చిక్కుల్లో ‘క్వీన్’
చెన్నై: ప్రారంభానికి ముందే క్వీన్ చిత్రం చర్చనీయాంశనీయంగా మారింది. బాలీవుడ్‌లో సంచన విజయం సాధించిన చిత్రం క్వీన్. నటి కంగనారావత్ నటించిన ఈ చిత్రం ఆమె స్థాయిని పెంచడంతో పాటు అవార్డులను తెచ్చిపెట్టింది. అలాంటి చిత్రాన్ని దక్షిణాధి భాషలలో నిర్మించే హక్కులను సీనియర్ దర్శక నటుడు త్యాగరాజన్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో క్వీన్ పాత్రలో నటించే నటి ఎవరన్న విషయం ఆసక్తిగా మారింది. తొలుత మిల్కీబ్యూటీ తమన్నాను క్వీన్‌ను చేయాలని నిర్మాత వర్గం భావించింది. అయితే ఈ అమ్మడు అధిక పారితోషికాన్ని డిమాండ్ చేయడంతో వేరే హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని తమిళం, కన్నడం భాషలో నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాదు ఈ చిత్రానికి వానిల్ తేడి నిండ్రేన్ అనే టైటిల్‌ను నిర్ణయించి హీరోయిన్ ఎంపిక జరగకుండానే చిత్రీకరణను ప్రారంభించారు. నటుడు నాజర్ తదితరులు పాల్గొన్న కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.
ఇదీ వివాదం
కాగా గోల్డెన్ క్లబ్ ఫిలింస్ అనే లండన్‌కు చెందిన ప్రొడక్షన్ సంస్థ ఒక షాక్ ప్రకటనను విడుదల చేసింది. క్వీన్ చిత్ర దక్షిణాది భాషా చిత్రాల హక్కులు తమకు చెందినవనీ, తాను స్టార్ మూవీస్ సంస్థ అధినేత త్యాగరాజన్‌ను భాగస్వామిగా చేర్చుకున్నామనీ పేర్కొంది. క్వీన్ చిత్రం తమిళ, కన్నడ భాషల్లో చిత్రీకరణ జరుపుకుంటోందన్న విషయం తెలిసి తాము షాక్‌కు గురయ్యామనీ సంస్థ అధికార వర్గాలు తెలిపాయి. క్వీన్ చిత్ర దక్షిణాది రీమేక్ హక్కులను తాము బ్రిటీష్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్(బీఎఫ్‌ఐ)లో రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. ఇందులో నటించే నటవర్గాన్ని తాము ఎంపిక చేసే పనిలోనే ఉన్నామన్నారు. ఈ వ్యవహారంపై తదుపరి ప్రకటనను త్వరలోనే వెల్లడిస్తామనీ పేర్కొన్నారు. దీంతో క్వీన్ చిత్రం చిక్కుల్లో పడినట్లయ్యింది.