స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధూ బయోపిక్‌పై ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లోనూ ఆసక్తి నెలకొంది. సింధూ బయోపిక్‌ను తానే స్వయంగా నిర్మించనున్నట్లు ప్రకటించిన సోనూసూద్... దానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. కేవలం ఆటకే పరిమితం కాకుండా ఓ ఫ్యామిలీ డ్రామాగా రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. మరో నెల రోజుల్లో స్క్రిప్ట్ పూర్తవుతుందని, వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో షూటింగ్‌ప్రారంభమవుతుందని చెప్పారు.
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బయోపిక్ విషయంలో చాలా ఏళ్లు నిరీక్షించగా... చివరికి గతేడాది అది సాధ్యమైంది. అందులో సచిన్ నటించడంతో పాటు పాత వీడియోలనూ చూపించారు. ఇప్పుడదే తరహాలో సింధూపై బయోపిక్ తీస్తానంటూ సోనూసూద్ ప్రకటించడంతో రెండేళ్ల ఉత్కంఠకు తెరపడింది. సింధూ తల్లిదండ్రులు కూడా క్రీడాకారులు. తండ్రి రమణ అర్జున అవార్డు గ్రహీత. బయోపిక్‌లో కుటుంబ నేపథ్యాన్ని కూడా వివరించాలని అనుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ఇటీవల సింధూ ఇంటికి వచ్చిన సోనూసూద్ ఆమె అభిరుచులు, కుటుంబ నేపథ్యం తెలుసుకున్నారు.
మిగతా భాషల్లోనూ...
కేవలం తెలుగు, హిందీకే పరిమితం కాకుండా అన్ని భాషల్లోనూ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సోనూసూద్ చెప్పారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రాజెక్ట్ పనులు కూడా పూర్తికావొచ్చినట్లు తెలిసింది. సింధూ బయోపిక్‌పై తామెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని తెలుగు, హిందీ, తమిళ ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంపై సోనూసూద్ ఆనందం వ్యక్తం చేశారు.
అన్ని అంశాలతో...
వాస్తవానికి సింధూ బయోపిక్ విషయం రెండేళ్లుగా చక్కర్లు కొడుతోంది. అయితే సోనూసూద్ తానే స్వయంగా చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది. ఇక సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి సినీ ప్రేక్షకుల్లో నెలకొంది. కేవలం సింధూ ఆట, జయాపజయాలకు మాత్రమే పరిమితమవడం తనకు ఇష్టం లేదని సోనూసూద్ స్పష్టం చేశారు. ఆమె చిన్నప్పటి నుంచి ఇప్పుడీ స్థాయికి రావడానికి కష్టపడిన తీరు, అందులో తల్లిదండ్రుల పాత్ర తదితర అంశాలతో ఫ్యామిలీ డ్రాగా చిత్రీకరించనున్నట్లు తెలిపారు. మరో నెల రోజుల్లో స్క్రిప్ట్ పూర్తవుతుందని, రెండు నెలల్లో నటీనటుల వివరాలు ప్రకటిస్తామని చెప్పారు.
ప్రేక్షకుల నిర్ణయమే...
సింధూ పాత్రలో ఎవరు నటించాలనే దానిపై యూత్‌ను సంప్రదిస్తున్నట్లు సోనూసూద్ వెల్లడించారు. ప్రేక్షకులు ఎవరిని రిఫర్ చేస్తే వాళ్లనే ఎంపిక చేస్తామన్నారు. ఒకవేళ ప్రేక్షకులు సింధూనే నటించాలని కోరితే ఆమెను ఈ మేరకు ఒప్పిస్తామన్నారు. సింధూనే నటిస్తేబాగుంటుందనే ఆలోచన తమకు కూడా ఉందన్నారు. ఒకవేళ ఆమెకు నటించే ఉద్దేశం లేకపోతే కొద్దిసేపు అయినా సినిమాలో కనిపించేలా చూస్తామన్నారు.
తుది దశలో...
సింధూ బయోపిక్ తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. టైమ్ సెట్ అవ్వలేదు. ఇన్ని రోజులుగా కథ ఎంపిక, సింధూ జీవిత విశేషాలను తెలుసుకునే పనిలోనే నిమగ్నమయ్యాను. నెల రోజుల్లో స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేస్తాను. ఆ తర్వాత దర్శకుడు, సింధూ పాత్రధారి, ఇతర నటీనటుల విషయాలు ప్రకటిస్తాను. తొలుత ఒలింపిక్ వరకే నిర్మించాలని అనుకున్నాను. అయితే ఆమె ఆ తర్వాత కూడా విజయాలు సాధిస్తూనే ఉంది. ఆ విషయాలన్నీ పొందుపరిచి ఫ్యామిలీడ్రామాగా చిత్రీకరిస్తాం. – సోనూసూద్, నటుడు
దానిపై ఆలోచిస్తాం..
సింధూ బయోపిక్ విషయం తెలిసినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నాం. సింధూ ఇన్నేళ్లు ప్రయాణించి ఇప్పుడు శిఖర స్థాయిలో ఉంది. ఆమె జీవితంలో ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు పెద్దగా ఎవరికీ తెలియవు. ఈ బయోపిక్‌లో కష్టం, సంతోషం, అనుభవాలు చూపించేందుకు సిద్ధపడడం గర్వంగా ఉంది. సింధూ పాత్రలో ఎవరు నటిస్తారనే విషయంలో మాకూ స్పష్టత లేదు. అయితే సింధూనే నటించాలని మమ్మల్ని అడిగితే, దానిపై ఆలోచిస్తాం.
– రమణ, విజయలక్ష్మి(సింధూ తల్లిదండ్రులు)
Comments
Please login to add a commentAdd a comment