
తండ్రితో సోనమ్ కపూర్
నా పదేళ్ల సినీ జీవితంలో నీతో కలిసి మొదటిసారిగా నటిస్తున్నా
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఈరోజు(సోమవారం) 62వ వసంతంలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా తన తండ్రికి బర్త్‌డే విషెస్ చెబుతూ... అనిల్ కపూర్ గారాల పట్టి, బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ చేసిన సోషల్ మీడియాలో చేసిన పోస్టు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘హ్యాపీ బర్త్‌డే నాన్న... ఈ ఏడాది మనిద్దరికీ గుర్తుండిపోతుంది. నా పదేళ్ల సినీ జీవితంలో నీతో కలిసి మొదటిసారిగా నటిస్తున్నా.. అలాగే నా పెళ్లి చూడాలన్న నీ కోరిక నెరవేరింది. ఇది నిజంగా మనకు పరిపూర్ణ సంవత్సరం. కొంచెం కష్టంగా... అంతకంటే ఎక్కువగా సంతోషంగా ఉంది కదా.. ప్రేమించడం, విలువలు పాటించడం ఇవి నువ్వు నాకు ఇచ్చిన బహుమతులు. కాబట్టి ప్రస్తుతం నీకు నేను ఇవ్వగలిగే కానుక ఏదైనా ఉందంటే వాటిని పాటించడమే. లవ్ యూ నాన్నా’ అంటూ ఆమె అనిల్ కపూర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా కెరీర్ పరంగా 2007 లో ‘సావరియా’ సినిమాతో బాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సోనమ్.. మొదట్లో సరైన హిట్లు లేక సతమతమయ్యారు. అయితే ఆ తర్వాత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం రాజ్ కుమార్‌కు జంటగా నటిస్తోన్న ‘ఏక్ లడ్‌కీ కో దేఖాతో ఐసా లగా’ సినిమాలో సోనమ్ కపూర్ తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇక ఈ ఏడాది మే 8న తన చిరకాల స్నేహితుడు ఆనంద్ అహుజాతో సోనమ్ ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే.