స్టంట్‌ యూనియన్‌ స్వర్ణోత్సవాలు | Southern Indian Film, TV Stunt Masters and Stunt Artists Union's golden festival | Sakshi
Sakshi News home page

స్టంట్‌ యూనియన్‌ స్వర్ణోత్సవాలు

Published Fri, Aug 25 2017 1:01 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

స్టంట్‌ యూనియన్‌ స్వర్ణోత్సవాలు - Sakshi

స్టంట్‌ యూనియన్‌ స్వర్ణోత్సవాలు

పెరంబూరు:  దక్షిణ భారత సినీ, టీవీ స్టంట్‌ మాస్టర్స్‌ అండ్‌ స్టంట్‌ కళాకారుల యూనియన్‌ స్వర్ణోత్సవం నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో శనివారం నిర్వహించనున్నట్టు ఆ సంఘ అధ్యక్షుడు అనల్‌ అరసు వెల్లడించారు. గురువారం స్థానిక వడపళనిలోని స్టంట్‌ యూనియన్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అనల్‌అరసు పేర్కొంటూ 1966లో స్టంట్‌ మాస్టర్‌ పులికేసి కన్నుమూయగా ఆయన అంత్యక్రియలకు కూడా డబ్బు లేక అవస్థలు పడిన పరిస్థితి నెలకొందన్నారు.

ఆ సమయంలో ప్రఖ్యాత దర్శకుడు విఠలాచార్య సలహా మేరకు 1967లో స్టంట్‌ కళాకారుల యూనియన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. అలా దినదినాభివృద్ధి చెందిన యూనియన్‌ 50 వసంతాలు పూర్తి చేసుకుందన్నారు. ఈ స్వర్ణోత్సవాలను శనివారం సాయంత్రం నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నట్టు  తెలిపారు. రజనీకాంత్, కమలహాసన్, తెలుగులో చిరంజీవీ, బాలకృష్ణ, మలయాళంలో మోహన్‌లాల్‌ ఇలా అన్ని దక్షిణాది భాషలకు చెందిన సినీ ప్రముఖులను ఆహ్వానించినట్లు చెప్పారు. తమ విజ్ఞప్తి మేరకు శనివారం షూటింగ్‌లను రద్దు చేసిన తమిళ నిర్మాతల మండలికి కృతజ్ఞతలు తెలిపారు.

నృత్య దర్శకురాలు కళ నేతృత్వంలో..
స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని తారల ఆటా, పాటా, హాస్యం, పోరాట దృశ్యాలు అంటూ ఇంతకు ముందు కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించనున్నట్లు చెప్పారు. నృత్య కార్యక్రమాలకు డాన్స్‌మాస్టర్‌ కళ నేతృత్వం వహిస్తున్నారని తెలిపారు. నటి కాజల్‌ అగర్వాల్, నటి మాలాశ్రీ ఈ వేదికపై డాన్స్‌ చేయబోతున్నారని వెల్లడించారు. శ్రియ, తాప్సీ, నటుడు జీవా ఇలా చాలామంది ప్రేక్షకులను అలరించనున్నారని తెలిపారు. బాధిత కుటుంబాలకు సాయం: స్టంట్‌ వృత్తిలో మృతి చెందిన వారి కుటుంబాలకు, తీవ్రంగా గాయపడిన వారికి ఈ వేదికపై ఆర్థికసాయం అందించనున్నట్లు అనల్‌అరసు తెలిపారు. కార్యక్రమం శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 11గంటల వరకూ ఉంటుందని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement