
నాకు 25.. అయితే ఏం?
నీకు 45.. నాకు 25.. అయితే ఏం? మనిద్దరం చూడచక్కని జంట అనిపించు కోగలం అనే స్థాయిలో ఐదేళ్ల క్రితం ‘థ్యాంక్యూ’ సినిమాలో అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్ కెమిస్ట్రీ పండించగలిగారు. అందుకే ఇద్దరి మధ్య 20 ఏళ్లు వయసు వ్యత్యాసం ఉందనే విషయం ప్రేక్షకులకు గుర్తు రాలేదు. ఈ జంట మరోసారి జతకట్టనున్నారు. ‘చీనీ కమ్’, ‘పా’ వంటి చిత్రాల ద్వారా విలక్షణ దర్శకుడని పించుకున్న ఆర్. బాల్కీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.
బాల్కీ చెప్పిన కథ వినగానే మరో ఆలోచనకు తావు లేకుండా అక్షయ్‌కుమార్– సోనమ్ కపూర్ ఈ చిత్రానికి సైన్ చేశారట. ఇందులో అమితాబ్ బచ్చన్ గెస్ట్ రోల్ చేయనున్నారట. ‘చీనీ కమ్’, ‘పా’ చిత్రాలు చేసినప్పుడు బాల్కీతో అమితాబ్‌కు మంచి అనుబంధం ఏర్పడింది. తాజా సినిమాలో గెస్ట్ రోల్ అంగీకరించడానికి ఆ ఒక్కటి చాలదా? పైగా బాల్కీ చిన్న పాత్ర ఇచ్చినా.. అది గొప్పగా ఉంటుందని అమితాబ్‌కు తెలుసు. వచ్చే ఏడాది షూటింగ్ మొదలు కానుంది.