ముక్కు అవినాష్ స్కిట్
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ ప్రోగ్రాంపై మరో వివాదం నెలకొంది. గతంలో ఓ కులాన్ని కించపరిచే విధంగా కమెడియన్ వేణు, అనాథ పిల్లలను అవమానించే విధంగా ఆది చేసిన స్కిట్‌లపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక వేణుపై భౌతికంగా దాడి కూడా జరిగింది. ఈ కామెడీ షోలో హాస్యం కన్నా బూతులు ఎక్కువగా ఉన్నాయని మహిళా సంఘాలు కేసులు కూడా నమోదు చేశాయి. అప్పట్లో ఈ స్కిట్స్ చేసిన కమెడియన్‌లు క్షమాపణలు కూడా తెలియజేశారు. షో నిర్వహకులు సైతం ఆ స్కిట్‌లను యూట్యూబ్ నుంచి తొలిగించారు.
అయితే తాజాగా ముక్కుఅవినాష్ చేసిన స్కిట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్ వాసులు, గల్ఫ్ కార్మికులు ముక్కు అవినాష్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత శుక్రవారం ప్రసారమైన షోలో ముక్కు అవినాష్ చేసిన స్కిట్ వారి మనోభావాలు దెబ్బతిసిందని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్కిట్‌లో ఏముందంటే.. జగిత్యాల బోర్డు పెట్టి మరీ చేసిన ఈ స్కిట్‌లో అసభ్యకర డైలాగ్స్ ఉన్నాయి. ఒక తల్లి(అవినాశ్) పనీపాటా లేని తన కొడుకు రాజు(కార్తీక్)ను తిడుతుంది. పక్కింటి సురేశ్ భార్యను వదలి గల్ఫ్ వెళ్లి పని చేసుకుంటున్నాడని, నువ్వు పడుకుని నిద్రపోతున్నావని అంటుంది. దీంతో రాజు ‘వాడు జాబ్ చూసుకుంటున్నాడు, వాడి పెళ్లాన్ని నేను చూసుకుంటున్నాను..’ అనే జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తాడు. దీనిపై తెలంగాణ ప్రజలతో పాటు హక్కుల సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. పొట్టకూటి కోసం పరాయి దేశాలకు వెళ్తున్న పేదలను అవమానించడం సరికాదని, జబర్దస్త్ నిర్వాహకులు, ముక్కు అవినాష్‌లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాయలేని పదాలతో సోషల్ మీడియా వేదికగా అవినాశ్‌ను తిడుతున్నారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకుంటే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment