
ప్రతీ ఒక్కరు తమ కాళ్లపై తాము నిలబడి.. ఆర్థికంగా నిలదొక్కుకోవడమనేది జీవితంలో అత్యంత ముఖ్యమని బాలీవుడ్ ఫ్యాషన్ దివా సోనమ్ కపూర్ అన్నారు. తనకు పద్దెనిమిదేళ్లకే ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందని.. అయితే తానెప్పుడు దానిని దుర్వినియోగం చేయలేదని ఈ బ్యూటీ చెప్పుకొచ్చారు. విద్యాబాలన్ రేడియో షోలో సోనమ్ మాట్లాడుతూ.. ‘ అందరు భారతీయ పిల్లల్లాగే నాకు కూడా 18 ఏళ్లకే నా తల్లిదండ్రులు ఆర్థికంగా నాకు స్వేచ్ఛనిచ్చారు. అదేవిధంగా ప్రతీ విషయంలో నాకు నేనుగా సలహాలు తీసుకునేలా నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దారు. తప్పో ఒప్పో సొంత నిర్ణయాలు తీసుకున్నపుడే వ్యక్తిగా పరిణతి చెందుతారని మా నాన్న చెబుతూ ఉంటారు. అయితే నేనెప్పుడు ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు’ అని పేర్కొన్నారు.
తన తండ్రిలాగే ప్రతీ తండ్రి తమ బిడ్డలకు సొంతంగా ఎదిగే స్వేచ్ఛనివ్వాలని, అదే విధంగా పిల్లలు కూడా తల్లిదండ్రుల నిర్ణయాలు గౌరవిస్తూనే తమదైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలని సోనమ్ సూచించారు. కాగా 2007 లో ‘సావరియా’ సినిమాతో బాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు సోనమ్. విభిన్నమైన క్యారెక్టర్లతో ఆకట్టుకుంటూ ఈ ఏడాది ‘ఏక్ లడ్‌కీ దేఖా తో ఐసా లగా’ సినిమాతో బోల్డ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తొలిసారి తండ్రి అనిల్ కపూర్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ సినిమాలో సోనమ్ లెస్బియన్ పాత్రలో నటించారు. ప్రస్తుతం జోయా ఫ్యాక్టర్ సినిమా షూటింగ్‌లో ఆమె బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment