మా అధ్యక్షుడిగా శివాజీరాజా
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈసారి ప్రశాంతంగా జరిగాయి. గత కమిటీ ఎంపిక విషయంలో రెండేళ్ల క్రితం జరిగిన రసాభాస గుర్తుండే ఉంటుంది. ఈసారి నూతన కమిటీ ఎంపిక సానుకూల వాతావరణంలో జరిగింది. ‘మా’ అధ్యక్షుడిగా నటుడు శివాజీరాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఉపాధ్యక్షులుగా ఎమ్.వి బెనర్జీ, కె.వేణుమాధవ్, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఎమ్.శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా ‘సీనియర్’ నరేశ్, సంయుక్త కార్యదర్శులుగా హేమ, ఎ.శ్రీరామ్ ఎన్నికైయ్యారు. కోశాధికారిగా పరుచూరి వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ‘‘మా’ సభ్యులు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాం. ‘మా’ 25 ఏళ్ల ఉత్సవాన్ని వైభవంగా జరపాలనుకుంటున్నాం. కళాకారుల శ్రేయస్సు కోసం వంద శాతం కృషి చేస్తాం’’ అని ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. ‘‘దాసరి నారాయణరావుగారి కృషితో ఈసారి ‘మా’ ఎన్నికలు పోటీ లేకుండా జరిగాయి’’ అని ‘సీనియర్’ నరేశ్ అన్నారు. ఈ కార్యవర్గం పదవీకాలం రెండేళ్లు కొసాగుతుంది.