లాహోర్ : పాకిస్థానీ నటి మిషా షఫీ.. గాయకుడు, నటుడు ఆలీ జఫర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం పాక్‌లో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఆమెపై ఇన్నాళ్లు విమర్శలు చేస్తూ వచ్చిన జాఫర్ తాజాగా ఆమెకు లీగల్ నోటీసులు పంపారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు మిషా తనకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే రూపాయలు 100 మిలియన్ల (భారత కరెన్సీలో రూ. 6 కోట్ల) పరువునష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. తనకు వ్యతిరేకంగా మీషా చేసిన ట్వీట్లను తొలగించాలని, రెండు వారాల్లో తనకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆమెపై పోలీసు కేసు నమోదుచేస్తానని జాఫర్ హెచ్చరించినట్టు పాక్ మీడియా తెలిపింది. అయితే, జాఫర్ ఇచ్చిన నోటీసులు తన క్లయింట్‌కు అందలేదని మిషా లాయర్ తెలిపారు.
పాక్‌లో ప్రసిద్ధ నటిగా, గాయనిగా సుపరిచితురాలైన మీషా తాను ఇండస్ట్రీలో ఎదుగుతున్న సమయంలో వేధింపులు ఎదుర్కోలేదని, కానీ, నటిగా స్థిరపడి.. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత వేధింపుల బారిన పడ్డానని తెలిపారు. గాయకుడు అలీ జాఫర్ తనను లైంగికంగా వేధించాడని, అతని వల్ల తాను ఎంతో క్షోభకు గురయ్యానని ఆమె వెల్లడించడం సంచలనం రేపింది. ఆమె వెల్లడించిన విషయాలు పాక్‌లో దుమారం రేపాయి. పలువురు బాధితులు ముందుకు వచ్చి.. తాము ఎదుర్కొన్న లైంగిక అసభ్య ప్రవర్తన, లైంగిక వేధింపులు గురించి వెల్లడించారు. పలువురు మిషాకు అండగా నిలువగా.. ఇంకొందరు జాఫర్‌కు అండగా నిలిచారు. మరోవైపు తాను మిషాను లైంగికంగా వేధించలేదంటూ ఆమె ఆరోపణలను గాయకుడు జాఫర్ ఖండించారు. ఈ నేపథ్యంలోనే అతను మీషాకు లీగల్ నోటీసులు పంపాడు.
Comments
Please login to add a commentAdd a comment