నటి తనుశ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం సిని రంగంవారేకాక.. మీడియా రంగంలోని వారు ధైర్యంగా బయటకు వచ్చి తమకు ఎదురైన ఇబ్బందులను బయటపెట్టారు. బాలీవుడ్‌లోని చాలామంది ప్రముఖులు బాధితులకు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకడు రాజ్‌కుమార్ హిరాణీ మీద లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో సోనమ్ కపూర్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ చిత్రం పోస్టర్ నుంచి రాజ్‌కుమార్ హిరాణీ పేరు తొలగించారు.
అయితే మీటూ ఉద్యమం ప్రారంభం నుంచి బాధితులకు మద్దతు తెలిపిన సోనమ్ కపూర్ రాజ్‌కుమార్ హిరాణీ విషయంలో మాత్రం ఆయనకే మద్దతిస్తోంది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘మీటూ ఉద్యమంలో ప్రతి బాధితురాలిని నేను నమ్ముతాను. కానీ హిరాణీ విషయంలో నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను. హిరాణీ దర్శకునిగానే కాక వ్యక్తిగతంగా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి నాకు తెలుసు. నేను ఆయనను చాలా గౌరవిస్తాను. కానీ ఇప్పుడు నా సినిమా కూడా నాకు ముఖ్యమే. సినిమా విడుదలయ్యాక దీని గురించి మాట్లాడతాను. ఇక్కడ నేను ఒక్క విషయం అడగదల్చుకున్నాను.. హిరాణీ మీద వచ్చిన ఆరోపణలు నిజం కాదని తెలితే అప్పుడేంటి పరిస్థితి. ఒక వేళ అలాంటిదే జరిగితే ఈ ఉద్యమం పూర్తిగా దెబ్బతింటుంది’ అని తెలిపారు సోనమ్ కపూర్.
హిరాణీ మీద వచ్చిన లైంగిక వేధింపలు ఆరోపణలను ఆయన కుటుంబ సభ్యులే కాక స్నేహితులు, పలువురు నటులు కూడా కొట్టిపారేస్తున్నారు. తనను లైంగికంగా వేధించారంటూ హిరాణీ వద్ద పనిచేసిన సహాయ దర్శకురాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నటి దియా మీర్జా, రచయిత జావేద్ అక్తర్, హర్షద్ వాసి, షర్మాన్ జోషి తదితర ప్రముఖులు రాజ్‌కుమార్‌కు మద్దతుగా నిలుస్తుండగా... మరికొంతమంది మాత్రం ఈ విషయం గురించి పూర్తి నిజాలు బయటపడిన తర్వాతే మాట్లాడాల్సి ఉంటుందంటూ అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment