్ చేశాను. ఆ రోల్ నాకు చిన్నదైపోయిందేమో అని నన్ను హీరోగా పెట్టి ఓ సినిమా చేసేశారు. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు చేశాను’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘విష్ణు నిర్మాతగానే కాకుండా ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ఓ డిఫరెంట్ సంపూను చూస్తారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ‘డైమండ్’ రత్నం, ఛాయాగ్రాహకుడు సతీశ్ ముత్యాల, నటులు వైవా హర్ష, విజయ్, అనంత్ తదితరులు పాల్గొన్నారు.