
మోహన్‌బాబు, హరీష్, గుణ్ణం గంగరాజు, రాజేష్ శ్రీ చక్రవర్తి
ప్రముఖ సంగీత దర్శకులు చక్రవర్తి మనవడు రాజేష్ శ్రీ చక్రవర్తి హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ‘శివకాశీపురం’. హరీష్ వట్టికూటి దర్శకత్వంలో మోహన్‌బాబు పులిమామిడి నిర్మించారు. ప్రియాంక శర్మ హీరోయిన్. పవన్ శేష స్వరపరచిన ఈ సినిమా పాటలను దర్శక–నిర్మాత గుణ్ణం గంగరాజు విడుదల చేశారు. ‘‘ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లీష్ ఇన్‌స్ట్రక్టర్‌గా చేస్తూ, షార్ట్ ఫిల్మ్ తీసుకుంటున్న నన్ను దర్శకుడిగా మార్చారు మోహన్‌బాబు పులిమామిడిగారు. చక్రవర్తిగారి మ్యూజిక్‌కి పెద్ద ఫ్యాన్‌ని.
ఆయన మనవణ్ణి హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్‌కు టీనేజ్ లవ్‌స్టోరీ మిక్స్ చేసి రూపొందించిన చిత్రమిది. గ్రామీణ నేపథ్యంలో సహజంగా ఉంటుంది’’ అన్నారు హరీష్ వట్టికూటి. ‘‘చక్రవర్తిగారి మనవణ్ణి పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉంది. సీనియర్ నటి అంజలమ్మగారి తనయుడు చిన్నారావుగారి సమక్షంలో మా ఆడియో విడుదల చేయడం ఆనందంగా ఉంది. అంజలమ్మకు మా సినిమాను అంకితం చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత మోహన్‌బాబు. రాజేష్ శ్రీ చక్రవర్తి, పవన్ శేష, సంగీత దర్శకుడు ‘వందేమాతరం’ శ్రీనివాస్, దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.