‘దాదాపు పాతికేళ్లుగా ఈ రంగంలో ఉన్నాను. నా పాటలను, నన్నుఅభిమానులు ఎంతో ఆదరించారు.నా అభిమానులను నేరుగా కలుసుకొని కృతజ్ఞతలు తెలియజేసుకునే అవకాశం ఇప్పటికి వచ్చింది’ అంటున్నారు ప్రముఖ గాయని సునీత. ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ ఎలెవన్ పాయింట్ టు ఆధ్వర్యంలో శిల్పకళావేదికలో ‘మెలోడియస్ మూమెంట్స్ విత్ సునీత’ సంగీత ప్రదర్శన ఆగస్టు 4న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ పోస్టర్‌ను శుక్రవారం బంజారాహిల్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సునీత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తన మనోభావాలు పంచుకున్నారు.ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...
సాక్షి, సిటీబ్యూరో :టీవీ చానెళ్లకు సంబంధించి నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను. కానీ ఇలా ఇన్నేళ్లలో ఇంత పెద్ద ఆడిటోరియంలో చేయడం ఇదే ప్రథమం. ఇలా ఒక ఎక్స్‌క్లూజివ్ ప్రోగ్రామ్ ఎందుకు చేయలేదంటే.. ఏమో నాకే తెలియదు. నాకే ఆశ్చర్యం. ఓ క్వశ్చన్ మార్క్. ఏదేమైనా అభిమానుల కోసం తొలిసారి వారి సమక్షంలో పాడబోతున్నాను. వాళ్ల ఫీలింగ్స్ నేరుగా చూస్తూ, కృతజ్ఞతలు చెప్పే అవకాశం ఇది అనుకుంటున్నాను. ఏదైనా సంగీతాభిమానులు, మ్యూజిక్ సిటీలో ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించడం చాలా ఎగ్జయిటింగ్‌గా, థ్రిల్లింగ్‌గాను కొంచెం టెన్షన్‌గానూ ఉంది.
అమెరికాలో హిట్
మొదటి నుంచి నాకు లైవ్ బ్యాండ్‌తో చేయడం చాలా ఇష్టం. ప్లేబ్యాక్ ఎంత ఇష్టంగా పాడతానో, డబ్బింగ్ ఎంత ఇష్టంగా చెబుతానో లైవ్ బ్యాండ్‌తో పనిచేయడం కూడా నాకు అంతే. అయితే బహిరంగ ప్రదర్శనలు మాత్రం ఇప్పుడే సాధ్యమైంది. మార్చి, ఏప్రిల్‌లో ‘మెలోడియస్ మూమెంట్స్ విత్ సునీత’ పేరుతో అమెరికాలో 5 చోట్ల ప్రదర్శనలు ఇచ్చాం. అవి విజయవంతమయ్యాయి. దానినే ప్రస్తుతం నగరంలో నిర్వహిస్తున్నాం. తర్వాత వైజాగ్‌లో ఆగస్టు 11న ప్రదర్శన ఉంటుంది.
ఎన్నో మైలురాళ్లు
గాయనీగా నా కెరీర్ ప్రారంభించి దాదాపు పాతికేళ్లు అవుతోంది. బాలు, చిత్ర లాంటి అతిరథ మహారథుల తర్వాత వచ్చిన మార్పుల్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాలంటే ఇంతకాలం కూడా నేను విజయవంతంగా కొనసాగుతానని ఊహించలేదు. దేవుడి దయ సంగీతాభిమానుల, సినీ సంగీత దర్శకుల సహకారం నన్ను ఇంతకాలం సక్సెస్‌ఫుల్ సింగర్‌గా నిలబెట్టాయి. ఈ మధ్య కాలంలో చాలామంది కొత్త కొత్త సింగర్స్ వస్తున్నారు. అయినా ఎవరి ప్లేస్ వారికి ఉందనే నేనంటున్నాను. కొన్ని మంచి పాటలు మమ్మల్ని ఏరికోరి వరిస్తున్నాయి. అది చాలా ఆనందాన్నిస్తోంది.
‘మహానటి’ ఇష్టం
ఇటీవల కాలంలో నేను పాడిన పాటలలో నాకు బాగా నచ్చింది మహానటి. అలాగే కథానాయకుడులో చిత్రగారు నేను కలిసి పాడిన పాట కూడా. సంగీత దర్శకుడు రాధాకృష్ణ మంచి పాట పాడే అవకాశం ఇచ్చారు. అలాగే త్వరలో రానున్న చిరంజీవి గారి సినిమాలో కూడా డబ్బింగ్ చెప్పాను. అప్స్ అండ్ డౌన్ లేకుండా కెరీర్ సంతృప్తికరంగా సాగిపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment